శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 16 ఏప్రియల్ 2020 (21:12 IST)

కరోనావైరస్: అహ్మదాబాద్ ఆస్పత్రిలో హిందూ-ముస్లింలకు కోవిడ్-19 వార్డు విభజన అంటూ...

మతం ఆధారంగా కరోనావైరస్ రోగులను వేరువేరు వార్డుల్లో ఉంచుతున్నారని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిపై ఆరోపణలు వస్తున్నాయి. ఏప్రిల్ 12కు ముందు ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కరోనావైరస్ వార్డును ఇప్పుడు హిందూ, ముస్లిం రోగుల కోసం వేరు వేరు వార్డులుగా విభజించారు.

 
ఉదాహరణకు, అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలోని సీ4 వార్డు మొత్తాన్ని ప్రస్తుతం ముస్లిం రోగుల కోసమే కేటాయించారు. “ఏప్రిల్ 12కు ముందు సివిల్ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో చాలా మందిని అంతకు ముందు ఏ4 వార్డులో ఉంచేవారు. అక్కడ హిందూ, ముస్లిం రోగులందరికీ కలిపి చికిత్స అందించేవారు” అని అదే వార్డులో ఉన్న 19 ఏళ్ల రోగి బీబీసీకి చెప్పారు.

 
ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగితో బీబీసీ ఫోన్లో మాట్లాడింది. “ఏప్రిల్ 12 రాత్రి ముస్లిం రోగులందరినీ సీ4 వార్డులోకి షిఫ్ట్ కావాలని, అక్కడ మెరుగైన వసతులు కల్పించామని మాకు చెప్పారు. హిందూ రోగులను మాత్రం ఏ4 వార్డులోనే ఉంచేశారు. నేను, మరికొంతమంది కలసి మమ్మల్ని ఏ4 నుంచి సీ4కు ఎందుకు మారుస్తున్నారని అడిగాం. కానీ వారు సంతృప్తికరమైన సమాధానం ఏదీ ఇవ్వలేదు” అని అతడు చెప్పాడు.

 
“మేం ఉన్న వార్డులో వేరే హిందూ రోగులు ఎవరూ లేకపోవడంతో మతం ఆధారంగా మమ్మల్ని వేరు చేశారని నాకు తర్వాత అర్థమైంది” అని అతడు చెప్పాడు. సీ4లోనే ఉన్న మరో రోగితో కూడా బీబీసీ మాట్లాడింది. “ఈ ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి చుట్టూ హిందూ రోగులు ఎవరూ నాకు కనిపించలేదు. సీ4లో అంతా ముస్లిం రోగులే ఉన్నారు” అని ఆయన చెప్పారు.

 
దీనిపై బీబీసీ ఆ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ జీహెచ్ రాథోడ్‌ను అడిగితే ఆయన “రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి చికిత్స చేస్తున్న డాక్టర్లు రోగులను అలా వేరు చేశారు. మతం ఆధారంగా వారిని విభజించారనడంలో నిజం లేదు” అన్నారు.

 
కానీ, అంతకు ముందు డాక్టర్ రాథోడ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు. “ప్రభుత్వం నోటిఫికేషన్ ఆధారంగా ఆస్పత్రిలో హిందూ, ముస్లిం వార్డులను వేరు చేశాం. మతం ఆధారంగా వార్డులను వేరు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం” అని ఆయన చెప్పారు.

 
దానిష్ ఖురేషీ ఒక ముస్లిం నేత. ఆయన స్నేహితుడు ఒకరు సివిల్ ఆస్పత్రిలో ఉన్నారు. బీబీసీతో మాట్లాడిన ఆయన “ఆస్పత్రిలో అదే వార్డులో ఉన్న కొందరు హిందువులు అక్కడ ముస్లింలతో ఉండడం తమకు ఇబ్బందిగా ఉందని సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు నాకు తెలిసింది” అని చెప్పారు. అలాంటి ఫిర్యాదులేమైనా మీకు వచ్చాయా అని డాక్టర్ రాథోడ్‌ను బీబీసీ అడిగింది. కానీ, ఆయన తమకు అలాంటివేం రాలేదన్నారు.

