మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 15 ఏప్రియల్ 2020 (19:32 IST)

కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోడానికి, ఏదైనా ఒక దేశం చైనా నుంచి అవసరమైన పరికరాలు కొనుగోలు చేసినా, వాటిని తీసుకురావడానికి విమానం పంపించినా, అవి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. విమానం ఏ మార్గంలో వెళ్లాలి? దానిని ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు? అనే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే, దారిలో ఇతర దేశాలు ఆ పరికరాలను సొంతం చేసుకోకుండా, ఆ విమానం గమ్యానికి చేరుకోగలుగుతుంది.

 
ఇదంతా మీకు కాస్త గందరగోళంగా అనిపించడం సబబే. కానీ, అది నిజం. ప్రపంచంలోని కొన్ని దేశాలు, ముఖ్యంగా పెరూ లాంటి దేశాలు ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. చాలా దేశాల్లో వైద్య సేవలు అత్యవసర స్థితిని చూస్తున్నాయి. అందుకే, మాస్కులు, రెస్పిరేటర్లు, మెకానికల్ వెంటిలేటర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. అవి ఇప్పుడు సులభంగా దొరకడం లేదు.

 
పారిశ్రామిక యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా దేశాల ప్రభుత్వాలు దీనిపై ఫిర్యాదు కూడా చేస్తున్నాయి. వీటిలో ఏదీ చట్టవ్యతిరేకంగా జరిగేది కాకపోయినా, పరిస్థితులు ఇలాగే ఉంటాయని చెప్పలేం. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పౌరులకు అవసరమైన వస్తువులను ప్రభుత్వాలు సరఫరా చేయలేకపోతున్నాయి. ఫ్రాన్స్‌‌లో ‘మాస్క్ వార్’ గురించి మాట్లాడుకుంటున్నారు.

 
కొత్త తరం దోపిడీలు
అయితే, ఫ్రాన్స్ మాస్కులు కొనలేకపోవడానికి ఒక కారణం ఉంది. అమెరికా వ్యాపారులు కొందరు వాటిని అధిక ధరలకు అమ్ముతున్నారు. “ఇటీవల చైనాలోని ఒక రన్‌వే మీద ఫ్రాన్స్ కోసం మాస్కులు తీసుకెళ్తున్న విమానంలోని వస్తువులను అమెరికన్లు అధిక ధరకు కొనుగోలు చేశారు. దాంతో ఫ్రాన్స్‌కు చేరుకోవాల్సిన ఆ విమానం అమెరికా వెళ్లిపోయింది” అని ఫ్రాన్స్‌‌లోని ఒక ప్రాంతీయ పార్టీ నేత రెనాండ్ ముసెలియర్ చెప్పారు.

 
ఇలాంటి ఫిర్యాదులే జర్మనీ వైపు నుంచి కూడా వచ్చాయి. ఈసారీ అది నేరుగా అమెరికా ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసింది. “బెర్లిన్ పోలీసుల కోసం తీసుకొస్తున్న రెండు లక్షల మాస్కుల షిప్‌మెంట్‌ను థాయ్‌లాండ్‌లో అమెరికా స్వాధీనం చేసుకుంది” అని జర్మనీ అధికారులు ఆరోపించారు.

 
“మేం ఈ కొత్త తరం దోపిడీని చూస్తున్నాం. అట్లాంటిక్ సముద్రానికి మరోవైపు ఉన్న స్నేహితులు ఇలా చేస్తారని మేం అనుకోలేదు. ఇది ప్రపంచ సంక్షోభ సమయమే అయ్యుండచ్చు. కానీ, మనం అడవి మనుషుల్లా ప్రవర్తించకూడదు. అంతర్జాతీయ నియమ నిబంధనలను పాటించాలని అమెరికా ప్రభుత్వానికి మా వినతి” అని జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎండ్రియాస్ గీజెల్ అన్నారు

 
పీపీఈల ఎగుమతికి భారత్, టర్కీ బ్రేక్
అయితే, ట్రంప్ ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. దేశానికి బయట తాము ఎలాంటి పరికరాలూ స్వాధీనం చేసుకోలేదని, అలాంటి ఏ ఆపరేషన్లూ నిర్వహించలేదని చెప్పింది. దాంతో చివరికి జర్మనీనే తన స్వరం తగ్గించాల్సి వచ్చింది. ఆ దేశం కొనుగోలు చేసిన మాస్కులు ఇప్పటికీ బెర్లిన్ చేరనే లేదు. ఫ్రాన్స్, జర్మనీ లాంటి సంపన్న దేశాల పరిస్థితే ఇలా ఉంటే, బలహీన దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

 
“అలాంటి దేశాల పరిస్థితిని అసలు ఊహించలేం. విపరీతమైన డిమాండ్, పరిమిత సరఫరా వల్లే ఈ ఇబ్బంది వస్తోంది” అని స్పెయిన్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ మెనెల్ పీరియో అన్నారు. యూరోపియన్ దేశాల్లో ఉన్న పరిస్థితిని మిగతా దేశాలు కూడా ఎదుర్కొంటున్నాయి.

