మోసం కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టు??
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన్ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. టీవీ 9 కొత్త యాజమాన్యం చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
రవిప్రకాష్‌పై నిధులను దుర్వినియోగం చేశారంటూ టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ల అనుమతి లేకుండానే చెక్కులతో డబ్బులు డ్రా చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కోట్లాది రూపాయలను రవిప్రకాశ్ దుర్వినియోగం చేశారని తెలిపింది. దీంతో రవి ప్రకాశ్‌పై సెక్షన్ 409, 418, 420, 509ల కింద కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే.
టీవీ 9 నిధుల దుర్వినియోగం కేసులో రవి ప్రకాశ్‌తో పాటు... సినీ నటుడు శివాజీలకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసి, పలు రోజుల విచారణ జరిపారు. అపుడే రవి ప్రకాశ్‌ను అరెస్టు చేస్తారని భావించారు. కానీ, అపుడు వదిలిపెట్టిన పోలీసులు.. ఇపుడు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.