శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 1 అక్టోబరు 2019 (13:13 IST)

బీహార్: వరదల్లో ఫ్యాన్సీ ఫొటోషూట్, ఇక్కడ ఈ మోడల్ ఏం చేస్తోంది?

బీహార్ రాజధాని పట్నా జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరాన్ని వరద ముంచెత్తింది. రోడ్లపై పడవలు వెళ్తున్నాయి. జనాలను జేసీబీలతో తరలిస్తున్నారు. ఒకవైపు మెడ లోతు నీళ్లలో రిక్షావాలా ఏడుస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మరోవైపు జలమయం అయిన పట్నా రోడ్లపై ఫ్యాన్సీ ఫొటోకు ఫోజులిస్తున్న మోడల్ చర్చల్లో నిలిచారు.

 
ఈ ఫొటోల్లో ఉన్న మోడల్ వరదను ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. గ్లామరస్‌గా తీసిన ఈ ఫొటోలను చూసి జనం మండిపడుతున్నారు. అలాంటి పరిస్థితి సంతోషం ఇవ్వదని, వరదల్లో చాలామంది చనిపోతారని, ఎంతోమంది నిరాశ్రయులవుతారని, ఈ ఫొటోషూట్ చేసిన ఫొటోగ్రాఫర్‌కు అసలు మనసే లేదని విమర్శిస్తున్నారు.

 
ఫొటోగ్రాఫర్ లక్ష్యం ఏంటి?
వీటిని సౌరభ్ అనురాజ్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. ఆయన ఈ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ వాటికి 'ఆపదలో జలకన్య' అనే కాప్షన్ పెట్టారు. ఒక యూజర్ ఈ ఫొటోలకు తెలివితక్కువ చర్య అని కామెంట్ పెట్టారు. తీవ్రంగా ఉన్న వరద పరిస్థితిని తేలిగ్గా తీసుకున్నారని కొందరు, ఇది చాలా సృజనాత్మకతతో ఉందని మరికొందరు వర్ణించారు. ఫొటోగ్రాఫర్ సౌరభ్ అనురాజ్ మాత్రం తీవ్రంగా ఉన్న పరిస్థితి వైపు ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలా చేశానని చెప్పాడు.

 
"ప్రజల దృష్టిని బిహార్ వరదలవైపు మళ్లించాలనేదే నా ఆలోచన. మిగతా రాష్ట్రాల్లో వరదలు వస్తే, సాయం కోసం దేశవ్యాప్తంగా అందరూ ముందుకు వస్తారు. బిహార్‌లో వరదల తీవ్రత గురించి మాత్రం జాతీయ-అంతర్జాతీయ మీడియాలో పెద్దగా చర్చ జరగడం లేదు" అని ఆయనన్నారు.

 
"సోషల్ మీడియాలో ఎవరైనా వరదల్లో తీసిన మామూలు ఫొటోలు షేర్ చేస్తే, వాటిని చూసినవారు, 'సో శాడ్' అని కామెంట్ పెట్టి కిందికెళ్లిపోతారు. నా ఫొటోల దగ్గర జనం ఆగి చూడాలని నేను కోరుకున్నాను. అందుకే నేను ఇలాంటి ఫొటో షూట్ చేశాను" అని చెప్పారు.

 
వరదలో మోడల్‌కు నవ్వు వచ్చిందా?
వరద బాధితులను ఆటపట్టించడం ఈ ఫొటోషూట్ లక్ష్యం కాదని, సోషల్ మీడియాలో జనం వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆ ఫొటోల్లో కనిపిస్తున్న మోడల్ అదితి సింగ్ చెప్పారు. అదితి నిఫ్ట్-పట్నాలో మొదటి సంవత్సరం విద్యార్థి. ఆమె ఫ్యాషన్ ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నారు.

 
సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలతో ఇబ్బంది పడుతున్న అదితి.. "పట్నాలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. నాకు కూడా అందరిలాగే ఆందోళనగా ఉంది. మొత్తం పట్నా కష్టాల్లో ఉంది. నేను కూడా. కానీ మేం వాళ్లను వేళాకోళం చేస్తున్నామని అందరూ అనుకుంటున్నారు. వాళ్లు దీన్ని విమర్శనాత్మకంగా చూస్తున్నారు" అన్నారు.

