మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 6 ఏప్రియల్ 2020 (21:58 IST)

కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి

మరణాలు కనిపించకపోవచ్చు, కానీ శవపేటికలను దాచడం మాత్రం కష్టం. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని రోత్‌షైల్డ్ కేర్ హోమ్ (వృద్ధుల సంరక్షణ గృహం) వెలుపల, ఒక వ్యానులోంచి చెక్క పెట్టెను దించుతున్నారు. అది శవపేటిక. ఇక్కడికి శవపేటికలను తీసుకురావడం తమకు నిత్యకృత్యంగా మారిపోయిందని దానిని కిందికి దించుతున్న వ్యక్తి చెప్పారు.
 
ఆ సంరక్షణ గృహం గేట్లు మూసివేసి ఉన్నాయి. అందులో కరోనావైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న 16 మంది చనిపోయారు. మరో 80 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. పారిస్ ప్రాంతంలో మూడింట ఒక వంతుకు పైగా సంరక్షణ గృహాలు కరోనావైరస్ బారిన పడ్డాయని అధికారులు భావిస్తున్నారు.
 
అయితే, కరోనావైరస్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరి చనిపోతున్న వారి సంఖ్యను ప్రభుత్వం వెల్లడిస్తోంది. కానీ, సంరక్షణ గృహాల్లో అనాథలుగా ప్రాణాలు వదులుతున్న వృద్ధుల వివరాలను మాత్రం అందులో నమోదు చేయడంలేదు. తూర్పు ఫ్రాన్సులోని మరో సంరక్షణ గృహంలో అలెగ్జాండర్ సాన్నర్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. తమ కేర్ హోంలో 20 మందికి పైగా మరణించారని ఆయన చెప్పారు.
 
"సుమారు 50 మంది వృద్ధులు జ్వరం, తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతున్నారు. 25 నుంచి 30 మందికి ఆక్సిజన్ అందిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. ఈ మరణాల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియడంలేదు. కరోనావైరస్ భయంతో కొన్ని సంరక్షణ గృహాల నిర్వాహకులు వృద్ధులను అందులోనే వదిలేసి వెళ్లిపోయారు. దాంతో, వారిని ఆదరించేవారు లేరు, పైగా చాలామందికి కరోనావైరస్ సోకింది. దాంతో వృద్ధులు దిక్కులేకుండా చనిపోతున్నారు. రోజురోజుకు ఈ సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
 
యూరప్‌లో కరోనావైరస్ ప్రభావం ఇటలీ, స్పెయిన్‌లపై తీవ్రంగా ఉంది. ఈ దేశాల్లోని సంరక్షణ గృహాలలో వృద్ధులు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మాడ్రిడ్‌లోని బీబీసీ ప్రతినిధి జేమ్స్ బ్యాడ్‌కాక్ తెలిపారు. ఉత్తర ఇటలీలోని బెర్గామో పట్టణంలో ఉన్న సంరక్షణ గృహాలలో వందల మంది మరణించారు. మరోవైపు, దక్షిణాన ఉన్న గృహం సిబ్బంది నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. దాంతో, 83 మంది వృద్ధులు రెండు రోజులు ఆహారం లేకుండా గడపాల్సి వచ్చిందని బీబీసీ ప్రతినిధి చెప్పారు.
 
వందల మంది మృతి
స్పెయిన్‌లోని సంరక్షణ గృహాల్లో మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. మాడ్రిడ్‌ నగరంలోని మోంటే హెర్మోసో కేంద్రంలో 20 మందికి పైగా వృద్ధులు కరోనావైరస్ సోకి మరణించారు. దేశవ్యాప్తంగా ఉన్న 1,300కి పైగా గృహాల సంరక్షణ కోసం ప్రభుత్వం సైనిక విభాగాలను పంపించింది. అన్ని కేంద్రాలలోనూ హుటాహుటిన శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పింది.
 
మాడ్రిడ్‌లోని మరో సంరక్షణ గృహంలో 23 మంది విగతజీవులుగా కనిపించారు. మృతుల్లో ఇద్దరు నన్‌లు కూడా ఉన్నారు. అల్కోయి పట్టణంలోని ఓ సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 130 మందిలో 26 మంది చనిపోయారు. మార్చి మొదటి నాలుగు వారాల వ్యవధిలో స్పెయిన్‌లోని కేర్ హోంలలో 1600 మందికి పైగా చనిపోయారు. వారిలో సగం మందికి పైగా కోవిడ్-19 సోకిందని అధికారులు భావిస్తున్నారు.
 
కరోనావైరస్ వ్యాప్తి గురించి సరైన సమాచారం లేకపోవడంపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరత, రక్షణ దుస్తులు లేకపోవడం వల్ల పరిస్థితులు చేయిదాటిపోయాయని సంరక్షణ గృహాల నిర్వహణ సిబ్బంది అంటున్నారు. సంరక్షణ గృహాలలో కరోనావైరస్ కేసులను లెక్కించి, వాటిని జాతీయ గణాంకాలలో చేర్చేందుకు ఫ్రాన్స్ ఒక కొత్త అప్లికేషన్‌ను ప్రారంభిస్తోంది.
 
‘మేము ఏమీ చేయలేం'
మార్చి ప్రారంభంలో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఒక సంరక్షణ గృహాన్ని సందర్శించారు. అక్కడ ఒక టేబుల్ పక్కన కూర్చున్న ఆయన చుట్టూ వృద్ధులు ఉన్నారు. వారిలో ఎవరికీ ఫేస్ మాస్కులు లేవు. సామాజిక దూరం లేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే, ఫ్రాన్స్‌లోని వృద్ధుల సంరక్షణ కేంద్రాలకు సందర్శకులను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వృద్ధులందరూ తమ గదులలో ఒంటరిగా ఉండాలని గతవారం చెప్పింది.
 
అయితే, సంరక్షణ గృహాలలో సేవలు అందించే సిబ్బందిలోనూ చాలామంది అనారోగ్యానికి గురై ప్రస్తుతం నిర్బంధంలో ఉండాల్సి వస్తోంది. దాంతో, వృద్ధుల ఆలనాపాలనా చూసేవారు లేకుండాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం చాలా కష్టమని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
 
“సంరక్షణ కేంద్రంలో ఒక్కరికి వైరస్ సోకిందంటే చాలు ఇక, అందరికీ వ్యాప్తి చెందినట్లే. ఇక మనం ఏమీ చేయలేం. సరిపడా సిబ్బంది లేరు కాబట్టి ఆ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టమవుతోంది. అందుకే కేర్ హోంలో వైరస్ ప్రవేశిస్తే, అనేక మంది వృద్ధులు చనిపోతున్నారు” అని ఒక నర్సు వివరించారు.
 
‘పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది’
పారిస్ ప్రాంతంలో వెంటిలేటర్లు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని ఔషధాల కొరత కూడా ఉంది. ఫ్రాన్స్‌లో అందరికీ సామూహిక పరీక్షలు నిర్వహిస్తామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. వైద్య సిబ్బంది రక్షణ కోసం 100 కోట్ల ఫేస్ మాస్కులకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ ఫిలిప్ ప్రకటించారు.
 
"పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది" అని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన 15 రోజుల కంటే ఏప్రిల్ ప్రథమార్ధం "మరింత క్లిష్టమైనది" అని ఆయన హెచ్చరించారు.