శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (16:35 IST)

నిర్భయ కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ బొబ్డే.. కారణం తెలిస్తే...

నిర్భయ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే తప్పుకున్నారు. ఈ కేసులోని దోషుల్లో ఒకరైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ బుధవారం ఉదయం 10:30 గంటలకు విచారణకు రానుంది. ఈ విచారణను ప్రధాన న్యాయమూర్తి మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. 
 
అక్షయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌లో తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ కోరారు. తనను తప్పుగా దోషిగా నిర్ధారించారని, పలు దేశాల్లో ఉరిశిక్షలను రద్దు చేశారంటూ పలు న్యాయ సంబంధిత వాదనలను అందులో పేర్కొన్నాడు. 
 
ముఖ్యంగా, ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యంపైనా అందులో ప్రస్తావించాడు. 'ఢిల్లీలో వాయు,నీటి కాలుష్యం వల్ల ఎలాగూ జీవితం హరించుకుపోతున్నది. ఇక ఉరిశిక్షలు ఎందుకు?' అంటూ సుప్రీంకోర్టును ప్రశ్నించాడు. 
 
సత్యయుగంలో ప్రజలు వెయ్యేండ్లపాటు జీవించేవారంటూ హిందువులకు సంబంధించిన వేదాలు, పురాణా లు, ఉపనిషత్తుల గురించి కూడా పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై నిర్భయ తల్లి తీవ్రంగా మండిపడ్డారు. 
 
మరోవైపు, ఈ కేసు విచారణ నుంచి సీజేఐ తప్పుకోవడానికి ప్రధాన కారణం ఉంది. ఈ పిటిషన్‌కు సంబంధించి నిర్భయ తరపున బాబ్డే కోడలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కోడలు వాదిస్తున్న కేసులో తాను తీర్పును వెలువరించలేదని ఆయన తెలిపారు. 
 
ధర్మాసనం నుంచి తాను తప్పుకుంటున్నానని చెప్పారు. విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి బాబ్డే కుటుంబంలోని ఒకరు నిర్భయ తల్లి తరపున వాదనలు వినిపించిన విషయం తెల్సిందే.