సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (17:01 IST)

వైఎస్ షర్మిలను ఎత్తిపడేసిన మగ పోలీసులు... ఏపీలో మహిళా పోలీసులు లేరా?

ys sharmila
నిరుద్యోగ సమస్యలు, మెగా డీఎస్సీ అంశంలో ఏపీ కాంగ్రెస్ నేతలు గురువారం ఛలో సచివాలయం కార్యక్రమం చేపట్టారు. అయితే, మెగా డీఎస్సీకి మద్దతుగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కదం తొక్కారు. అయితే, ఆమెను విజయవాడ కరకట్ట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న షర్మిలను కిందకు దించగా, అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ఆమెతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించేందుకు పోలీసులు వారిని అడ్డుకుని, అక్కడ నుంచి బలంవంతంగా తరలించారు. అయితే, పోలీసులు తనను అరెస్టు చేసే సమయంలో తన చేతికి స్వల్ప గాయమైందని, షర్మిల వెల్లడించారు. జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను మరిచారని విమర్శించారు. మిగతా టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసేంతవరకు తమ పోరాటం ఆగదని షర్మిల స్పష్టం చేశారు. ఆ తర్వాత షర్మిలకు పోలీసులు 151 నోటీసులు ఇచ్చి అక్కడ నుంచి పంపించి వేశారు. 
 
కాగా, రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం 7 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదంటూ గతంలో చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద సమస్య నిరుద్యోగమేనని అన్నారు. అధికారంలోకి రాగానే 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని షర్మిల చెప్పారు. నాడు చంద్రబాబును అడిగిన ప్రశ్న నేడు మీకు వర్తించదా? అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. 
 
ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడి చేస్తున్నారనీ.. రాష్ట్రంలో జర్నలిస్టులపై అధికార పార్టీ కార్యకర్తలు, నేతలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏంచేస్తోందని వైఎస్ షర్మిల నిలదీశారు. ఏపీలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పోలీసులను అధికార పార్టీ బంటులలాగా వాడుకుంటూ నిరసనలను అడ్డుకోవడంపై మండిపడ్డారు. 
 
'రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆందోళనలకు భయపడాల్సిన అవసరం ఏముంది? జాబ్ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడంలేదా? రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ పాపం వైసీపీ ప్రభుత్వానిదే' అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.