1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (08:57 IST)

వైకాపాలో ఆధిపత్య పోరు.. కారుతో ఢీకొట్టి చంపేశారు...

murder
కృష్ణా జిల్లాలో వైకాపా అధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. దీంతో సొంత పార్టీ నేతనే అదే పార్టీకి చెందిన మరో నేత కారుతో ఢీకొట్టించి చంపేశాడు. వీరిద్దరూ డివిజన్ స్థాయి నాయకులే కావడం గమనార్హం. గతంలో జరిగిన వ్యక్తిగత గొడవలు, పార్టీ విభేదాలు హత్యకు దారితీశాయి. 
 
విజయవాడలో వైకాపా నేత సురేష్‌ను అదే డివిజన్‌కు చెందిన మరోనేత చౌడేష్‌ కారుతో ఢీకొట్టి చంపారని పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. వీరిద్దరూ విజయవాడ తూర్పు వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి అవినాష్‌ అనుచరులే. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలివి..
 
నగరంలోని 5వ డివిజన్‌ వైకాపా యువజన విభాగం అధ్యక్షుడుగా దేవి సురేష్ కొనసాగుతున్నాడు. శనివారం రాత్రి 7గంటల సమయంలో తన కుమారుడికి ఐస్‌క్రీమ్‌ తీసుకొచ్చేందుకు క్రీస్తురాజపురంలోని తన ఇంటినుంచి బయటకు వచ్చాడు. 
 
ఆ సమయంలో వైకాపా నాయకుడు కంకణాల చౌడేష్‌ నలుగురు మిత్రులతో కలిసి కారులో చక్కర్లు కొడుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్న సురేష్‌ను మద్యం మత్తులో వాహనం నడుపుతున్న చౌడేష్‌ ఢీకొట్టి.. ఈడ్చుకుంటూ వెళ్లాడు. 
 
చుట్టుపక్కల ఉన్న వారు కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. బంధువులు సురేష్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
 
అయితే, సురేష్‌ మచిలీపట్నం ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేటు డ్రైవరు. నిందితుడు చౌడేష్‌.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో పార్టీ పనులు చేస్తుంటాడు. 
 
2020లో బ్యానరులో ఫొటోల విషయంలో గొడవ జరగడంతో.. సురేష్‌, తన మిత్రులతో కలిసి చౌడేష్‌ను అతడి కుమారుడి ఎదుటే కొట్టాడు. దీనిపై మాచవరం పోలీసుస్టేషనులో అప్పట్లో కేసు నమోదుచేశారు. 
 
ఈ దాడిని అవమానంగా భావించిన చౌడేష్‌ పలుసార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. కేసుపై రాజీకి రావాలని రాజకీయ పెద్దలు సూచించినా చౌడేష్‌ అంగీకరించలేదు. చివరకు హత్య వరకు విషయం వెళ్లింది. ఈ ఘటన నేపథ్యంలో చౌడేష్‌, అతని స్నేహితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.