మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కేసీఆర్‌ను దించేందుకు బండి చాలు..!
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఆయన ప్రకటించారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేసిన బండి సంజయ్ తన యాత్రను శనివారం ముగించారు. దీనిని పురస్కరించుకుని, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే పనిలో పనిగా తెలంగాణలోని కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు బండి సంజయ్ ఒక్కడే చాలని కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో వారసత్వ రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని అమిత్ షా ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలను సాధిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్... ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.