శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 11 మే 2021 (18:42 IST)

కష్టంలో ఉన్న పేదలను ఆదుకునే మంచి పథకం వైయస్‌ఆర్ బీమా: మంత్రి పెద్దిరెడ్డి

కుటుంబానికి అండగా వున్న వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబంకు అండగా నిలవాలనే మంచి ఉద్దేశంతో సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రారంభించిన వైయస్‌ఆర్‌ బీమా పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరినీ ఎన్‌రోల్ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లాల్లోని జెసిలు, డిఆర్‌డిఎ పిడి, ఎపిడి, బ్యాంకర్లతో మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైస్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమాతో భరోసా కల్పించాలని సీఎం శ్రీ వైయస్ జగన్ ఏటా వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం తరుఫున ప్రీమియంగా బ్యాంకులకు చెల్లిస్తున్నారని అన్నారు. అనుకోని ఆపద వచ్చి... పేద కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడకూడదని, వారికి కష్టసమయంలో బీమా మొత్తం లభించాలని నిర్థేశించిన ఈ పథకంకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

జిల్లాస్థాయిల జాయింట్ కలెక్టర్లు, డిఆర్‌డిఎ పిడి, ఎపిడిలు తమ పరిధిలో వైయస్‌ఆర్‌ బీమా ఎన్‌రోల్‌మెంట్ ఎలా జరుగుతుందో నిత్యం సమీక్షించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బీమా ఎన్‌రోల్‌మెంట్‌ ను నిర్దిష్ట సమయంలోగా పూర్తి చేయలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 62.43 లక్షల మందిని బీమా కింద ఎన్‌రోల్ అయ్యారని, ఇంకా 55.57 లక్షల కుటుంబాలను ఎన్‌రోల్ చేయాల్సి ఉందని అన్నారు. మరో నెలన్నరలోగా ఈ మొత్తం పూర్తి కావాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.48 కోట్ల రైస్‌కార్డులు ఉండగా వాటిల్లో 1.35 కోట్ల కుటుంబాల సర్వే (అంటే 91.22శాతం) పూర్తయ్యిందని అన్నారు. మిగిలిన కుటుంబాల సర్వే కూడా మూడు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 
 
వైయస్‌ఆర్‌ బీమాకు బ్యాంకర్లు సహకరించాలి
వైయస్‌ఆర్‌ బీమా పథకం దరఖాస్తులు బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉండటం పట్ల మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం వున్న వివరాల ప్రకారం దాదాపు12 బ్యాంకుల వద్ద 35.24 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో వున్నాయని, వెంటనే బ్యాంకర్లు దీనిపై దృష్టి సారించాలని కోరారు. సర్వే పూర్తయి, బ్యాంకుల వద్దకు వచ్చిన దరఖాస్తులను కూడా ఎన్‌రోల్‌ చేయపోవడం సరికాదన్నారు. గత ఏడాది బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల ఎన్‌రోల్ కాని పేదలకు కూడా బీమా మొత్తాలను సీఎం శ్రీ వైయస్ జగన్ మానవతాదృక్పథంతో ప్రభుత్వం తరుఫున చెల్లించారని, దీనిని బట్టి పేదల విషయంలో ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో బ్యాంకర్లు అర్థం చేసుకోవాలని కోరారు. 
 
బ్యాంకు సిబ్బందికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌కు చర్యలు
కోవిడ్ వ్యాప్తి విస్తృతంగా వున్న నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది కరోనా బారిప పడుతున్నారని, దానివల్ల కూడా సిబ్బంది కొరత ఏర్పడి సకాలంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయలేక పోతున్నామని కొందరు బ్యాంకర్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బ్యాంకు సిబ్బందికి పూర్తిగా వ్యాక్సినేషన్‌ కూడా జరగలేదని, దానికి ప్రభుత్వపరంగా ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రస్తుతం కోవిడ్ సమయంలో బ్యాంకు వేళలు కూడా తగ్గాయని, బ్యాంకు సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా అర్థం చేసుకుంటున్నామని అన్నారు. బ్యాంకర్లకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేయించేందుకు ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ)తో మాట్లాడి అందరికీ వ్యాక్సినేషన్ జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను, నగదు బదిలీని పేదలకు చేరువ చేస్తున్న బ్యాంకుల పట్ల ప్రభుత్వం బాధ్యతగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. 
 
పిఆర్ కమిషనర్ కార్యాలయం నుంచి జరిగిన వీడియో కాన్ఫెరెన్స్‌లో స్పెషల్ సీఎస్ (గృహనిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయాలు) అజయ్‌జైన్, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కార్మికశాఖ కమిషనర్ రేఖారాణి, సెర్ప్ సిఇఓ పి.రాజాబాబు, ఎస్‌ఎల్‌బిసి అధికారులు పాల్గొన్నారు.