శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (18:50 IST)

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సహా ఆరుగురిపై కేసు

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్‌ మీద దాడి చేసిన ఘటనపై కేసు నమోదయింది. కాగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీరుపై టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మీడియాపై దాడులకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. కోటంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కోటంరెడ్డిపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. 
 
నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనపై దాడిచేసి కొట్టారని ‘జమీన్‌ రైతు’ వారపత్రిక ఎడిటర్‌ డోలేంద్ర ప్రసాద్‌ తెలిపారు. నెల్లూరులో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు కోటంరెడ్డి మాగుంట లేవుట్‌లో ఉన్న తన ఇంటికి పూటుగా మందుతాగి వచ్చారని డోలేంద్ర తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సొంత ఊరికి చెందిన డాక్టర్‌ వసుంధర, తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో.. ఎమ్మెల్యే ఆమె చేయిపట్టుకుని మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చారని చెప్పారు. 
 
వస్తూనే ‘‘ఏరా నేను అరాచక శక్తినంటూ.. నాపై అరపేజీ వార్త రాస్తావా? ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తా.. మూడు పేజీల వార్త రాసుకో’’ అంటూ బెదిరించారని తెలిపారు. అంతటితో ఆగకుండా ‘నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నన్నెవరూ ఏమీ పీకలేరు. ఎవరితో చెప్పుకుంటావ్‌ ఎస్పీతోనా, మంత్రితోనా, జగన్‌తోనా ఎవ్వరితో నైనా చెప్పుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ పీకలేరు’ అని బెదిరించారన్నారు. ఇంటివద్దకు వచ్చి రచ్చచేయడం ఏమిటని తాను ప్రశ్నించటంతో వెంటనే ఎమ్మెల్యే కొట్టారని డోలేంద్ర చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఉన్న పీఏ మురళి సహా మరికొందరు కూడా తనపై దాడి చేశారని తెలిపారు.