 
ఈ మహమ్మారి గ్లోబలైజేషన్, ఫ్రీ మార్కెట్ ఎకానమీని కుదిపేసింది. ఫేస్ మాస్కులు, గౌను లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ) ఉత్పత్తి చేసే పెద్ద దేశాలు తమ ఆస్పత్రులకు తగినంత సరఫరా ఉండేలా వాటి ఎగుమతులను నిషేధించాయి. వీటిలో భారత్, టర్కీ, అమెరికా లాంటి దేశాలు కూడా ఉన్నాయి.

 
ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఎక్కడ?
కరోనా మహమ్మారి ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన స్పెయిన్, టర్కీ నుంచే కాదు, సహచర యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్ నుంచి కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తమ దేశం మీదుగా స్పెయిన్ వెళ్తున్న పీపీఈ కిట్స్ సరుకును ఫ్రాన్స్ అడ్డుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా నుంచి తాము కొనుగోలు చేసిన పరికరాలు ఎలా తెప్పించుకోవాలో తెలీక పెరూ లాంటి దేశాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.

 
పెరూ ఆరోగ్య మంత్రి విక్టర్ జమోరా బీబీసీ ముండోతో “స్పెయిన్ తమ ఎయిర్‌పోర్టులో పీపీఈ కిట్స్ తీసుకువచ్చే విమానం దిగడానికి, వెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదని భరోసా ఇచ్చింది. కానీ దారిలో ఇంకా చాలా ఉన్నాయి. టర్కీ దానిని ఆపేస్తే ఏం చేయాలి. ఏదో జరుగుతోంది. నియమాలు, చట్టాలు చాలా వేగంగా మారిపోతున్నాయి” అన్నారు.

 
అంతే కాదు, ఫ్రీ మార్కెట్ ఎకానమీలోని మిగతా నియమాలు కూడా సవాలుగా మారుతున్నాయి. ఎవరు ఎక్కువ ధర పెడతారో వస్తువు వారికే దొరుకుతుంది లేదా ఎవరు ఎక్కువ మొత్తంలో కొంటారో వారికే అమ్ముతాం. అనే నియమాలు ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి.

 
అమెరికాకే ప్రాధాన్యం
“పరికరాల టెక్నాలజీ, ఏ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాం, అనే దానిని బట్టి మేం వినియోగదారుల వరుసలో అత్యంత చివరన నిలబడి ఉన్నాం. మేం 100 వెంటిలేటర్లు కొనుగోలు చేస్తుంటే, మిగతా దేశాలు లక్ష యూనిట్లు కొంటున్నాయి. ఆ స్థాయితో పోలిస్తే ప్రపంచ మార్కెట్‌లో మాకు అసలు ఉనికి లేదు. మాది చాలా చిన్న దేశం” అని విక్టర్ జమేరా అన్నారు.

 
లాటిన్ అమెరికాలో బలమైన దేశంగా భావించే బ్రెజిల్‌కు కూడా ఈ చిక్కులు తప్పలేదు. కొన్ని రోజుల క్రితం చైనాలో ఒక మెడికల్ ప్రొడక్ట్స్ ఆర్డర్ బ్రెజిల్ చేజారిపోయింది. చైనా విక్రేతలు బ్రెజిల్, ఫ్రాన్స్, కెనెడాకు బదులు అమెరికాకు ప్రాధాన్యం ఇచ్చారు అని బ్రెజిల్ వార్తా పత్రిక ‘ఓ గ్లోబో’ ప్రచురించింది.

 
భారత మార్కెట్ రీసెర్చ్ సంస్థ మెటిక్యులస్ రీసెర్చ్ బీబీసీ ముండోతో “కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాల డిమాండ్ పెంచేసింది. ప్రపంచ దేశాల్లో 85 శాతం ఆస్పత్రులు వైద్య పరికరాల కొరత ఎదుర్కొంటున్నాయి” అని చెప్పింది.

 
అమెరికాలో కరోనా టెర్రర్
“అమెరికా లాంటి అభివృద్ధి దేశాల దగ్గర నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల మాస్కులు రిజర్వులో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మొత్తం మాస్కుల డిమాండులో అది ఒకటి నుంచి ఒకటిన్నర శాతం ఉంటుంది. యూరప్, అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది” అని మెటిక్యులస్ రీసెర్చ్ చెప్పింది.

 
మెడికల్ సప్లైల విషయంలో అమెరికాను ప్రపంచంలోనే అత్యధిక నిల్వలు ఉంచుకునే దేశంగా భావిస్తారు. 5.5 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసుల్లో 23 వేలకు పైగా మరణాలు చూసిన అమెరికా, కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కునేందుకు సిద్ధమవుతోంది. అమెరికా కంపెనీలు యుద్ధప్రాతిపదికన పనిచేస్తూ తమ ఉత్పత్తిని రెట్టింపు చేస్తున్నాయి అని మెటిక్యులేషన్ రీసెర్చ్ చెబుతోంది.