 
ఈ ఫొటోషూట్‌ను ప్రజల దృష్టిని వరదలవైపు మళ్లించడానికే చేశామని ఫొటోగ్రాఫర్ సౌరభ్ అనురాజ్ చెబుతుంటే, అదితి మాత్రం, దీనిని వరదలు తీవ్రం కావడానికి ముందు తీసిందిగా చెబుతున్నారు. "ఈ ఫొటోషూట్ పట్నా జలమయం కావడానికి, వరదకు ముందు తీశాం. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటుందని అప్పుడు ఎవరికీ తెలీదు. కానీ జనం దానిని ఇప్పటి పరిస్థితితో జోడించి చూస్తున్నారు. సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తున్నారు" అని అదితి చెప్పారు.

 
ఇలా ఫొటోలు తీయడం పద్ధతేనా?
జనం దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ఇలాంటి పద్ధతి ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతు తన పంటకు దిష్టి తగలకుండా కాపాడుకోవడం కోసం సన్నీ లియోనీ ఫొటో పెట్టి వార్తల్లో నిలిచాడు. అంతర్జాతీయంగా కూడా ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తుంటారు.

 
"అమెరికాలో ఒకసారి ఒక చెత్త కుప్ప జనం దృష్టిలో పడడానికి, అక్కడి సమస్య గురించి చెప్పడానికి ఒక ఫొటోగ్రాఫర్ ఫ్యాన్సీ ఫొటోషూట్ చేశాడు" అని దాని గురించి వివరించిన పీఆర్, బ్రాండ్ కమ్యూనికేషన్ ఎక్స్‌పర్ట్ హర్షేంద్ర సింగ్ వర్ధన్ అన్నారు. ఇక్కడ అదే పద్ధతి ఉపయోగించానని ఫొటోగ్రాఫర్ సౌరభ్ అనురాజ్ చెబుతున్నారు.

 
జనం దృష్టి తరచూ అసాధారణ విషయాలమీదే పడుతుంది. ఎవరైనా వరదల్లోని ఒక పేద పిల్లాడు లేదా బాధితుల ఫొటోలు తీసుంటే వాటిపై ఇంత చర్చ జరిగేది కాదు. అది మామూలే. వరదలు వచ్చిన ప్రతిసారీ మనకు అలాంటి ఫొటోలు కనిపిస్తాయి" అని ఆయనన్నారు. కానీ ప్రతి దానికీ ఒక సమయం, సందర్భం ఉంటుంది. మనిషి ఎప్పుడు, ఏం చేయాలనేది అతడి వివేకంపై ఆధారపడి ఉంటుంది అని పట్నాలో సీనియర్ ఫొటో జర్నలిస్ట్ ప్రశాంత్ రవి చెప్పారు.

 
"వరదల్లో జనం చావుబతుకుల్లో ఉన్నప్పుడు, మనం ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తే జనం దానికి తీవ్రంగా స్పందించడం సర్వ సాధారణం. మనిషి భావోద్వేగాలను బట్టి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫొటోలు తీస్తే, వారు విమర్శిస్తారు. తాము బాధితులు కాకపోయినా, వరద బాధితులపై వారికి సానుభూతి ఉంటుంది. అందుకే ఇలాంటి ఫొటోలపై కచ్చితంగా విమర్శలు వస్తాయి" అన్నారు.

 
"ఇప్పుడు హిట్స్, లైక్స్, కామెంట్స్ కాలం నడుస్తోంది. అందుకే ఇలాంటి అసాధారణ పనులకు దిగుతుంటారు. మనం టిక్‌టాక్‌లోకి వెళ్లి అక్కడ చూస్తే ఎంత వింత వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయో చూడచ్చు. వాటికి లక్షల వ్యూస్ వస్తున్నాయి" అని హర్షేంద్ర సింగ్ చెప్పారు. ఇది మార్కెటింగ్ కాలం, వినియోగదారుల సమయం... ఇక్కడ ఏదైనా సాధ్యమే అంటారు ప్రశాంత్ రవి.

