కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెలుపొందింది. దీంతో శనివారం, భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. ఫైనల్ పోటీలో ఆమె మొత్తంగా 201 కేజీల (88 స్నాచ్, 113 క్లీన్ అండ్ జెర్క్) బరువును ఎత్తి తొలి స్థానంలో నిలిచింది.
స్నాచ్ విభాగం తొలి ప్రయత్నంలో 84 కేజీలు, రెండో ప్రయత్నంలో 88 కేజీలను విజయవంతంగా ఎత్తిన చాను మహిళల 49 కేజీల విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ రికార్డును నెలకొల్పింది. అనంతరం 90 కేజీలు ఎత్తేందుకు మూడో ప్రయత్నం చేసి విఫలమైంది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో తొలి ప్రయత్నంలో 109 కేజీలు, రెండో ప్రయత్నంలో 113 కేజీల బరువునెత్తింది. మూడో ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తడంలో విఫలమైంది.
మారిషస్‌కు చెందిన మేరీ హనిత్రా రనైవోసోవా (172 కేజీలు) రజతం, హనా కమిన్స్కీ (కెనడా, 171 కేజీలు) కాంస్యాన్ని గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో చానుకు ఇది మూడో పతకం కాగా వరుసగా రెండో స్వర్ణం. 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లోనూ ఆమె బంగారు పతకాన్ని సాధించారు. 2014లో రజత పతకాన్ని గెలుపొందారు. శనివారం భారత్ సాధించిన మూడు పతకాలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. చాను కంటే ముందు సంకేత్ రజతాన్ని, గురురాజ్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు.