గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (16:34 IST)

సీఎం నువ్వా? నేనా? అధికారం వైకాపాదా? లేక ఎస్ఈసీదా? జగన్ ప్రశ్నలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కోపం కట్టలు తెంచుకుంది. పంచాయతీ ఎన్నికలతో పాటు.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వాయిదాపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఒంటికాలిపై లేచారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వా? నేనా? అంటూ విరుచుకుపడ్డారు. వైకాపాకు ప్రజలు 151 సీట్లు కట్టబెట్టారని, అధికారం వైకాపాదా లేకా ఎస్ఈసీదా అంటూ నిలదీశారు. 
 
ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ దెబ్బకు అనేక అంతర్జాతీయ ఈవెంట్స్‌ను వాయిదా వేస్తున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఎన్. రమేష్ కుమార్ శనివారం ఆధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసేముందు ఎవరినైనా అడిగారా?.. చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన ఇంత వివక్షా? అని మీడియా సమావేశంలో సీఎం జగన్‌ ప్రశ్నించారు.  ఈసీ రమేష్‌ కుమార్‌ విచక్షణ కోల్పోయారు. ఎన్నికల వాయిదా ఆర్డర్‌ తయారవుతున్నట్లు ఈసీ సెక్రటరీకి కూడా తెలియదు. 
 
ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం ఎవరినైనా అడగాలి కదా? ఎవరైనా అధికారి పనిచేయాలంటే కులానికి, ప్రాంతానికి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండానే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నియమించిన వ్యక్తే నిమ్మగడ్డ రమేష్‌. బాబు పదవి ఇచ్చుండొచ్చు.. మీ ఇద్దరిది ఒకటే సామాజికవర్గం కావొచ్చు. స్థానిక ఎన్నికలపై చంద్రబాబు అండ్‌ కో నానాయాగీ చేస్తున్నారు. 
 
అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎక్కడిది. అధికారం 151 సీట్లున్న జగన్‌దా..? ఈసీదా..? ఇష్టం వచ్చినట్లు ఎన్నికలను వాయిదా వేస్తారా? ఎస్పీలను మార్చుతారు, కలెక్టర్లను మార్చుతారు. ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటారు. ఇక సీఎంలు ఎందుకు..? ప్రభుత్వాలు ఎందుకు..? అన్ని ఈసీయే చేసుకోవచ్చుగా.! పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే ఎలా అడ్డుకుంటారు..? వైసీపీ స్వీప్‌ చేస్తోంది. 9 వేలకు పైగా వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఈ శుభవార్త వారికి దుర్వార్త అయింది. దీన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు ఇంకా పడిపోతారని ఎన్నికలు వాయిదా వేశారని జగన్‌ మండిపడ్డారు. 
 
‘కరోనా’ సాకుతో ఎన్నికలు వాయిదా వేయడం సబబు కాదని, నిష్పాక్షికంగా ఉండాల్సిన ఎన్నికల కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‍తో మాట్లాడమని కోరామని చెప్పారు. రమేశ్ కుమార్‌లో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ ఆయనలో మార్పు రాకపోతే కనుక ఇంకా పైస్థాయిల్లో ఉన్న వ్యక్తుల దృష్టికి తీసుకెళతామని, రమేశ్ కుమార్ తీరును ఎండగట్టే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
 
‘కరోనా’ వైరస్ వల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నానని ప్రకటించిన రమేశ్ కుమార్, మాచర్ల సీఐ సహా గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను తప్పిస్తున్నట్టు ప్రకటించారని, వారిని తప్పించే అధికారం ఆయనకు ఎక్కడిది? అని ప్రశ్నించారు. ప్రజలు గెలిపిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిందని, తాను ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు. ఈ అధికారం జగన్మోహన్ రెడ్డిదా? రమేశ్ కుమార్ దా? అని జగన్మోహన్ ప్రశ్నించారు.