శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:54 IST)

కరోనావైరస్: నియంత్రణ రేఖ దగ్గర భారత్- పాక్ కాల్పులు, ప్రాణ భయంతో 'సామాజిక దూరం' ఎలా పాటించాలంటున్న స్థానికులు

ప్రపంచమంతా అంతకంతకూ పెరిగిపోతున్న కరోనా కేసులను, మరణాలు లెక్కిస్తూ బిజీగా ఉన్న సమయంలో, ఆదివారం నాడు జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో భారత, పాకిస్తాన్ సైనికుల తుపాకులు గర్జించాయి. ఈ కాల్పుల్లో కొందరు ప్రాణాలు కోల్పోతే, కొందరు గాయపడ్డారు. సరిహద్దులకు దగ్గరగా నివసిస్తున్న గ్రామాలవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
2020 ఏప్రిల్ 12న కశ్మీర్ సరిహద్దు జిల్లా కుప్వారా దగ్గర పాకిస్తాన్ సైన్యం షెల్లింగ్‌లో 8 ఏళ్ల చిన్నారి సహా ముగ్గురు పౌరులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఆదివారం కుప్వారాలో జరిగిన ఈ కాల్పుల తర్వాత గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. మృతులకు నివాళి అర్పించింది.
 
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఆదివారం సోషల్ మీడియాలో కనిపించాయి. పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించిన మోర్టార్ షెల్స్ వల్ల చెలరేగిన మంటలను గ్రామస్థులు ఆర్పుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. చౌకీబాల్‌లో తన ఇంటి నుంచి గ్రామ సర్పంచ్ హైదర్ ఖాన్ బీబీసీతో ఫోన్లో మాట్లాడారు. “మేం కరోనావైరస్‌తో పోరాడాలా లేక కాల్పులపై పోరాడాలో అర్థం కావడం లేదు” అని ఆయన చెప్పారు.
 
“ఆదివారం ఈ కాల్పులు జరిగినపుడు చాలా మంది గ్రామం వదిలి వెళ్లిపోయారు. ‘మీరు మీ బంధువుల ఇళ్లకు వెళ్లాలనుకుంటే, అక్కడ కూడా దయచేసి సామాజిక దూరం పాటించండి’ అని వాళ్లకు చెప్పాను. ఇలాంటి సమయాల్లో మా పొరుగువారు, తమ పొరుగునే ఉన్న వారికి కాస్తయినా గౌరవం ఇవ్వాలి” అని అన్నారు.
 
“భారత్, పాకిస్తాన్ రెండు దేశాలూ కరోనావైరస్‌తో పోరాటం చేస్తున్నామని చెబుతున్నాయి. కానీ, నేను వాళ్లకు మొదట ఈ కాల్పులతో పోరాడండి అని చెబుతున్నా. సరిహద్దుల్లో జరిగింది మానవతకే విరుద్ధం” అని హైదర్ అన్నారు. కుప్వారాకు చెందిన తాహిర్ అహ్మద్ అనే మరో స్థానికుడు తమ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పారు.
 
“ఇలాగే, జమ్మూ ప్రాంతంలోని బాలాకోట్, ఇతర సెక్టార్లలో సరిహద్దుల దగ్గర జరుగుతున్న కాల్పులు స్థానికుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టాయి. ఉద్రిక్త వాతావరణంలో జనం సామాజిక దూరం నియమాలను ఉల్లంఘించాల్సి వస్తోంది” అని పూంచ్, బాలాకోట్ గ్రామ పెద్ద అయాజ్ అహ్మద్ చెప్పారు.
 
“సామాజిక దూరం పాటించాలని గట్టిగా చెబుతున్నారు. కానీ భయంలో ఉన్న జనం, ఆ ఆందోళనలో వేరే ఏదైనా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అనుకుంటున్న సమయంలో అది ఎలా సాధ్యమవుతుంది?” అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
 
“ఎప్పుడు కాల్పులు జరిగినా తలదాచుకోవడానికి మేం వేరే ప్రాంతాలకు పరుగులు తీస్తాం. మనం కరోనావైరస్‌తో పోరాడుతున్నఈ సమయంలో మన ప్రాణాలు కాపాడుకోవడం ఎంత కష్టమో మీరు ఊహించలేరు. మాకు రోడ్లు, రవాణా సౌకర్యాలు లేవు. రెండ్రోజుల క్రితం మా ఊళ్లోని ఒక మహిళ కాల్పుల్లో గాయపడ్డారు. ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లానికి మేం చాలా కష్టపడ్డాం. ఇక రెండోది కాల్పుల్లో ఎవరైనా చనిపోయినా, గాయపడినా, ఎవరి ఏడుపులైనా వినబడితే, మేం నిశ్శబ్దంగా మా ఇళ్లలోనే ఎలా కూచోగలం చెప్పండి” అని అన్నారు.
 
“ఆదివారం రాత్రి పాకిస్తాన్ సైన్యం జనావాసాలు ఉన్న ప్రాంతాలపై దాదాపు 300 షెల్స్ ప్రయోగించింది. మేం రాత్రంతా నిద్రపోలేదు. ప్రపంచం అంతమైపోతుందేమో అనిపించింది” అని అయాజ్ చెప్పారు.
 
