నటీనటులు: నవీన్ పొలిశెట్టి-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ-ఫారియా అబ్దుల్లా-మురళీ శర్మ-వెన్నెల కిషోర్-నరేష్-బ్రహ్మాజీ-బ్రహ్మానందం తదితరులు; సాంకేతికతః ఛాయాగ్రాహణం: సిద్ధం మనోహర్, సంగీతం: రథన్, నిర్మాతః: నాగ్ అశ్విన్, రచన, దర్శకత్వం: అనుదీప్ కేవీ
సినిమాను వినోదాత్మకంగా చూపించడం ఒక కళ. అప్పట్లో జంథ్యాల, ఇవివి, ఎస్.వి. కృష్ణారెడ్డి చిత్రాలు అలానేవుండేవి. కొన్ని లాజిక్‌గా వుంటే మరికొన్ని లాజిక్కు గురించి ఆలోచించేలా వుండవు. ఫైనల్‌గా ప్రేక్షకులకు వినోదం ఇచ్చామా లేదా అన్నదే పాయింట్. ఇవి బాగా తెలిసిన నాగ్ అశ్విన్, నవీన్ పోలిశెట్టి చేసిన ప్రయత్నమే జాతిరత్నాలు. మరి వారేం చేశారో చూద్దాం.
కథ:
తెలంగాణలోని జోగిపేట ఊరు. శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి).. శేఖర్ (ప్రియదర్శి).. రవి (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. తింగరోళ్ళు. శ్రీకాంత్ కొద్దోగొప్పో చదివితే, మిగిలిన ఇద్దరు టెన్త్‌కూడా చదవరు. వారసత్వంగా మహిళా ఎంపోరియంను కాదని, హైదరాబాద్ వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించుకుని వస్తానని తండ్రి తనికెళ్ళ భరణితో నవీన్ సవాల్ చేసి బయలుదేరతాడు. అతన్ని మిలిగిన ఇద్దరూ ఫాలో అవుతారు. ఎలాగొలా ఓ ఉద్యోగం సంపాదించుకున్న శ్రీకాంత్, తన స్నేహితులతో పార్టీ చేసుకుంటాడు. అక్కడే క్రీడా మంత్రి హత్య కేసులో ఇరుక్కుంటారు. కేసునుంచి బయటపడేందుకు వారు ఏమి చేశారు? మధ్యలో చిట్టి పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ:
ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, ఆమధ్య విజయవాడకు చెందిన ఓ రాజకీయనాయకుడు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో బి.కాం.లో ఫిజిక్స్ చదివానంటాడు. అది పెద్ద వైరల్ అయింది. అలాగే ఓ చిన్న తప్పు చేస్తే నేరాలు ఘోరాలు అనే ప్రోగ్రామ్‌లో కల్పితపాత్రలతో ఎపిసోడ్ చేసేస్తారు. ఇవన్నీ చూడ్డానికి సరదాగానే వుంటాయి. అందుకే వాటినే సినిమా కథగా మార్చుకుని చేస్తే ఎలా వుంటుందనేది జాతి రత్నాలు. ఇందుకు సన్నివేశపరంగా కథ అల్లుకోవడం, సంభాషణలు రాసుకోవడం ఈ చిత్రంలో ప్రత్యేకత.
ఫైనల్‌గా ఏదిఏమైనా ప్రేక్షకుడిని నవ్వించామా లేదా అన్నదే ఇందులోని పాయింట్. ఈ ముగ్గురు చేసే తింగరి పనులు చూసేవాడికి నవ్వు తెప్పిస్తాయి. క్రీడామంత్రిని ఎవరో హత్యచేస్తే అది ఈ ముగ్గురిపైనా పడుతుంది. అందుకు కారణం వారు బాగా తాగి వుండడమే. ఎంత తాగినా వెంటనే పోలీసులను పిలిచి విషయం చేరవేయాలని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ వీరు ఆ బాడీని ఎక్కడైనా పాతేయాలని ప్లాట్‌లో పై నుంచి కిందకి తెచ్చి కారు పార్కింగ్‌వరకు వస్తారు. ఇంత లాజిక్‌లేకుండా ఎలా చేశారని అనిపిస్తుంది కొందరికి. కానీ మరికొందరికి వీరు చేసేది నవ్వు తెప్పిస్తుంది. సరిగ్గా రెండోవారికోసమే ఈ సినిమా చేశారు. కోర్డులో జడ్జి బ్రహ్మానందం పాత్ర, లాయర్‌గా చిట్టి పాత్ర, అసలు కేసు నడిచేవిధానం సిల్లీగా అనిపిస్తుంది. కానీ అవేవీ మనకు పట్టనట్లు అది సినిమా అనుకుని చూస్తే బాగుంటుంది.
