1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మార్చి 2021 (16:03 IST)

వైకాపా వశమైన విశాఖ కార్పొరేషన్ : హిందూపురంలో ఎంఐఎం బోణీ!

విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో వైకాపా విజయభేరీ మోగించింది. మొత్తం 55 డివిజన్లలో వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ- 29, జనసేన-04, ఇతరులు-06 స్థానాల్లో గెలుపొందారు. 
 
కాగా.. ఆదినుంచి విజయవాడ, విశాఖపట్నంలో వైసీపీ జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్‌తో వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తూ వెళ్లింది. ఆదివారం ఎన్నికల ఫలితాలు మొదలైన నాటి నుంచి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠే నెలకొంది. 
 
అయితే 12 గంటల తర్వాత సీన్ మారిపోయింది. ఖచ్చితంగా గెలిచి తీరుతామని టీడీపీ.. సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా జెండా ఎగరేసి తీరుతామని వైసీపీ ధీమాతో ఉంది. ఆఖరికి విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకోవడంతో అన్నుకున్నది సాధించామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
 
కాగా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా వైసీపీ హవా నడిచింది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. 11 కార్పొరేషన్లలో 8 కార్పొరేషన్లను వైసీపీనే సొంతం చేసుకుందని తెలుస్తోంది. మరోవైపు 75 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 69 వైసీపీ కైవసం చేసుకుందని సమాచారం. టీడీపీ మాత్రం రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే గెలిచింది. ఇంకా కొన్ని చోట్ల ఫలితాలు రావాల్సి ఉంది.
 
ఇదిలావుంటే, అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో ఎంఐఎం బోణీ కొట్టింది. 16వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి జిగిని 123 ఓట్లతో విజయం సాధించారు. ఎంఐఎం ప్రధానంగా రాయలసీమపై దృష్టి సారించింది. హిందూపురంలో తప్ప మరెక్కడ ఎంఐఎం గెలువలేదు. 
 
గతంలో కర్నూలు జిల్లాకే పరిమితమైన ఆ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో పోటీ చేసింది. విజయవాడ, కర్నూలు కార్పొరేషన్లో పోటీ చేసింది. విజయవాడ కార్పొరేషన్‌లో 50, 54 డివిజన్లలో పోటీలో తలపడ్డారు. 
 
ఇక కడప జిల్లాలో ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాలోని ఆదోని, అనంతపురం జిల్లాలో హిందూపురం ముస్సిపాలిటీల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఎంఐఎం బరిలో దిగడం వెనుకు ఓ వ్యూహం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
ఎలా అంటే టీడీపీ, వైసీపీకి హోరాహోరీగా పోరు ఉన్న స్థానాల్లోనే ఎంఐఎం అభ్యర్థులను దింపారని పలువురు చెబుతున్నారు. టీడీపీ కాపాడుకుంటూ వస్తున్న ముస్లిం ఓటు బ్యాంకును చీల్చాడానికే ఎంఐఎం పోటీలో నిలబడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంఐఎం ఓట్లను చీల్చడం వల్ల వైసీపీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారనే విమర్శలు వెల్లవెత్తున్నాయి. 
 
మొత్తంగా టీడీపీని దెబ్బకొట్టేందుకు ఎంఐఎం ఈ ఎన్నికల్లో పోటీ చేసిందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సమయం కోసం ఎదురుచూసిన ఒవైసీ ఇప్పుడు తన పాచికలకు పని చెప్పారనే వాదన కూడా వినిపిస్తోంది.