ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 14 మే 2022 (22:46 IST)

అమిత్ షా: ‘తెలంగాణ నిజాంను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పీకి పారేస్తాం’

Amit Shah
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)ను తెలంగాణ నిజాం అని సంబోధించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. తెలంగాణలో నిజాంను తాము మార్చేస్తామని, రజాకార్ల ఒడిలో కూర్చుని పాలన చేస్తున్న కేసీఆర్‌ను మార్చేస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు కార్యక్రమంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 
ఈ సందర్భంగా అమిత్ షా ఏమన్నారంటే..
నా జీవితంలో ఇంత పనికిరాని, అవినీతి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు
ఈ యాత్ర ఒక పార్టీని తొలగించి, మరొక పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కాదు. ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేయడం కోసం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం కాదు. తెలంగాణ దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత కోసం చేపట్టిన యాత్ర
మజ్లిస్‌ను చూసి భయపడే కేసీఆర్‌ను (ముఖ్యమంత్రి స్థానం నుంచి) పీకి పారేసే యాత్ర
తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అని కేసీఆర్ హామీ ఇచ్చారు. అందులో ఏవీ పూర్తి కాలేదు. మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేం పూర్తి చేసి చూపిస్తాం.
కేసీఆర్ తెలంగాణను మరో బెంగాల్ చేయాలనుకుంటున్నారు. ఆయన్ని ఆపాలి
తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, చేయలేదు. ఎందుకంటే మజ్లిస్‌ను చూసి భయపడుతున్నారు. మజ్లిస్, కేసీఆర్ ఇద్దరినీ పీకి పారేయాలి.

 
అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే...
తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం లూఠీ చేస్తోంది. ఈ ప్రభుత్వం బారినుంచి ప్రజల్ని కాపాడుకోవాలని పాదయాత్ర చేస్తుంటే ప్రజలంతా ఎన్నో సమస్యలను నా ముందుకు తీసుకొచ్చారు.
తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పాలన సాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం వద్దే ఉన్నాయి. ఒక కుటుంబం రాజ్యమేలితే శ్రీలంక లాంటి పరిస్థితే మనకు వస్తుంది. ఈ ప్రభుత్వం, రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తోంది.
కేంద్రం ఇస్తున్న నిధులను డైవర్ట్ చేస్తూ ప్రజల్ని మోసగిస్తోంది.
పేదల స్థలాలను లాక్కుంటూ ధరణి పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది.
పేదవాళ్ల కోరికలు నెరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలి. అధికారంలోకి వస్తే అర్హులైన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మిస్తాం. ఉద్యోగాలు ప్రకటిస్తాం.