 
అమెరికా ప్రభుత్వం వర్గాలు మాత్రం “ఏప్రిల్ చివరి నాటికి మా వైద్య పరికరాల డిమాండ్ రెట్టింపు అవుతుందని అనుకుంటున్నాం. వచ్చే వంద రోజుల్లో అమెరికాలో ఒక లక్ష వెంటిలేటర్స్ అవసరం అవుతాయి. చివరికి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు వాటిని ఉత్పత్తి చేసినా ఆ డిమాండును అందుకోలేవు” అన్నారు.

 
ప్రపంచీకరణ భావన అంతం
ఉత్పత్తిదారులు పరికరాల రేట్లు పెంచినా, వస్తున్న డిమాండ్‌ను అందుకోవడం వారికి సాధ్యం కాదు. మెటిక్యులేషన్ రీసెర్చ్ ఇచ్చిన ఉదాహరణలను బట్టి ఐర్లాండ్ కంపెనీ మెడట్రోనిక్ వెంటిలేటర్ ఉత్పత్తి చేసే తమ సామర్థ్యాన్ని 40 శాతం వరకూ పెంచింది. ప్రతి నెలా 160 వెంటిలేటర్లు ఉత్పత్తి చేసే ఇటలీ కంపెనీ సియారా 4 నెలల్లో రెండు వేల వెంటిలేటర్లు తయారు చేయాలని అనుకుంటోంది.

 
ఆటోమొబైల్ కంపెనీ సియెట్ స్పెయిన్‌లో తమ ఉత్పత్తిని ఆపేసింది. ఇప్పుడు అది ఆస్పత్రుల కోసం వెంటిలేటర్లు తయారు చేస్తోంది. కొన్ని దేశాల్లో టెక్స్ టైల్ కంపెనీలు మాస్క్ తయారు చేస్తున్నాయి. “పారిశ్రామిక స్థాయిలో చూస్తే నాకు ఈ మహమ్మారి ‘ఆర్థిక ప్రపంచీకరణ’ అనే భావనను అంతం చేసినట్లు అనిపిస్తోంది. మనం తిరిగి స్వదేశీ వస్తు రక్షణ విధానంలోకి వచ్చేశాం” అని విక్టర్ జమోరా అన్నారు. 

 
పెరూలో కొందరు యూనివర్సిటీ విద్యార్థులు ఒక వెంటిలేటర్ నమూనా తయారు చేశారు. ఈ దక్షిణ అమెరికా దేశం దగ్గర ప్రస్తుతం చాలా తక్కువ వెంటిలేటర్లు ఉన్నాయి. దాంతో, అది విదేశీ మార్కెట్ల నుంచి వాటిని కొనుగోలు కూడా చేసింది. అవి ఏప్రిల్ చివరి నాటికి డెలివరీ కావడం కష్టం. అయితే, అవి అసలు పెరూకు చేరుకుంటాయా అని విక్టర్ జెమోరా సందేహిస్తున్నారు.

 
వేరే దేశాలు అడ్డుపడితే అంతే...
రెస్పిరేటర్స్ లాంటి పరికరాలను సాధారణంగా నిర్మాణ పరిశ్రమలో ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు వాటిని ఆస్పత్రుల్లో వేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా వీటిని ఉత్పత్తి చేసే అమెరికా కంపెనీ 3M ఆ రెస్పిరేటర్లను కెనెడా, లాటిన్ అమెరికాలకు ఎగుమతి చేయకుండా ట్రంప్ ప్రభుత్వం కొరియా యుద్ధ సమయంలో తెచ్చిన ఒక చట్టాన్ని తెరపైకి తెచ్చింది.

 
“మాకు మాస్కుల అవసరం ఉంది. వాటిని వేరే దేశాలు సొంతం చేసుకోవాలని మేం అనుకోవడం లేదు. దేశ ప్రజలకు అవసరమైన వాటిని మాకు ఇవ్వని కంపెనీలతో మేం కఠినంగా ప్రవర్తించాల్సి ఉంటుంది” అని ట్రంప్ ఒక మీడియా సమావేశంలో చెప్పారు.

 
చాలా రోజులు వరకూ ఉద్రిక్తత కొనసాగిన తర్వాత 3M, వైట్ హౌస్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం విదేశాల్లో ఉన్న పరిశ్రమల్లో తయారయ్యే రెస్పిరేటర్లను అమెరికాకు ఎగుమతి చేసేలా, మాస్కులను మిగతా దేశాలకు కూడా సరఫరా కొనసాగేలా రెండింటి మధ్య ఒక అంగీకారం కుదిరింది.

 
కరోనా మహమ్మారి గుప్పిట్లో లక్షలమంది చిక్కుకుపోయారు. ప్రపంచ దేశాల మధ్య పరస్పరం నమ్మకం తగ్గిపోతోంది. ప్రొఫెసర్ మెనెల్ పీరియో మాటల్లో చెప్పాలంటే “ప్రభుత్వాలు, మార్కెట్ ఎకానమీకి సంబంధించిన అత్యంత జుగుప్సాకరమైన ముఖాన్ని కరోనా మన ముందుకు తీసుకొచ్చింది”.