 
ఇబ్బందుల్లో మోడల్
భారత మీడియా దీనిని 'నిప్పు రాజేసేది' అని చెబుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలతో అదితి కుటుంబం చాలా ఇబ్బందులు పడుతోంది. ఆమెను తిడుతూ వరసగా ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. దాంతో కంగారు పడ్డ అదితి తన ఫోన్ కూడా ఆఫ్ చేశారు. "నేను ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఇది బిహార్. ఇక్కడ అన్నిటినీ చాలా పెద్దవి చేసి చూస్తారు. నా వరకు ఆ ఫొటోషూట్ చాలా కష్టమైనది. నేను అలాంటి డ్రెస్ వేసుకుని రోడ్లపై ఫొటోషూట్‌కు ఫోజులిచ్చాను. సాధారణంగా పట్నా రోడ్లపై ఇలాంటివి కనిపించవు" అని అన్నారు.

 
"పది మంది మనల్ని చూస్తారు, మన గురించి తప్పుగా అనుకుంటారు. కానీ నేను ఒక ఫ్యాషన్ స్టడీస్ స్టూడెంట్‌ని. మేం అలాంటి ఆలోచనల కంటే చాలా ఉన్నతంగా ఉంటాం. ఫొటోషూట్ ఐడియా అంతా ఫొటోగ్రాఫర్‌దే. అందులో నేను ఒక మోడల్‌గా పనిచేశాను. నేను నాకు చెప్పింది చేశాను, అంతే. అంతకు మించి నాకు వేరే ఏ ఉద్దేశం లేదు" అని ఆమె చెప్పారు.

 
దీనిని క్రియేటివ్ ఫ్రీడం అంటారా?
సోషల్ మీడియాలో జనం ఈ ఫొటోషూట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వరదల్లాంటి విషాదం వచ్చినపుడు మోడల్ నవ్వుతోందని అంటున్నారు. ఫొటోగ్రాఫర్ సౌరభ్ అనురాజ్ దీనిని క్రియేటివ్ ఫ్రీడం అంటున్నారు. ఇది ప్రతికూలతలో కూడా సానుకూల దృష్టికోణం ఉండడం అని చెబుతున్నారు.

 
కానీ "ఒక ఫొటోగ్రాఫర్ మనుషుల పరిస్థితిని, వారి భావనలను కళ్లకుకట్టే ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఆ వాతావరణంలో ఉన్న బాధను, తీవ్రతను చూపించడం అతడి పని. కానీ పట్నాలో పరిస్థితి ఈ ఫొటోల్లో కనిపించదు. అందులో ఎలాంటి బాధలూ ఉండవు. ఈ ఫొటోలతో ఏదైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అనిపించడం లేదు" అని సీనియర్ ఫొటో జర్నలిస్ట్ ప్రశాంత్ రవి చెప్పారు.

 
"దీనిపై చర్చ జరగాలనే ఈ ఫొటోషూట్ చేసినట్లు నాకు అనిపిస్తోంది. అందులో వారు విజయవంతమయ్యారు" అన్నారు. "ఒక ఫొటోకు ఇచ్చే కాప్షన్‌కు చాలా విలువ ఉంటుంది. అది ఆ ఫొటో మూడ్‌ను మార్చేస్తుంది" అని హర్షేంద్ర సింగ్ వర్ధన్ చెప్పారు. "ఇది ఆర్టిస్టిక్ స్వతంత్రం అయితే మీ సృజనాత్మకతకు తగినట్లు ఫొటోగ్రఫీ లొకేషన్‌ను ఎంచుకోవాలి. కానీ ఈ వరదలో తీసిన వివాదాస్పద ఫొటోల్లో కూడా ఫొటోగ్రాఫర్ ఆ మోడల్ హావభావాలను మార్చి ఉండచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు.