ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (09:44 IST)

నిర్భయను రేప్ చేసే సమయంలో మైనర్‌ను.. దోషి పవన్ గుప్తా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో దోషిగా తేలిన నిందితుల్లో ఒకరైన పవన్ గుప్తా మరోమారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నిర్భయపై సామూహిక అత్యాచారం, దాడి జరిగినపుడు తాను మైనర్‌నని, తనకు వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా పిటిషన్‌ దాఖలు చేశాడు. 
 
దర్యాప్తు అధికారులు తన వయసును నిర్ధారించేందుకు ఆసిఫికేషన్‌ టెస్ట్‌ను (ఎముకల దృఢత్వాన్ని నిర్ధారించే పరీక్ష) చేయలేదన్నాడు. దీంతో మైనర్లకు వర్తించే జువెనైల్‌ చట్టాలతో తాను లబ్ధి పొందలేకపోయానని చెప్పాడు. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌ విచారణ జరుపనున్నారు. నిర్భయ కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకడు మైనర్‌ కావడంతో మూడేండ్ల శిక్ష అనంతరం విడుదలైన సంగతి తెలిసిందే.
 
కాగా, ఈ కేసులోని దోషుల్లో ఒకరైన అక్షయ్‌ కుమార్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలుచేయడానికి వీలుగా మరణ వారెంట్లు జారీచేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం, నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీలోని పటియాలా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అదనపు జడ్జి సతీశ్‌కుమార్‌ అరోరా విచారణ జరిపారు. 
 
నలుగురు దోషులు క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేస్తారో లేదో తెలుసుకోవాలని, వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని తీహార్‌ జైలు అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ పరిశీలించాల్సి ఉన్నదన్నారు. తదుపరి విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు తీహార్‌ జైలు అధికారులు నలుగురు దోషులకు నోటీసులు జారీచేశారు. క్షమాభిక్ష పిటిషన్‌పై ఏడు రోజుల్లోగా స్పందన తెలుపాలని ఆదేశించారు.