నెల్లూరు ఎంపీ ఆదాల కుట్ర వల్లే కేసు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మహిళా ఎంపీడీవో సరళపై దౌర్జన్యం చేసిన కేసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పైగా, ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీఎం... అధికారులపై మండిపడ్డారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అధికారుల్లో చలనం వచ్చింది. అయితే తన అరెస్టుపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేశారు. తాను ఎంపీడీవో సరళ ఇంటికి వెళ్లాననడం అవాస్తవమన్నారు.
ఈ విషయంలో టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. పైగా, ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైకాపాలో చేరిన తమ పార్టీకి చెందిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి తనకు కొన్నేళ్ళుగా వైరం ఉందని, తన అరెస్టుకు ఇది కూడా ఓ కారణం కావొచ్చని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
కాగా, కోటంరెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అలాగే, కోటంరెడ్డిని అరెస్టు చేసిన పోలీస్ స్టేషన్ వద్ద కూడా గట్టి భద్రతను కల్పించారు.