శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:07 IST)

కరోనావైరస్: కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ ఎవరెస్ట్ ఎక్కుతున్న చైనా పర్వతారోహకులు

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు విదేశీయులకు ఇప్పటికే అనుమతి నిరాకరించారు. అయితే చైనాకు చెందిన ఓ పర్వతారోహణ బృందం మాత్రం తమ ఎవరెస్ట్ యాత్రను మొదలుపెట్టింది. కోవిడ్-19 కారణంగా ఈ వసంత కాలంలో కేవలం చైనీయులకు మాత్రమే అనుమతిచ్చారని ఈ పర్వతారోహణను నిర్వహించే ఆపరేటర్లు బీబీసీకి చెప్పారు.

 
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరం చైనా, నేపాల్ దేశాల సరిహద్దుల్లో ఉంది. రెండు వైపుల నుంచి అధిరోహించవచ్చు. విదేశీయులు తమ సరిహద్దు నుంచి ఎవరెస్ట్ శిఖరారోహణ చేయడాన్ని చైనా నిలిపేసింది. అటు నేపాల్ కోవిడ్-19 కారణంగా ఏకంగా అన్ని రకాల పర్వతారోహణ కార్యక్రమాలను రద్దు చేసింది.

 
తొలిసారిగా ఈ వ్యాధి మధ్య చైనాలో పుట్టింది. దాని వల్ల అక్కడ సుమారు 3,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం ఈ మహమ్మారి వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోగలిగామని చైనా చెబుతోంది. అంతే కాదు వ్యాధి పుట్టిన వుహాన్ ప్రాంతానికి లాక్ డౌన్ నుంచి విముక్తి కల్పిచింది.

 
చైనాకు చెందిన సుమారు 24 మంది పర్వతారోహకులు శుక్రవారం నాటికే 6,450 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి చేరుకొని ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ పర్వతారోహణ నిర్వహాకులు చైనా టిబెట్ పర్వతారోహణ సంఘంతో(సీటీఎంఎ) ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతునే ఉన్నారు. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు సీటీఎంఎ అధికారులు మాత్రం అందుబాటులో లేరు.

 
ఒకవేళ ఈ బృందం తమ లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే ఇదో అరుదైన సందర్భం అవుతుందని పర్వతారోహణ రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేసే బృందం చెబుతోంది. ఈ సీజన్‌లో కేవలం చైనా బృందం మాత్రమే శిఖరంపై ఉండటం చాలా అరుదన్నది వారి మాట. “1958-67 మధ్య కాలంలో ఇతర దేశాలకు చెందిన వారెవ్వరూ ఎవరెస్ట్‌ ను చేరుకోని సమయంలో చైనాకు చెందిన చాలా మంది పరిశోధకులు, శిక్షణ పొందిన పర్వతారోహకులు ప్రయత్నించారు. కానీ ఎవరెస్ట్ ఎక్కడం ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాలేదు.” అని వారన్నారు.

 
వైరస్ భయాన్ని దృష్టిలో పెట్టుకొని చైనాకు తమకు అవకాశం ఇవ్వలేదని పర్వతారోహణను నిర్వహించే విదేశీ సంస్థలు చెబుతున్నాయి. “ప్రపంచ మంతా కరోనావైరస్ విశ్వరూపం చూపిస్తున్న ఈ సమయంలో రిస్క్ తీసుకోకుండా ఎవరెస్ట్ అధిరోహణకు ఇతర దేశాలకు చైనా అనుమతివ్వకపోవడం సముచితమే” అని ఆస్ట్రియాకు చెందిన పర్వతారోహకుడు లుకాస్ ఫర్టెన్‌బక్ వ్యాఖ్యానించారు.

 
“ఇప్పటికిప్పుడు ఎటువంటి నమ్మదగ్గ చికిత్స అందుబాటులో లేనప్పుడు చెయ్యాల్సింది ఇదే. ప్రమాదాన్ని మరింత తగ్గించడంలో భాగంగా తమ దేశానికి చెందిన వారిని మాత్రమే అనుమతించడం తెలివైన నిర్ణయం. అవసరమైతే వారిని శిఖర అధిరోహణకు ముందు క్వారంటైన్‌లో కూడా ఉంచే అవకాశం ఉంటుంది” అని లుకాస్ అభిప్రాయపడ్డారు.

 
లుకాస్ సహా మరి కొంత మంది ఔత్సాహికులు నేపాల్ సరిహద్దుల నుంచి శిఖరాన్ని అధిరోహించాలనుకున్నారు. కానీ నేపాల్ ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల అనుమతుల్ని రద్దు చేసింది. ప్రస్తుతం పర్వతారోహణ చేస్తున్న చైనా బృందం అక్కడ ఒక బేస్ క్యాంప్‌ నుంచి మరో బేస్ క్యాంప్‌కు చేరుకొని అక్కడ వాతావరణ పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడేందుకు ఆపై ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి కనీసం నెల రోజులు పట్టే అవకాశం ఉంది.

 
శిఖరాన్ని చేరుకునేందుకు అనువైన వాతావరణం కోసం పర్వతారోహకులు వేచి చూస్తుంటారు. సాధరణంగా మే నెల చివరి నాటికి అంటే భారత్‌లో ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి వారు శిఖరాన్ని చేరుకుంటూ ఉంటారు.

 
నేపాల్ సరిహద్దుల నుంచి ఎక్కేవారితో పోల్చితే చైనా సరిహద్దుల నుంచి కొద్ది సంఖ్యలో మాత్రమే ఎవరెస్ట్ ప్రయాణం చేస్తూ ఉంటారు. చైనా వైపు నుంచి ప్రయాణించేవారు నేరుగా బేస్ క్యాంప్‌కు వాహనాల్లో చేరుకోవచ్చు. అదే నేపాల్ సరిహద్దుల నుంచి బయల్దేరే వారు మాత్రం ఖుంబ్ లోయ ప్రాంతం నుంచి 10రోజుల పాటు ట్రెక్కింగ్ చెయ్యాల్సి ఉంటుంది.

 
“నేపాల్ సరిహద్దుల నుంచి బయల్దేరే వారు జడలబర్రెలను ఎక్కి కూడా అడ్వాన్స్ బేస్ క్యాంప్ చేరుకోవచ్చు” అని గతంలో నేపాల్ సరిహద్దుల నుంచి పర్వతారహణ చేసిన అంగ్ థెష్రింగ్ థెర్పా అన్నారు. “అయితే నేపాల్ వైపు నుంచి కాకుండా ఉత్తరం వైపు నుంచి ఎక్కడం ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది” అని థెర్పా చెప్పారు.

 
ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా హిమానీ నదాలు కరిగిపోవడం, ఎప్పటికప్పుడు వస్తున్న మంచు తుపానులు పర్వతారోహకులకు మరిన్ని సవాళ్లు విసురుతున్నాయి.