కామేడీకోసం బుల్లితెరపై జబర్‌దస్త్ వంటి ప్రోగ్రామ్ వచ్చాక అంతకుమించి నవ్వించాలనే చాలామంది వెండితెరపై ప్రయత్నించారు. కానీ ఎక్కువశాతం సక్సెస్ కాలేకపోయారు. అందుకే ఆ మొఖాలకంటే కొత్తగా తమ ఫేస్‌లతో నవీన్‌పోలిశెట్టి స్నేహితులు చేసిన ప్రయత్నమే ఇది. మాటల విరుపులు, చలోక్తులు సామాన్యుడిని కూడా ఆకట్టుకుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటూ పేద్ద పేరు పెట్టుకుని అన్ని ఎమోషన్‌ను పండించిన నవీన్ పోలిశెట్టి ఈసారి పూర్తి వినోదాత్మకంగా చేశాడు.
దర్శకుడు అవినాష్ అంతకుముందు పిట్టగోడ అనే ప్లాప్ సినిమా తీసినా ఓ షార్ట్ ఫిలిం చూసి నాగ్ అశ్విన్ ఈయనకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమా చూశాక అన్నింటిలో బాగా నవీన్ పట్టు కనిపిస్తుంది. ఒక మంచి జోక్.. వచ్చే సందర్భాన్ని బట్టి దాన్నిపేల్చే నటుడిని బట్టి దాని చుట్టూ అల్లిన సన్నివేశాన్ని ఎలాగైనా ప్రేక్షకులకు చేరొచ్చు. జాతిరత్నాలులో జోకులన్నిటికీ కూడా ఈ మూడు అంశాలూ చాలా చక్కగా అమరాయి. తెరపై పాత్రలన్నీ చాలా మామూలుగా అనిపిస్తాయి. అలాగే మనం రోజూ స్నేహితుల మధ్య పేల్చుకునే జోకులు.. పంచులే తెరపైన వస్తుంటాయి. వాటిని తెరపై చూపించే ప్రయత్నమే ఈ సినిమా.
ఇక కథగా చెప్పాలంటే ఇందులో ఏ ప్రత్యేకత వుండదు. చిన్న పాయింట్ అది ఎటుపోతుందో అర్థంకాకుండా వుంటుంది. అల్లరి నరేష్ సినిమాలు అలా వుండేవి. కానీ పాత్రలే మారాయి. సిచువేషనల్ కామెడీతో సన్నివేశాలు సాగిపోతాయి. హీరోయిన్‌తో ఓ హోటల్లో ఉన్న హీరో ఇప్పుడొక ఫోన్ వస్తే బాగుంటుంది అనడం. వెంటనే ఫోన్ రాగానే.. మామా తాజ్ హోటల్లో ఉన్నా మళ్లీ చేస్తారా అంటూ ఫోన్ పెట్టేసి పోజు కొట్టడం లాంటి సన్నివేశాలు చూస్తే అప్పటికప్పుడు సీన్‌కు అనుగుణంగా రాసుకున్న సంభాషణలే.
ఇలాంటి చాలా సినిమాల్లో మిస్ అవుతున్నాయి. కావాలని కొన్నిచోట్ల కూరుస్తున్నట్లుగా కూడా వుంటుంది. అందుకే తీపి ఏదైనా కొద్దిగానే తింటే మంచిది. ఈ వెటకారపు మాటలు, హాస్యంకూడా ఒక దశలో శ్రుతి మించిన భావన కలుగుతుంది. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ నుంచి అది స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రిని ఎందుకు హత్యచేస్తారో, ఆయన ఫోన్‌లో ఏ రహస్యాలు వున్నాయో ఎవరికీ తెలియవు. కానీ ముగింపు ఇవ్వాలి. అందుకే ఏదోరకంగా కోర్టులో నవీన్ వాదించేసి అందరినీ మెస్మరైజ్ చేసేస్తాడు.
అలాంటివారినే జాతిరత్నాలు అంటారని దర్శకుడు ముగింపు ఇస్తాడు. ఇక క్రీడాశాఖ మంత్రిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు స్పోర్ట్స్‌మెన్‌గదా ఏ ఆట బాగా ఆడేవారని అడిగితే, క్రికెట్ అంటాడు. క్రికెట్‌లో మీ ప్రత్యేకత ఏమిటంటే.. గోల్‌కీపర్ అని బదులిస్తాడు. వెంటనే ఈయనో జాతిరత్నం అంటూ ముగింపుకార్డు పడుతుంది. సో. ఇంతసిల్లీగా సరదాగా వుండే సినిమా ఇది. ముగింపులో ఓ షాట్‌లో బ్లూ షర్ట్ అబ్బాయి అని నవీన్ పిలవగానే విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. పూర్తి తెలంగాణా యాసతో ఇక్కడి తింగరి కుర్రాలు చేసిన ఫన్‌ను కాసేపు ఎంజాయ్ చేయవచ్చు.