సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (12:38 IST)

తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్తగా సీహెచ్ రాములు

తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్తగా చింతపంటి వెంకట రాములు నియమితులయ్యారు. అలాగే, ఉప లోకాయుక్తగా ఒలిమినేని నిరంజన్ రావు ఎంపికయ్యారు. ఇక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తొలి ఛైర్మన్‌గా జస్టిస్‌ గుండె చంద్రయ్య, సభ్యులుగా సెషన్స్‌ కోర్టు జిల్లా జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ మొయినుద్దీన్‌లను నియమిస్తూ ప్రభుత్వం గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
 
లోకాయుక్త, ఉప లోకాయుక్తల పదవీకాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల పదవీ కాలం మూడేళ్లపాటు ఉంటుంది. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లను ఈ నెల 20నాటికి నియమించాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో నియామక కమిటీలు గురువారం ప్రగతి భవన్‌లో భేటీ అయ్యాయి. 
 
సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ఈ కమిటీల్లో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష ఉపనేత పాషాఖాద్రి, మండలిలో ఎంఐఎం పక్ష నేత జాఫ్రి ఉన్నారు. హక్కుల కమిషన్‌కు సంబంధించిన కమిటీలో అదనంగా హోంమంత్రి మహమూద్‌ అలీ ఉన్నారు. లోకాయుక్త, ఉప లోకాయుక్త, హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల పేర్లను ఈ కమిటీలు గవర్నర్‌ తమిళిసైకు పంపారు. ఆమె ఆమోదించడంతో ఉత్తర్వులు ఇచ్చారు.