మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 4 ఏప్రియల్ 2022 (20:51 IST)

యుక్రెయిన్‌లోని బుచా వీధుల్లో చెల్లాచెదురుగా మృతదేహాలు, బుచా నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

Russia Bombs on Ukraine
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను ఆక్రమించుకోవాలని, అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీని అధికారం నుంచి దింపాలనే రష్యా ఆశలకు దారుణంగా బలైన నగరాల్లో బుచా ఒకటి. నగరం మొత్తం స్మశానవాటికగా మారింది.
 
హెచ్చరిక: ఇందులో ప్రస్తావించిన అంశాలు, ఫొటోలు మీ మనసులను కలచివేయవచ్చు.

 
ఫిబ్రవరి 24న రష్యా దళాలు యుక్రెయిన్‌లోకి చొరబడిన రెండు మూడు రోజులకే బుచాలో విధ్వసం మొదలైంది. రాజధాని కీయెవ్ చేరుకునే మార్గంలో రష్యా సైన్యం బుచాలోకి ప్రవేశించింది. అయితే, కీయెవ్‌కు దారి తీస్తున్న రష్యా ట్యాంకులను, సాయుధ సిబ్బందిని తరలించే వాహనాలను యుక్రెయిన్ దళాలు నేలమట్టం చేశాయి. యుక్రెయిన్ సైన్యం మెరుపుదాడి చేయడంతో కాన్వాయ్ మొత్తం ధ్వంసమైపోయింది. దాంతో, రష్యా సైన్యం ముందుకు కదలడం అంత సులువు కాలేదు. భీకర పోరుతో నగరమంతా అంధకారం అలుముకుంది.

 
కాగా, గత వారం రష్యా సైన్యం బుచా నుంచి వైదొలగడం ప్రారంభించింది. బీబీసీ బృందం గత శుక్రవారం బుచాలోకి వెళ్లగలిగింది. రష్యా దళాలు వైదొలగడం ప్రశాంతమైన, హేతుబద్ధమైన నిర్ణయంగా క్రెమ్లిన్ పేర్కొంది. తూర్పు యుక్రెయిన్‌లో యుద్ధంపై దృష్టి కేంద్రీకరించడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. మధ్య యుక్రెయిన్‌లో తమ యుద్ధ లక్ష్యాలు నెరవేరాయని మాస్కో అంటోంది. కానీ, అందుకు ఎలాంటి ఆధారాలు, విశ్వసనీయత లేదు. అయితే, కీయెవ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుపలేదు. నిజం ఏమిటంటే, ఊహించని రీతిలో యుక్రెయిన్ సైన్యం ప్రతిఘటించి రష్యా దళాలను రాజధాని వెలుపలే నిలువరించింది.

 
బుచాలో యుద్ధం ఎలా జరిగింది?
బుచాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టమెల్ విమానాశ్రయం నుంచి రష్యా వైమానిక దళాలు బుచాలోకి సులువుగా ప్రవేశించగలిగాయి. యుద్ధం మొదలైన తొలిరోజే రష్యా పారాట్రూపర్స్ హాస్టమెల్ విమానాశ్రయంపై దాడి చేశాయి. అయినప్పటికీ, యుక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. బుచాలో వారికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది.
బుచాలో సన్నని, ఇరుకైన రోడ్లు మెరుపుదాడికి అవకాశమిచ్చాయి. టర్కీ నుంచి కొనుగోలు చేసిన బేరక్టార్ అటాక్ డ్రోన్లతో యుక్రెయిన్ దళాలు రష్యా కాన్వాయ్‌పై దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. యుక్రెయిన్ ప్రాదేశిక రక్షణ వలంటీర్లు కూడా అక్కడే ఉన్నట్టు మరి కొంతమంది చెప్పారు.

 
వరుసలో ముందు నడుస్తున్న వాహనాలను యుక్రెయిన్ సైన్యం పడగొట్టింది. మిగిలినవారిని బంధించింది. 30మిమీ ఫిరంగి గుళ్లు, ముక్కలైపోయిన ఇతర ఆయుధాలను బుచా రోడ్లపై చూడవచ్చు. రష్యాకు ఏ మాత్రం దయలేదని అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. యుక్రెయిన్ దళాలు బుచాలోకి ప్రవేశించే సమయానికి కనీసం 20 మృతదేహాలు రోడ్లపై పడి ఉన్నాయి. కొందరికి చేతులు వెనక్కి విరిచి కట్టారు. కాగా, 280 మందికి సామూహిక ఖననం నిర్వహించినట్టు ఆ నగర మేయర్ తెలిపారు.

 
జర్నలిస్టులు అందించిన రిపోర్టులు ఏం చెబుతున్నాయి?
పట్టణంలోకి ప్రవేశించిన జర్నలిస్టులకు రోడ్లపై పడి ఉన్న పౌరుల మృతదేహాలు కనిపించాయి. కనీసం 20 మృతదేహాలు ఉంటాయని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ రిపోర్టర్ తెలిపారు. చేతులు వెనక్కు విరిచి కట్టి ఉన్నాయని చెప్పారు. ఈ వారంలో యుక్రెయిన్ సైన్యం బుచా పట్టణాన్ని చేజిక్కించుకుంది. ఫొటోలు చూస్తే ఊరు ఎంత నాశనమైపోయిందో తెలుస్తోంది.

