శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (15:24 IST)

విదేశాల నుంచి వచ్చినవారు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దు : ఏపీ సర్కార్

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతోంది. దీంతో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. అదేవిధంగా ఏపీ సర్కారు కూడా ఓ వైద్య బులిటెన్‌ను రిలీజ్ చేసింది. 
 
ఇదే అంశంపై ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక కరోనా బాధితుడు ఉన్నాడని... 14 రోజుల తర్వాత అతని నమూనాలను మళ్లీ పరీక్షించి విడుదల చేస్తామన్నారు. కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, నిరాధార ప్రచారాలను నమ్మొద్దని కోరారు. 
 
కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ ఏర్పాటు చేశామని చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 0866-2410978ని సంప్రదించాలని తెలిపారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి ఇప్పటి వరకు ఏపీకి 675 మంది వచ్చారని జవహర్ రెడ్డి చెప్పారు. వీరిలో 428 మంది వారి ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 
 
వీరిలో 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 61 నమూనాలను పరిశోధనాశాలకు పంపగా వీరిలో 52 మందికి నెగెటివ్ అని తేలిందని చెప్పారు. మరో 8 మంది రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నా, లేకపోయినా విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.