1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (11:54 IST)

ఫరూక్ అబ్దుల్లాపై ప్రజా భద్రతా చట్టం.. జైలుగా మారిన నివాసం

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కేంద్ర ప్రభుత్వం ప్రజా భద్రతా చట్టం (పి.ఎస్.ఏ)ను ప్రయోగించింది. దీంతో ఇప్పటివరకు గృహనిర్బంధంలో ఉన్న ఆయన ఇకపై జైలుపక్షిగా మారిపోయారు. పైగా, ఆయన నివాసం కూడా ఇపుడు జైలుగా మారిపోయింది. 
 
ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఫరూక్ అబ్దుల్లాను అత్యంత కఠినమైన ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేసినట్టు ప్రకటించింది. అలాగే, శ్రీనగర్‌లోని గుప్కార్‌ రోడ్డులో ఉన్న ఆయన నివాసాన్నే జైలుగా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
ఆదివారం రాత్రి ఒంటిగంటకు ఈ పీఎస్ఏ నిర్బంధ ఉత్తర్వును ఆయనకు అధికారులు అందించారు. కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అధికరణ 370 రద్దు చేసిన ఆగస్టు 5వ తేదీ నుంచి ఫరూక్ అబ్దుల్లాను శ్రీనగర్‌లోని గృహ నిర్బధంలో ఉంచిన విషయం తెల్సిందే. గతంలో కాశ్మీరీ నేత షా ఫైజల్‌ను సైతం పీఎస్‌ఏ కింద నిర్భందంలోకి తీసుకున్నారు. 
 
మరోవైపు ఫరూక్‌ అబ్దుల్లాను కోర్టు ఎదుట హాజరుపరచాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, జమ్మూకాశ్మీర్‌ అధికార యంత్రాంగానికి నోటీసులు జారీచేసింది. సెప్టెంబరు 30వ తేదీన ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టనున్నట్టు సుప్రీం బెంచ్‌ పేర్కొంది.