హైకోర్టు వస్తే ఏం లాభం... నాలుగు జిరాక్స్ షాపులు మినహా...
రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీకి మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డి తీవ్రంగా విభేదించారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అంటూ నిలదీశారు.
హైకోర్టును కర్నూలుకు తరలిస్తే ఏం వస్తుందనీ, నాలుగు జిరాక్స్ షాపులు మినహా అని ఆమె వ్యాఖ్యానించారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది నీళ్లు, పరిశ్రమలని ఆమె అన్నారు. హైకోర్టును మంజూరు చేసి, సీమను ఉద్దరించామని చెప్పవద్దని కోరిన ఆమె, జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాలను కొనసాగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలో కొనసాగించాలని సలహా ఇచ్చారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలతో జగన్ సర్కారు ఆటలాడుతోందని అఖిలప్రియ విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.