పల్నాడు పంతం : గృహ నిర్బంధంలో చంద్రబాబు - లోకేశ్
వైకాపా కార్యకర్తలు, నేతల దాడుల్లో గాయపడిన బాధితులను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. అయితే, శాంతిభద్రత పేరుతో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం అడ్డుకుంది. పైగా, టీడీపీ నేతలందరినీ హౌస్ అరెస్టు చేసింది. వీరిలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌తో పాటు.. అనేక మంది నేతలు ఉన్నారు.
ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు నిరసనకు పిలుపునిచ్చాయి. దీంతో నర్సారావుపేట, సత్తనపల్లి, పల్నాడు, గుజరాలాలో 144వ సెక్షన్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 గంటల పాటు ఆమరణ దీక్ష చేపట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సావంగ్ తెలిపారు.
ఛలో ఆత్మకూర్ ఆందోళన చేపడుతున్న టీడీపీ నేతలకు ఎటువంటి పర్మిషన్ లేదన్నారు. టీడీపీ క్యాడర్‌పై వైసీపీ నేతలు చేస్తున్న దాడులను ప్రజల్లోకి తీసుకువెళ్తామని బాబు అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేదిలేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ట్విట్టర్‌లో తెలిపారు. మొన్నటివరకూ తన ఇంటిదగ్గర 144 సెక్షన్ అమలు చేశారు, నిన్నటి నుంచి పల్నాడులో.. ఈరోజు ప్రతి తెదేపా నాయకుని ఇంటిముందు అమలు చేస్తున్నారు. ఇది తుగ్లక్ పాలనకు పరాకాష్టకు అని లోకేశ్ తన ట్విట్టర్‌లో తెలిపారు.