సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 30 మార్చి 2021 (15:08 IST)

బంగ్లాదేశ్: ఆకలి కేకల నుంచి ఆత్మ నిర్భరత వరకు

1971లో బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చిన సమయంలో సహజ విపత్తులకు అతలాకుతలం కావడంతోపాటూ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలహీనంగా ఉండేది. దానికి కారణాలు ఉన్నాయి. ఆ దేశం అప్పుడు భారీ జనాభా, నిరక్షరాస్యత, తీవ్ర పేదరికం, తక్కువ పరిశ్రమలు లాంటి సవాళ్లను ఎదుర్కుంటోంది. అసలు బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాగించగలదా అని అప్పట్లో చాలామందికి సందేహం కూడా వచ్చింది.

 
బంగ్లాదేశ్ తన సమస్యలను పరిష్కరించుకోలేక, ఇతర దేశాల సాయంపై ఆధారపడే ఒక దేశంగా మిగిలిపోతుందని.. ఒకప్పుడు అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న హెన్రీ కిసింజర్ ఆ దేశ భవిష్యత్తును అంచనా వేసేశారు. కానీ, అదే బంగ్లాదేశ్ ఈ ఏడాది 50వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈ దేశాన్ని ఇప్పుడు ఆర్థిక విజయానికి ఉదాహరణగా వర్ణిస్తున్నారు. గత 50 ఏళ్లలో బంగ్లాదేశ్‌లో ఏమేం మారాయి, ఆ దేశం ఈ స్థాయికి చేరుకోవడం ఎలా సాధ్యమైంది?

 
వ్యవసాయ కూలీ నుంచి విత్తనాల సరఫరా వరకూ...
బంగ్లాదేశ్ విజయగాథ తెలుసుకోవాలంటే.. ఆ దేశ పౌరుడు ఎహసానుల్లా కథ తెలుసుకోవాలి. ఆయన కథ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి మనకు సాయం చేస్తుంది. బంగ్లాదేశ్‌కు స్వతంత్రం వచ్చిన సమయంలో మున్షీగంజ్ జిల్లాకు చెందిన ఎహసానుల్లాకు 16 ఏళ్లు. అప్పటికే, ఆయన తన తండ్రిని కోల్పోయారు. పొలాలు, డబ్బూ ఏమీ లేవు ఆయనకు. ఇతరుల పొలాల్లో కూలి పనులు చేస్తూ ఆయన తన కుటుంబాన్ని పోషించేవారు. కానీ, ఇప్పుడు ఆయనను ఆ ప్రాంతంలోనే ఒక సంపన్నుడుగా చెబుతారు.

 
ఇప్పుడు ఆయన 18 ఎకరాల్లో బంగాళాదుంపలు పండించడంతోపాటూ, విడిగా బంగాళాదుంప విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. ఆయన బంగ్లాదేశ్‌లోని చాలా జిల్లాలకు విత్తనాలను సరఫరా చేస్తున్నారు. "నేను వ్యవసాయం కోసం కొన్ని పొలాలు కౌలుకు తీసుకున్నా. నా కథ, అక్కడ నుంచే మొదలైంది. అప్పట్లో వరి, ఆవాలు, గోధుమలే పండించేవారు. కానీ, 80వ దశకంలో నేను బంగాళాదుంపలు పండించడం మొదలెట్టాను. వాటిలో కొత్త రకాలు సాగు చేశాను. ఆధునిక ఎరువులు ఉపయోగించాను. నా ఉత్పత్తి, మిగతావారికంటే ఎక్కువగా ఉండేది. లాభాలు కూడా పెరిగాయి. నా ఆర్థిక స్థితి రోజురోజుకూ మెరుగుపడింది" అని ఎహసానుల్లా చెప్పారు.

 
గత 50 ఏళ్లలో ఎహసానుల్లా ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మారిపోయింది. కానీ, ఇది ఆయన ఒక్కరి కథే కాదు. ఇది దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం కథ కూడా. గత కొన్ని దశాబ్దాలుగా దేశ వ్యవసాయ రంగంలో తిరుగులేని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సంప్రదాయబద్ధంగా వరి, గోధుమలు, మొక్కజొన్న, బంగాళాదుంపలు పండించిన దేశం ఇప్పుడు కాప్సికం, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ లాంటి కొత్త పంటలను కూడా సాగు చేస్తోంది. అందుకే బంగ్లాదేశ్‌లో చాలా మంది రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.

