శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (17:19 IST)

అమరావతి రాజధాని ప్రాంత రైతులే బాగుపడాలా? అజేయ కల్లాం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లాం రాజధాని తరలింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంత రాజధాని రైతులో బాగుపడాలా? విశాఖపట్టణం, కర్నూలు జిల్లాల్లో ఉన్న రైతులు బాగుపడకూడదా అంటూ ఆయన ప్రశ్నించారు. దీంతో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సదస్సు సభకు వచ్చిన ప్రజలంతా కుర్చీల్లో నుంచి లేచిపోయి వెళ్లిపోయారు. 
 
మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో నారావారిపల్లె సమీపంలోని రంగంపేటలో ప్రజాసదస్సు పేరుతో బహిరంగ సభను చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహించారు. ఈ సభకు అజేయ కల్లాం హాజరై ప్రసంగించారు. 
 
రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వలాభం కోసమే ఆయన అమరావతిని రాజధానిగా నిర్ణయించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అమరావతి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలనూ తక్కువ చేసి మాట్లాడారు.
 
'అమరావతిలో ఉండేవారే రైతులా? ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రైతులు కాదా? ఒక్క రాజధానితో 20 గ్రామాల రైతులే బాగుపడాలా? కర్నూలు, విశాఖపట్నం రైతులు బాగుపడకూడదా?' అంటూ అజేయ కల్లాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భూముల ధర పెరిగితే అభివృద్ధి జరగదని అన్నారు. రాజధాని మధ్యలో ఉండాలని చంద్రబాబు అంటున్నారని, ఢిల్లీ నుంచి అమెరికా వరకు ఎక్కడా రాజధాని మధ్యలో లేదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. భూములు పోయాయనే అమరావతి పేరుతో కొందరు ఏడుస్తున్నారంటూ అజేయ కల్లాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
ఆయన ప్రసంగంతో సభకు వచ్చినవారంతా కుర్చీల్లోనుంచి లేచి వెళ్ళిపోసాగారు. దీంతో అజేయ కల్లాం తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేశారు. దీంతో సభ నిర్వాహకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి... సభకు హాజరైన ఇద్దరు మంత్రులను క్లుప్తంగా మాట్లాడాలంటూ మైకులో విజ్ఞప్తి చేయడం గమనార్హం. అంటే మూడు రాజధానులకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదనే విషయం ఈ సభతో తేటతెల్లమైంది.