గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (13:24 IST)

స్వగ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణకు అపూర్వస్వాగతం - ఎడ్లబండిపై ఊరేగింపు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రెండేళ్ల తర్వాత ఆయన శుక్రవారం తన స్వగ్రామానికి వచ్చారు. దీంతో ఆయనకు గ్రామప్రజలు అపూర్వస్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ.రమణ ఓ రైతు బిడ్డ కావడంతో ఆయన ఎడ్లబండిపై గ్రామంలో ఊరేగిస్తూ స్వాగతం పలికారు. ఆయన ప్రయాణించిన దారిపొడవునా గ్రామ ప్రజలు పూలవర్షం కురిపించారు. 
 
అంతేకాకుండా, ఎన్వీ రమణ రాకతో గ్రామాన్ని అందంగా అలకరించారు. గ్రామం మొత్తం తోరణాలు కట్టారు. భారీ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్వీ రమణ దంపతులు స్వగ్రామానికి వచ్చారు. దీంతో కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామ ప్రజలు పులకించిపోయారు. 
 
ఈ గ్రామంలో జస్టిస్‌ కుటుంబానికి పొలాలు ఉన్నాయి. ఆయన పెద్దనాన్న కుమారుడు నూతలపాటి వీరనారాయణ కుటుంబం ఇక్కడే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం తన సోదరుడి నివాసంలో ఎన్వీ రమణ దంపతులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో ఆయన దాదాపు 4 గంటల పాటు గడపుతారు. 
 
కాగా, చీఫ్ జస్టిస్ రాక సందర్భంగా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామంలో కార్యక్రమాల ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, డీఐజీ మోహన్ రావు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షించారు.