 
యుక్రెయిన్‌లోని మరో ప్రాంతంలో రష్యా చేతిలో మరణించిన ఇద్దరు పౌరుల మృతదేహాలను బీబీసీ జర్నలిస్టులు కనుగొన్నారు. గత వారం బీబీసీ బృందం, మ్రియా, మైలా గ్రామాల మధ్య రహదారిలో మొత్తం 13 మృతదేహాలను లెక్కించింది. వారిలో కొందరు యుక్రెయిన్ సైనికులు కావొచ్చు. గత వారంలో కీయెవ్, దాని పరిసర ప్రాంతాల నుంచి రష్యా దళాలు వేగంగా వెనక్కు మరలాయని యుక్రెయిన్ తెలిపింది. కీయెవ్ నగరాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలను యుక్రెయిన్ మళ్లీ చేజిక్కించుకుందని ఆ దేశ అధికారులు వెల్లడించారు.

 
రాయిటర్స్‌కు చెందిన ఒక ఫొటోగ్రాఫర్ కూడా బుచాలో మృతదేహాలను చూసినట్టు తెలిపారు. బాంబు దాడుల్లో ధ్వంసమైన భవనాలు, కార్లను చూసినట్టు చెప్పారు. ఏఎఫ్‌పీ రిపోర్టర్ చూసిన మృతదేహాల్లో 16 పేవ్‌మెంట్‌పై లేదా పక్కనే పడి ఉన్నాయని చెప్పారు. మూడు రోడ్డు మధ్యలో పడి ఉన్నాయి. మరొకటి ధ్వసమైపోయిన ఇంటి వాకిట్లో ఉంది.

 
తెల్లటి గుడ్డతో చేతులు కట్టి ఉన్న వ్యక్తి మృతదేహం పక్కనే యుక్రెయిన్ పాస్‌పోర్ట్ పడి ఉంది. మరొక ఇద్దరి భుజాలు తెల్లటి వస్త్రంతో కట్టివేసి ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి బాంబు దాడిలో లేదా రష్యా సైనికుడు పేల్చిన తూటాకో బలి అయిపోయి ఉంటారని, పోలీసులు దర్యాప్తు చేస్తారని ఒక యుక్రెయిన్ అధికారి ఏఎఫ్‌పీకి తెలిపారు. కానీ, ఆ 20 మందినీ తల వెనుక భాగంలో కాల్చి చంపారని పట్టణ మేయర్ అనాటోలీ ఫెడోరుక్ ఏఎఫ్‌పీకి ఫోన్ ద్వారా తెలిపారు.

 
మరికొన్ని మృతదేహాలు నాశనమైన కార్లలో చిక్కుని ఉన్నాయని కూడా చెప్పారు. బుచాలో మొత్తం 280 మందిని సామూహికంగా ఖననం చేసినట్టు మేయర్ తెలిపారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 40 లక్షలకు పైగా పౌరులు ఇతర దేశాల్లో శరణార్థులుగా మారారు.

 
నెల రోజులుగా తిండి, నీళ్లు లేవు
యుద్ధం కారణంగా బుచా పట్టణంలో గ్యాస్, విద్యుత్, మంచినీటి సరఫరా నిలిచిపోయిందని, ఇళ్ల బయట కట్టెల పొయ్యిలపై వంటలు చేసుకున్నామని స్థానికులు తెలిపారు. వలంటీర్లు స్థానికులను సహాయం అందిస్తున్నారు. ఎల్వివ్ నగరం నుంచి, యుద్ధానికి సుదూరంలో ఉన్న దేశాల నుంచి సరుకులు తెచ్చి అందిస్తున్నారు. "38 రోజుల తరువాత ఇవాళ ఈ రొట్టె తింటున్నాం" అని మరియా అనే ఆమె చెప్పారు. ఆమె చేతిలో బన్స్ ఉన్న ప్యాకెట్ ఉంది.
నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినవారు తమ ఇళ్లకు తాళాలు బిగించారు. రష్యన్లు ఆ ఇళ్ల తలుపులు, గుమ్మాలు విరగ్గొట్టారు.

 
అతిపెద్ద మ్రియా విమానం ధ్వంసమైంది
బుచాకు సమీపంలో ఉన్న హాస్టమెల్ విమానాశ్రయంపై రష్యా దాడి చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసింది. విమానాన్ని ఉంచే హ్యాంగర్ (షెడ్డు) విరగ్గొట్టారు. మ్రియా (యుక్రెయిన్ భాషలో కల) అని పిలిచే విమానం ముక్కలుముక్కలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రాజెక్టులకు నిర్వహించగల యుక్రెయిన్ సామర్థ్యానికి చిహ్నం ఆ విమానం. దాన్ని జాతికి గర్వంగా భావించేవారు. ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది. ఈ విమానాన్ని పునరుద్ధరించడానికి 3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 22,798 కోట్లు) ఖర్చు అవుతుందని యుక్రెయిన్ స్టేట్ డిఫెన్స్ కంపెనీ అంచనా వేసింది.