 
ఇప్పుడు బంగ్లాదేశ్ ఆహార పదార్థాల విషయంలో స్వయం సమృద్ధి సాధించింది. ఇది ఆ దేశం స్వతంత్రం సాధించిన సమయంతో పోలిస్తే పూర్తిగా భిన్నం. అప్పట్లో బంగ్లాదేశ్‌లో ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉండేది. 1974లో వచ్చిన కరవు వల్ల తూర్పు బెంగాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

 
ఆర్థికాభివృద్ధి దిశగా బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన సమయంలో, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలను చూస్తే మనకు కొన్ని స్పష్టంగా తెలుస్తుంది. అధికారిక గణాంకాల ప్రకారం 70వ దశకంలో బంగ్లాదేశ్ ఉత్పత్తి రేటు 3.6 శాతం. పేదరికం రేటు 60 శాతం. బంగ్లాదేశ్ ఎగుమతులు అప్పట్లో 29.7 మిలియన్ డాలర్లే ఉండేవి. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ ఎగుమతుల ద్వారా బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. 2020లో బంగ్లాదేశ్ ఎగుమతుల ద్వారా 39.6 బిలియన్ డాలర్లు ఆర్జించింది. కరోనా మహమ్మారి సమయంలో ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైతే, బంగ్లాదేశ్ జీడీపీ 5.24 శాతం ఆరోగ్యకరమైన రేటుతో పెరిగింది. 70వ దశకంతో పోలిస్తే, ఈరోజు ఆ దేశ తలసరి ఆదాయం 18 రెట్లు పెరిగింది. పేదరికం రేటు 20.5కు తగ్గింది.

 
2035 నాటికి బంగ్లాదేశ్ ప్రపంచంలోనే 25వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుతుందని ఇటీవల సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తన రిపోర్టులో అంచనా వేసింది. ఇది, 50 ఏళ్లలో ఒక పేద దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారేలా సాగిన ఒక ప్రయాణం. 1975లో ఐక్యరాజ్యసమితి బంగ్లాదేశ్‌ను తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా పేర్కొంది. ఆశ్చర్యం ఏంటంటే ఒక దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించడానికి మూడు ప్రమాణాలు ఉంటాయి. 2018లో బంగ్లాదేశ్ మొదటిసారి ఈ మూడు ప్రమాణాలు అందుకోగలిగింది. 2021లో అది మరోసారి ఆ మూడింటినీ పూర్తి చేసింది.

 
ఈ మూడు ప్రమాణాల్లో మొదటిది తలసరి ఆదాయ సూచి, రెండోది ఆర్థిక స్థిరత్వ సూచి, మూడోది మానవాభివృద్ధి సూచి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల కార్యాలయం ప్రకారం ఏదైనా ఒక దేశం ఒక నిర్దేశిత ప్రమాణాలను అందుకుంటే, దానిని తక్కువ అభివృద్ధి చెందిన జాబితా నుంచి తొలగించి, అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చేరుస్తారు. ప్రస్తుతం, బంగ్లాదేశ్ ర్యాంకింగ్‌ మార్చడం గురించి ఆలోచిస్తున్నారు. దీనిని ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.

 
ఈ స్థాయిలో అభివృద్ధి ఎలా సాధ్యమైంది
ఆర్థికాభివృద్ధి విషయానికి వస్తే, బంగ్లాదేశ్‌లో ఎగుమతుల ద్వారా లభించే ఆదాయం గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతోంది. విదేశాల్లో పనిచేసే బంగ్లాదేశీలు స్వదేశానికి పంపించే డబ్బు కూడా పెరుగుతోంది. దేశంలో వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి జరిగింది. మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి.

