మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 15 ఏప్రియల్ 2020 (17:40 IST)

కరోనావైరస్: ఇండోనేషియాలో కాపలా కాస్తున్న 'దెయ్యాలు'

ఇండోనేషియాలోని ఒక గ్రామంలో ప్రజలు కరోనావైరస్ ప్రమాదాల్ని గుర్తించి, భౌతిక దూరం పాటించేలా భయపెట్టేందుకు దెయ్యాల రూపంలో పని చేసే వాలంటీర్లను నియమించారు. జావా ద్వీపంలోని కెపు గ్రామంలో నెల రోజులుగా రాత్రి పూట కాపలా కాసేందుకు సిబ్బందిని నియమించారు. ఇండోనేషియా జానపద కథల ప్రకారం, పొకాంగ్ అనే దెయ్యపు ఆకారాలను మరణించిన వారి ఆత్మలకు సంకేతాలుగా చూస్తారు.

 
ఇండోనేషియాలో ఇప్పటి వరకు 4,500 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 400 మంది మరణించారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. కెపు గ్రామంలో ప్రజలను బయటకి రాకుండా భయపెట్టాలనే ఆలోచనతో, పొకోంగ్లను (దెయ్యం రూపంలో వేషధారణలో ఉండేవారు) నియమించారు.

 
అయితే, వారిని చూసి చాలామంది భయపడట్లేదని, వారు ఎలా ఉన్నారో చూసేందుకు వచ్చే జనం ఎక్కువగా ఉన్నారని రాయిటర్స్ వార్తా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ, వారిని నియమించినప్పటి నుంచీ పరిస్థితులు మెరుగుపడ్డాయని స్థానికులు చెప్పారు.

 
"వీధుల్లో పొకోంగ్‌లను ఏర్పాటు చేసినప్పటి నుంచీ ఇళ్ల నుంచి తల్లులు, పిల్లలు బయటకు రావడం మానేశారు. సాయంత్రం ప్రార్ధనలు అయిపోగానే ప్రజలు గుమిగూడటం కూడా ఆపేశారు" అని కర్ణో సుపాద్మో అనే స్థానికుడు చెప్పారు. "కరోనావైరస్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఇలా హెచ్చరించడం ద్వారా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి" అని స్థానిక మసీదు నిర్వహణ పనులు చూసే అంజర్ పంక, జకార్తా పోస్ట్‌కు చెప్పారు. 

 
ఈ ఆలోచనను ఒక స్థానిక యువ బృందం నాయకుడు స్థానిక పోలీసుల సహాయంతో అమలు చేశారు."మేము కాస్త వినూత్నంగా ఆలోచించి ఇలా చేశాం. ఎందుకంటే పొకోంగ్‌లు భయపెట్టేలా ఉంటారు" అని యువ బృందం నాయకుడు అంజర్ చెప్పారు. దేశ ప్రజారోగ్య వ్యవస్థ అతలాకుతలం అవుతుందనే భయం ఉన్నప్పటికీ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ ఇప్పటికీ దేశ వ్యాప్త లాక్ డౌన్‌ విధించలేదు.

 
ఈ కోవిడ్-19 నుంచి రక్షించుకునే మార్గాల పట్ల ఇంకా ప్రజల్లో పూర్తి అవగాహన లేదని కెపు గ్రామ అధికారి అన్నారు. "అందరికీ సాధారణ జీవనం కొనసాగించాలని ఉంది. ఇంట్లో ఉండమంటే చాలా ఇబ్బంది పడుతున్నారు" అని ఆయన చెప్పారు. కరోనావైరస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు వివిధ దేశాలలో రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు.

 
భారతదేశంలో కొంత మంది పోలీసులు కరోనావైరస్ ఆకారంలో ఉండే హెల్మెట్లు ధరించి వైరస్‌తో వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు.