1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (15:48 IST)

సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు : కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి

నెల్లూరు జిల్లా కోవూరు అధికార వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చిత్రపరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఆయన సోమవారం తన నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం సినిమా వాళ్ల పొట్టలు కొడుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సినిమా వాళ్లు ఏపీని పట్టించుకోవడం లేదని, అసలు ఏపీకి సీఎం జగన్ అనే ఓ ముఖ్యమంత్రి ఉన్నారని నిర్మాతలకు, దర్శకులకు గుర్తుందా? అని ప్రశ్నించారు. సినిమా వాళ్లు హైదరాబాద్ నగరంలో ఉంటూ తెలంగామాలో సినిమాలు తీస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా అని ప్రశ్నించారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబే మాపియా కంటే ఓ పెద్ద లీడర్ అని, మళ్లీ ఆయన తమ మీద  ఆరోపణలు చేయడం అని నల్లపురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తమ వాళ్లు చిత్రపరిశ్రమలో ఉండటం వల్లే చిత్రపరిశ్రమకు చంద్రబాబు సపోర్టు చేస్తున్నారన్నారు. సినిమా టిక్కెట్లను తగ్గిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పేదల కోసమే ప్రభుత్వం సినిమా టిక్కెట్లను తగ్గించందన్నారు. 
 
సినీ హీరోలు కోట్లాది రూపాయల మేరకు రెమ్యునరేషన్ తీసకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, పేదలు సినిమా చూసేందుకు వెళితే రూ.వెయ్యి, రూ.2 వేలు చొప్పున ఖర్చు చేయాల్సివస్తుందని, అంత స్థోమత వారికి ఎక్కడ ఉందన్నారు. అందుకే సినిమా రేట్లను ప్రభుత్వం తగ్గించిందని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.