 
బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధి చాలావరకూ లక్షల మంది ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతులు మెరుగుపడడం వల్ల జరిగింది. మొదట ఇందులో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించింది. కానీ 1980వ దశకంలో పరిశ్రమలు దీనిలో ఒక ముఖ్యమైన స్థానం సంపాదించాయి. ముఖ్యంగా రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ దేశంలో ఉపాధి కల్పన, ఎగుమతులు రెండిట్లో కీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 83 శాతం ఆదాయం ఈ రంగం నుంచే వస్తోంది.

 
సుల్తానా కథ
బంగ్లాదేశ్‌లో రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తున్నారు. అలాంటి వారిలో సుల్తానా వారిలో ఒకరు. ఆమె ఢాకా దగ్గర ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఆరేళ్ల క్రితం ఆమె ఒక గ్రామం నుంచి రాజధానికి వచ్చేశారు. దుస్తుల పరిశ్రమలో పని చేయడం వల్ల, ఇప్పుడు తన కుటుంబాన్ని పేదరికం నుంచి దూరం చేయగలిగానని సుల్తానా చెప్పారు.

 
"నేను మా ఊళ్లో ఉన్నప్పుడు, మా అమ్మనాన్నలకు మా కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేది. తర్వాత నేను ఢాకా వచ్చాను. ఒక బట్టల ఫ్యాక్టరీలో పనిచేయడం మొదలెట్టాను. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు నా కుటుంబం మెరుగైన స్థితిలో ఉంది. వాళ్లకు నేను నెల నెలా డబ్బులు పంపిస్తుంటా. పొలాలు, పశువులు కూడా కొన్నాను. భవిష్యత్తు కోసం కొంత డబ్బులు కూడా దాచాను" అన్నారు సుల్తానా.

 
సుల్తానాకు ఒక పాప. తనను బాగా చదివించాలని అనుకుంటున్నానని ఆమె చెప్పారు. భవిష్యత్తులో తిరిగి తమ సొంత ఊరికి వెళ్లిపోతానని చెప్పారు. "నేను కొంత డబ్బులు దాచాను. ముందు ముందు ఆ పొదుపు పెరుగుతుంది. నేను తిరిగి మా ఊరికి వెళ్లిపోవాలని అనుకుంటున్నా. అక్కడ గేదెలు కొనుక్కుని, షాపు తెరుస్తా. నేను సొంతంగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తా" అంటున్నారు సుల్తానా.

 
మానవాభివృద్ధి సూచీలో..
ఆర్థికాభివృద్ధితోపాటూ మానవాభివృద్ధి విషయంలో, ముఖ్యంగా తల్లులు, పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా బంగ్లాదేశ్ గణనీయంగా మెరుగుపడింది. అధికారిక గణాంకాల ప్రకారం 1974లో ఆ దేశంలో పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 153 మంది చనిపోయేవారు. 2018లో ఆ సంఖ్య 22కు తగ్గింది. 1991లో ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు వెయ్యికి 212గా ఉండేది. 2018లో అది 29 మందికి తగ్గింది.

 
1981లో తల్లుల మరణాల రేటు 4.6 శాతం ఉంటే, 2018లో అది 1.79 శాతానికి పడిపోయింది. బంగ్లాదేశ్‌లో చిన్నారుల పోషకాహార లోపం, తల్లుల ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి ప్రభుత్వేతర సంస్థలు చాలా సహకరించాయి. మారుమూల ప్రాంతాల్లో అవగాహన పెంచడానికి ఈ సంస్థలు ప్రయత్నించాయి. ప్రభుత్వంతో కలిసి వారికి ఆర్థిక సాయం అందించడానికి కూడా పనిచేశాయి.

 
ఒకప్పుడు, విదేశీ సాయం, రుణాలు తీసుకోకుండా బంగ్లాదేశ్ ఏదీ చేయలేదని అనేవారు. కానీ, ఇప్పుడు అదే దేశం పద్మా నదిపై 301 బిలియన్ టాకాల వ్యయంతో రైల్-రోడ్ వంతెన నిర్మిస్తోంది. అతి తక్కువ అభివృద్ధి సాధించిన ఒక దేశం నుంచి 50 ఏళ్లలో అభివృద్ధి చెందుతున్న ఒక దేశంగా మారడమనేది బహుశా బంగ్లాదేశ్ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకోవాలి.