శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (13:18 IST)

ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? జగన్‌పై షర్మిల విమర్శలు

ys sharmila
ఏపీ ముఖ్యమంత్రి, తన అన్న, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు విమర్శలు గుప్పించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని మరో రెండేళ్ళు కావాలంటూ వైకాపా నేతలు అడగడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. మీ చేతకానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అంటూ నిలదీశారు. రోజుకో వేషం, పూటకో మాట మాట్లాడే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగంగానే... ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. 
 
వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోయిందని... అందుకే ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే.. విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని, ప్రత్యేక ప్యాకేజీలు లేవని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని, కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు కూడా దిక్కులేదని షర్మిల అన్నారు. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదని... ఉన్నవి కూడా ఉంటాయో, లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత వైకాపా నేతలకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల వద్ద మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని షర్మిల దుయ్యబట్టారు. విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదని దుయ్యబట్టారు. ఏపీ రాజధాని ఏదని అడిగితే... పదేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపే చూపించే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు త్రీడీ గ్రాఫిక్స్ చూపిస్తే... మూడు రాజధానులంటూ జగనన్న మూడు ముక్కలాట ఆడారని ఆగ్రహం వ్యక్తంచేశారు.