 
గుజరాత్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో కూడా మీడియా కథనాలు నిరాధారమని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ట్వీట్ చేసింది. “రోగులను వారి ఆరోగ్య పరిస్థితి, లక్షణాల తీవ్రత, వయసుకు తగ్గట్టు వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్ల సలహా ప్రకారం వేరు వేరు వార్డుల్లో ఉంచాం” అని ఆ ట్వీట్‌లో చెప్పారు.

 
ఈ ట్వీట్ చేయడానికి కొన్ని గంటల ముందు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కిషోర్ కనానీతో బీబీసీ మాట్లాడింది. “ఆస్పత్రిలో రోగులను ఎక్కడ, ఎలా ఉంచాలి అనేది, అక్కడ పనిచేసే డాక్టర్ల ఇష్టం. మతం ఆధారంగా రోగులను వేరుగా ఉంచాలని ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయినా, డాక్టర్లు అలా చేశారంటే, అది తమ అవసరం, సౌకర్యం కోసం వేరు చేసి ఉంటారు” అని ఆయన అన్నారు.

 
రోగులను మతవిశ్వాసాల ఆధారంగా డాక్టర్లు వేరువేరుగా ఉంచారా అని కనానీని బీబీసీ అడిగినప్పుడు, “మీరు కరోనావైరస్‌పై పోరాటం చేస్తున్న వారితో ఉన్నారా, లేదా?“ అని రిపోర్టర్‌ను ఎదురు ప్రశ్నించారు. “ఇలాంటి విషయాలు మనం పట్టించుకోకూడదు. వారి పని వారిని చేయనివ్వాలి” అన్నారు.

 
గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిని కోవిడ్-19కు చికిత్స అందించే నోడల్ ఆస్పత్రిగా ప్రకటించింది. సివిల్ ఆస్పత్రి క్యాంపస్‌లో కొత్తగా కట్టిన 1200 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం కరోనా రోగుల కోసం కేటాయించింది. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వీఎస్ ఆస్పత్రిలో ఉన్న వారిలో ఎక్కువ మంది పేషెంట్లు ముస్లింలే.

 
ముస్లిం నేతలు ఏం చెబుతున్నారు?
దీనిపై ముస్లిం నేతల స్పందనను బీబీసీ అడిగినపుడు, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని దీనిని ఖండించారు. “చుట్టూ ఉన్న ముస్లిం రోగులతో కలిసి తాము అక్కడ ఉండలేమని ఆస్పత్రి సిబ్బందికి ఎవరో ఫిర్యాదు చేయడం వల్లే ఈ మొత్తం వివక్ష మొదలైంది” అని సివిల్ ఆస్పత్రిలో ఉన్న ముస్లిం రోగులతో పరిచయం ఉన్న షాపూర్ ముస్లిం నేత దానిష్ ఖురేషీ చెప్పారు.

 
“గుజరాత్‌లో ఉన్న ఇస్లామోఫోబియా ఫలితమే ఇది. జనం మాతో కలిసి ఉండాలని అనుకోవడం లేదు. ప్రభుత్వం ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామిక విభజనతో వారికి అండగా నిలుస్తోంది” అని ఇక్రమ్ మీర్జా అనే మరో మత పెద్ద అన్నారు.