ఎక్కడ తలదాచుకోవాలి?
షెల్లింగ్ సమయంలో తలదాచుకునేందుకు తమకు తగినన్ని బంకర్లు లేవని బాలాకోట్ సర్పంచ్ మజీద్ ఖటానా చెబుతున్నారు. “షెల్లింగ్ జరుగుతున్నప్పుడు, మేం ఎక్కడో ఒకచోట దాక్కోవాలి. మాకున్న ఒకే ఒక దారి బంకర్లలోకి వెళ్లి దాక్కోవడం. కానీ, మాకు మా ఊళ్లో పది బంకర్లే ఉన్నాయి. మా ఊరి జనాభా 12 వందల దాకా ఉంటుంది. ఒక బంకర్లో ఒకేసారి 20 మంది సర్దుకుని ఉండగలం. కానీ, ఇలాంటి సమయంలో బంకర్లోకి 20 మంది వెళ్తే, సామాజిక దూరం పాటించడం ఎలా సాధ్యం అవుతుంది” అన్నారు.
 
“మా మీద కాస్త దయచూపించాలని మేం మా పొరుగు దేశాన్ని వేడుకుంటున్నాం. వారు చేసేది చాలా దారుణం. మనం కలిసి కరోనావైరస్‌తో పోరాడదామని నేను మా పొరుగువారికి చెబుతున్నా” అని ఖటానా అన్నారు. ఖటానా ఉంటున్న ప్రాంతం నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) నుంచి రెండు కిలోమీటర్ల దూరం కూడా ఉండదు.
 
ఈ సరిహద్దు ప్రాంతాల ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయం, కూలీ, పశువుల పెంపకం వంటి పనులు చేస్తుంటారు. పూంచ్, బాలాకోట్‌కు చెందిన ఒక పోలీస్ అధికారి బీబీసీతో ఫోన్లో మాట్లాడుతూ “గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఘటనలతో జనం భయపడిపోయి ఉన్నారనేది వాస్తవం. కరోనా వల్ల చావు రాకపోయినా, షెల్లింగ్ వల్ల మాత్రం కచ్చితంగా చనిపోతామని వాళ్లంతా అనుకుంటున్నారు” అని అన్నారు.
 
“ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సైన్యంతో కలిసి మేం వెంటనే ఆ ప్రాంతాలకు చేరుకుంటాం. అక్కడివారిని ఖాళీ చేయిస్తాం” అని ఆయన చెప్పారు. 2003లో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన భారత్, పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) దగ్గర దానిని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశాయి.
 
నియంత్రణ రేఖ అనేది ఒక వివాదాస్పద సరిహద్దు. ఇది వివాదాస్పద కశ్మీర్ లోయను రెండు దేశాల మధ్యలో విభజిస్తుంది. ఇది పక్కపక్కనే ఉన్న భారత్, పాకిస్తాన్‌లను వేరుచేసే వర్కింగ్ బౌండరీలా ఉంటుంది. ఈ ఏడాది పాకిస్తాన్ సైన్యం ఇప్పటికే 650 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైన్యం చెబుతోంది.
 
సరిహద్దు దగ్గర ఈ తాజా కాల్పులు 2020 ఏప్రిల్ 5న ఎల్ఓసీలో కేరన్ సెక్టార్ దగ్గర ఆర్మీకి, మిలిటెంట్లకు మధ్య తీవ్రంగా ఎదురుకాల్పులు జరిగిన సమయంలో మొదలయ్యాయి. అప్పుడు కశ్మీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఐదుగురు చొరబాటుదారులను కాల్చిచంపామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.
 
ఆ ఎన్‌కౌంటర్‌లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీఓ) సహా, ఐదుగురు భారత జవాన్లు కూడా చనిపోయారు. ఎల్వోసీకి దగ్గరగా ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలను భారత సైన్యం ఇరవైనాలుగ్గంటలూ గమనిస్తూ ఉంటుంది. “పాకిస్తాన్ ఆర్మీ ఆదివారం కేరాన్ సెక్టార్‌లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు” అని శ్రీనగర్‌లో ఉన్న ఆర్మీ ప్రతినిధి రాజేష్ కాలియా ఒక ప్రకటనలో చెప్పారు.
 
ఇటు పాకిస్తాన్ కూడా “ఆదివారం అర్థ రాత్రి నియంత్రణ రేఖ వెంబడి భారతే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని, చిరికోట్, షకర్గా సెక్టార్లలో సరిహద్దు దగ్గర పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందని” ఆరోపించింది. సరిహద్దుల దగ్గర ఎప్పుడు కాల్పులు, షెల్లింగ్ జరిగినా కాల్పుల విరమణను ఉల్లంఘించారని రెండు దేశాలూ ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి.
 
ఇటు జమ్ము కశ్మీర్ బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ కూడా కుప్వారాలో నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నందుకు పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.