నెల్లూరు : వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు
నెల్లూరు జిల్లా గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీకి చెందిన శాసనసభ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే మద్యం సేవించి వచ్చి తనపై దౌర్జన్యం చేసి బెదిరించారంటూ వెంకటాచలం మహిళా ఎంపీడీవో సరళ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి వద్ద ఓ లేఅవుట్‌కు పైపులైను కనెక్షన్ కావాలని తనకు దరఖాస్తు చేసుకున్నారని.. దీంతో పరిశీలించడం ఆలస్యమైందన్న కారణంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్‌లో బెదిరించారని, శుక్రవారం రాత్రి కల్లూరుపల్లిలోని తన నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను బెదిరించారని ఎంపీడీవో సరళ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తిపై ఐపీసీ 448, 427, 290, 506 రెడ్‌విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.