 
కోవిడ్-19 ప్రొటోకాల్ ఏం చెబుతోంది?
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గనిర్దేశాల ప్రకారం రోగులను మూడు గ్రూపులుగా విభజించాలి. మొదటి గ్రూప్‌లోని వైద్యపరంగా తేలికపాటి లేదా స్వల్ప తీవ్రత ఉన్నవిగా భావించే అనుమానిత, ధ్రువీకరించిన కేసులను ఉంచుతారు. వైద్యపరంగా మధ్యరకంగా ఉన్న అనుమానిత, ధ్రువీకరించిన కేసులను రెండో గ్రూపుగా చేస్తారు. ఇక వ్యాధి తీవ్రంగా ఉన్న అనుమానిత, ధ్రువీకరించిన కేసులను మూడో గ్రూపుగా చేస్తారు. రోగులకు వారి వారి కండిషన్ ప్రకారం చికిత్స అందిస్తారు. మతాల ఆధారంగా వేరు చేయడం గురించి అందులో ప్రస్తావించలేదు.

 
గుజరాత్‌లో కరోనావైరస్ స్థితి
బుధవారం ఉదయం 8 గంటల వరకూ రాష్ట్రంలో 617 కోవిడ్-19 కేసులను ధ్రువీకరించారు. వారిలో 55 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 26 మంది మృతిచెందారు. వాల్డ్ సిటీ (ఓల్డ్ సిటీ) అహ్మదాబాద్‌ను హాట్‌స్పాట్‌గా, బఫర్‌ జోన్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ కర్ఫ్యూ విధించారు. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలాగే గుజరాత్‌లో కరోనా రోగుల మరణాల రేటు ఎక్కువగా నమోదవుతోంది. కేంద్రం గణాంకాల ప్రకారం గురువారం నాటికి గుజరాత్ మరణాల రేటు 4.3 ఉంది. మధ్యప్రదేశ్‌లో ఇది 6.84గా, మహారాష్ట్రలో 6.62గా ఉంది.

 
కరోనావైరస్ - గుజరాత్ ముస్లింలు
దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన తర్వాత, ముస్లింలపై ద్వేషాన్ని వ్యాప్తి చేసేలా సోషల్ మీడియాలో వైరల్ అయిన సందేశాలపై అహ్మదాబాద్ పోలీసులు స్పందించారు. కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. తర్వాత ముస్లింలపై ద్వేషాన్ని కలిగించేలా వ్యాపిస్తున్న ఎన్నో వైరల్ సందేశాలను అడ్డుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తి తర్వాత రాష్ట్రంలో హిందూ, ముస్లింల మధ్య మతపరమైన విభేదాలు తీవ్రం అయ్యాయని చాలా మంది ముస్లిం నేతలు అభిప్రాయ పడుతున్నారు.

 
గస్తీ కాస్తున్న పోలీసులపై దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో వేజాల్పూర్ పోలీసులు ఒక ముస్లిం సభ్యుల బృందాన్ని అరెస్టు చేశారు. రాళ్లు రువ్విన ఒక ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

 
ముఖ్యంగా తబ్లీగీ జమాత్ సభ్యుల వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మీడియాతో అన్న తర్వాత ముస్లిం ఏరియాల్లో గస్తీని కఠినతరం చేశారు. ప్రస్తుతం అహ్మదాబాద్ నగరంలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న ఓల్డ్ సిటీలో పోలీసులు కర్ఫ్యూ ప్రకటించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే దానిలిమదాలో కూడా సంపూర్ణ కర్ఫ్యూ విధించారు.

 
“కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి అహ్మదాబాద్‌లోని ఓల్డ్ సిటీ, దానిలిమదా ప్రాంతాల్లో వారం పాటు కర్ఫ్యూను కఠినతరం చేశాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని అహ్మదాబాద్ సీపీ ఆశిష్ భాటియా ట్వీట్ చేశారు.

 
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వివరాల ప్రకారం ఏప్రిల్ 14న అహ్మదాబాద్‌లో 346 మంది కరోనావైరస్ రోగులు ఉన్నారు. వీటిలో 200 కేసులు వాల్డ్ సిటీ ఏరియా (ఓల్డ్ సిటీ) నుంచే నమోదయ్యాయి. ఇప్పటివరకూ నగరంలో 6595 మందికి కరోనా పరీక్షలు చేశారు. నగరంలో ఇప్పటికే 13 మంది చనిపోయారు.