సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2019 (16:29 IST)

ఓ యేడాదిలో పలువురు అగ్రనేతలను కోల్పోయిన బీజేపీ

భారతీయ జనతా పార్టీ ఒక్క యేడాదిలో ముగ్గురు అగ్రనేతలను కోల్పోయింది. తొలుత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, ఇపుడు మాజీ మంత్రి అరుణ్ జైట్లీలు చనిపోయారు. వీరితో పాటు గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్, కేంద్ర మాజీ మంత్రి అనంత కుమార్‌లు చనిపోయారు. అయితే, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు కేవలం 18 రోజుల వ్యవధిలో చనిపోవడం కమనాథులను తీవ్ర విషాదానికిగురిచేసింది. 
 
గతేడాది ఆగస్టు 16వ తేదీన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 11 జూన్ 2018న ఎయిమ్స్‌లో చేరిన ఆయన ఆగస్టు 16న తుదిశ్వాస విడిచారు. 
 
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా గతేడాది అక్టోబరు 28న ఢిల్లీలో మృతి చెందారు. ఆయన వయసు 83 ఏళ్లు. చెస్ట్ ఇన్ఫెక్షన్‌తోపాటు జ్వరంతో బాధపడుతూ కన్నుమూశారు. 
 
కేంద్ర మాజీ మంత్రి అనంత్‌ కుమార్ గతేడాది నవంబరు 12న బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన వయసు 59 ఏళ్లు. ఆయన కూడా కేన్సర్‌తో యుద్ధం చేస్తూనే ప్రాణాలు కోల్పోయారు. 
 
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఈ యేడాది మార్చి 17న 63 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతున్నఆయన గోవా, ముంబై, ఢిల్లీ, న్యూయార్క్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
 
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ ఈ నెల 21న భోపాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 89 ఏళ్ల గౌర్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందారు. ఈ నెల 6వ తేదీన 67 ఏళ్ల వయసులో సుష్మాస్వరాజ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్, ఎమ్మెల్యే మంగేరామ్ గార్గ్ జులై 21న కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. తాజాగా, అరుణ్ జైట్లీ (66) శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కన్నుమూశారు.