శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

న్యాయవ్యవస్థ కూడా ఆటలో ఓ పావే : సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ.రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారనే వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఇటీవల "ద హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ - (శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్) సవరణ బిల్లు -2021" చర్చ సందర్భంగా సీపీఎం రాజ్యసభ్యుడు జాన్ బ్రిట్టీస్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 
 
ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీజేఐ స్పందించారు. ఆదివారం విజయవాడలోని సిద్ధార్థం లా కాలేజీలో నిర్వహించిన లావు వెంకటేశ్వర్లు ఎండోమెంట్ లెక్చర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవలి కాలంలో జడ్జీలను జడ్జిలే నియమిస్తున్నారన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని, అయితే, అది ప్రచారం ఉన్న భ్రమ మాత్రమేనని చెప్పారు. 
 
మిగతా అన్ని వ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థ కూడా ఆటలో ఓ పావేనని అన్నారు. జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర ఉంటుందని ఆయన వివరించారు. జడ్జిల నియామకాల్లో ఇంత జరుగుతున్నా, అది తెలిసిన వాళ్లు కూడా జడ్జిలను జడ్జీలే నియమిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. 
 
పైగా, తమకు అనుకూలంగా తీర్పులు ఇవ్వకుంటే ఎన్నెన్నో నిందలు వేయడమే కాకుండా శారీరక దాడులకూ దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, ఇలాంటి ఘటనలపై కోర్టులు స్పందించేవరకు అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని, ఈ తరహా ఘటనలపై దర్యాప్తు కూడా చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు.