ఏమిటీ జగన్మాయ... అలా చేస్తే పెన్షన్లు పెరగాలి కదా? తగ్గడమేంటి?
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన వారికి ప్రభుత్వం ఇచ్చే నెలవారి పింఛన్లపై ఆయన ఈ ప్రశ్నలు సంధించారు.
"పింఛను అర్హత వయసు ఐదేళ్లు తగ్గిస్తే, ఉన్న పింఛన్లు ఇంకా పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉంది. ఏమిటీ జగన్మాయ. 8 నెలల్లో 7లక్షల పించన్లకు కోత పెట్టడం, పండుటాకులను మోసం చేయడం కాదా? 45 ఏళ్లకే బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి మహిళలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి ఏమార్చడం మోసం కాదా?' అంటూ ప్రశ్నించారు.
'కేంద్రం ఇచ్చిన రూ.6 వేలకు అదనంగా రూ.12,500 ఇస్తామని చెప్పి, రైతులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతకు టోపి పెట్టారు. ఇంత మోసకారి కాబట్టే 12 చార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. అయినా మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదు' అని అన్నారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇలా చేయడం అన్యాయమని చంద్రబాబు విమర్శించారు.