1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (17:11 IST)

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరగాలంటే హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచాలి : వైవీ సుబ్బారెడ్డి

yv subbareddy
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని మరికొంతకాలం ఉంచాలని వైకాపా ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పదేళ్ళు కావొస్తుందన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు హైదరాబాద్ నగరాన్ని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇపుడా గడువు కూడా పూర్తికావొస్తుందని, ఈ నేపథ్యంలో మరో ఈ గడువును మరో పదేళ్లపాటు పొడగించాలని ఆయన కోరారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని చెప్పారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వైకాపా నాయకత్వం దీనిపై దృష్టిసారిస్తుందని తెలిపారు. రాజధాని నిర్మించకుండా ఐదేళ్లపాటు తాత్కాలికం పేరుతోనే తెలుగుదేశం పార్టీ కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు.