ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మార్చి 2024 (12:24 IST)

ఈ నెల 10న వైకాపా మేనిఫెస్టో రిలీజ్

ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార వైకాపా త్వరోలనే మేనిఫెస్టోను రిలీజ్ చేయనంది. ఇందుకోసం ఈ నెల 10వ తేదీని ముహూర్తం ఖరారు చేసింది. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో నిర్వహించ తలపెట్టిన నాలుగో 'సిద్ధం' మహాసభ వేదికగా సీఎం జగన్ ప్రకటించనున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. 100 ఎకరాల విస్తీర్ణంలో 15 లక్షల మందితో ఈ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. పలువురు మంత్రులు, కీలక నేతలతో కలిసి 'సిద్ధం' సభ సన్నాహకాలను శనివారం పరిశీలించారు.
 
ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ వివరాలను విజయసాయి రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా 'సిద్ధం' మహాసభ ప్రచార' గీతాన్ని, గోడపత్రాలను ఆవిష్కరించారు. మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగు నాగార్జున, కాకాణి గోవర్ధన్రెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆదాల ప్రభాకర్రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నాలుగు ఉమ్మడి జిల్లాల అధికారపార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
కాగా, సార్వత్రిక ఎన్నికలతో పటు అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని విజయసాయి రెడ్డి అన్నారు. 'సిద్ధం' సభ తర్వాత సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు. 10న నిర్వహించనున్న సిద్ధం సభకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తామన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న కార్యక్రమాలను పరిశీలించి భవిష్యత్తులో పేదలకు మరిన్ని మెరుగైన పథకాలను మ్యానిఫెస్టోలో చేర్చుతామని చెప్పారు.