మనుషులకు సోకే మొదటి కరోనావైరస్‌ను కనిపెట్టిన మహిళ జూన్ అల్మీడా.. ఒక స్కాటిష్ బస్ డ్రైవర్ కుమార్తె. జూన్ అల్మీడా 16 ఏళ్ల వయసులోనే బడి మానేశారు. అయినప్పటికీ వైరాలజిస్ట్‌గా వైరస్ చిత్రీకరణలో ఓ పయనీర్‌గా నిలిచారు. ఇప్పుడు కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఆమె పేరు మరోసారి మార్మోగుతోంది.
కోవిడ్-19 అనేది కొత్త వైరస్సే అయినా.. డాక్టర్ అల్మీడా 1964లో లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో తన లేబరోటరీలో మొదటిసారి గుర్తించిన కరోనావైరస్ రకానికి చెందిన వైరస్ ఇది. ఆమె 1930లో జన్మించారు. పుట్టినపుడు ఆమె పేరు జూన్ హార్ట్. ఈశాన్య గ్లాస్గోలో పెరిగారు.
మధ్యలోనే బడి మానేయటంతో సాధారణ విద్య పెద్దగా లేదు. కానీ గ్లాస్గో రాయల్ ఇన్ఫర్మరీలో హిస్టోపాథాలజీ విభాగంలో లేబరోటరీ టెక్నీషియన్‌గా ఉద్యోగం సంపాదించారు. కెరీర్‌లో భాగంగా ఆ తర్వాత లండన్‌కు వచ్చారు. వెనెజ్వెలాకు చెందిన ఆర్టిస్ట్ ఎన్రకెస్ అల్మీడాను వివాహం చేసుకున్నారు.
సాధారణ జలుబు మీద పరిశోధన
ఆ దంపతులకు ఒక కూతురు జన్మించింది. వారి కుటుంబం తర్వాత కెనడాలోని టొరంటోకు నివాసం వెళ్లింది. ఓంటారియో కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో డాక్టర్ అల్మీడా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ మీద అద్భుతమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారని వైద్య రచయిత జార్జ్ వింటర్ పేర్కొన్నారు.
యాంటీబాడీలను ఉపయోగించి వైరస్‌లను పెంచటం ద్వారా వైరస్‌లను మరింత మెరుగుగా చూడగలిగే ఒక విధానాన్ని ఆమె అభివృద్ధి చేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన బ్రిటన్ ఆమెను మళ్లీ వెనక్కు రప్పించిందని వింటర్ చెప్పారు. అలా లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్ మెడికల్ స్కూల్‌లో విధుల్లో చేరారు. ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కోవిడ్-19 వైరస్ సోకినపుడు ఇదే ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేశారు.
విల్ట్‌షైర్‌లోని సాలిస్బరీలో సాధారణ జలుబు మీద పరిశోధన సాగిస్తున్న డాక్టర్ డేవిడ్ టిరెల్‌తో జూన్ అల్మీడా జట్టుకట్టారు. వలంటీర్ల నుంచి సేకరించిన నమూనాలపై అధ్యయనం చేస్తున్న డాక్టర్ టిరెల్, ఆయన బృందం.. సాధారణ జలుబుకు కారకమయ్యే కొన్ని వైరస్‌లను పెంచగలిగారు. కానీ, అన్ని వైరస్‌లనూ పెంచలేకపోయారని వింటర్ వివరించారు.
ప్రత్యేకించి.. సర్రీలోని ఒక బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న ఒక విద్యార్థి నుంచి 1960లో సేకరించిన బీ814 నమూనాలోని వైరస్ వారికి అంతుచిక్కలేదు. ఆ వైరస్ ద్వారా వలంటీర్లకు సాధారణ జలుబు లక్షణాలను సోకేలా చేయగలుగుతున్నారు కానీ.. ఆ వైరస్‌ను మామూలు సెల్ కల్చర్‌లో పెంచలేకపోతున్నారు.
అయితే.. శరీర అవయవాల్లో ఆ వైరస్ పెరుగుతున్నట్లు వలంటీర్లను అధ్యయనం చేసినపుడు తేలింది. దీంతో.. ఆ వైరస్‌ను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులో చూడగవచ్చేమోనని డాక్టర్ టిరెల్ భావించారు. ఆ వైరస్ నమూనాలను జూన్ అల్మీడాకు పంపించారు. ఆమె వైరస్ కణాలను చూశారు. అవి ఇన్‌ఫ్లుయెన్జా వైరస్‌ల తరహాలోనే ఉన్నాయి కానీ.. అచ్చంగా అదే పోలికలతో లేవని ఆమె వివరించారు.
ఆమె గుర్తించిన ఆ వైరస్‌కే కరోనావైరస్ అని పేరు పెట్టారు. అదే మొట్టమొదటి మానవ కరోనావైరస్. నిజానికి ఇటువంటి వైరస్ కణాలను డాక్టర్ అల్మీడా.. ఎలుకల్లో హెపటైటిస్, కోళ్లలో బ్రోంకైటిస్‌ల మీద పరిశోధన చేస్తున్నపుడు చూశారని డాక్టర్ వింటర్ చెప్తారు. అయితే.. కొత్త అధ్యయనాలను ప్రచురించే ఒక జర్నల్, అందులోని నిపుణులు.. ఆమె పంపించిన ఫొటోలు ‘‘ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ కణాల ఫొటోలే కానీ సరిగా తీయలేదు’’ అంటూ ఆమె అధ్యయన పత్రాన్ని తిరస్కరించారు.
కానీ.. బీ814 నమూనాలో కొత్తగా గుర్తించిన వైరస్ వివరాలను 1965లో బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. రెండేళ్ల తర్వాత.. డాక్టర్ అల్మీడా మొదటి చూసిన వైరస్ కణాల ఫొటోలను జర్నల్ ఆఫ్ జనరల్ వైరాలజీలో ముద్రించారు. ఆ వైరస్‌కు.. డాక్టర్ టిరెల్, డాక్టర్ అల్మీడా, సెయింట్ థామస్ హాస్పిటల్లో సంబంధిత విభాగం అధిపతి ప్రొఫెసర్ టోనీ వాటర్సన్‌లు కరోనావైరస్ అని నామకరణం చేశారు. ఆ వైరస్ చిత్రంలో వైరస్ కణాల చుట్టూ కిరీటంలా ఉండటమే దీనికి కారణం.
డాక్టర్ అల్మీడా అనంతరం లండన్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ స్కూల్‌లో పనిచేశారు. అక్కడ ఆమె డాక్టరేట్ పొందారు. ఆమె తర్వాత వెల్‌కమ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేశారు. అక్కడ వైరస్‌ల చిత్రీకరణలో పలు పేటెంట్లు ఆమె పేరు మీద ఉన్నాయి.
వెల్‌కమ్ ఇన్‌స్టిట్యూట్‌లో కెరీర్ ముగిసిన తర్వాత డాక్టర్ అల్మీడా యోగా బోధకురాలిగా మారారు. మళ్లీ 1980ల చివర్లో వైరాలజీ విభాగంలో సలహాదారుగా చేరారు. ఆ సమయంలో.. హెచ్ఐవీ వైరస్ కొత్త ఫొటోలు తీయటానికి ఆమె దోహదపడ్డారు. జూన్ అల్మీడా 77 ఏళ్ల వయసులో 2007లో చనిపోయారు.
ఆమె చనిపోయిన 13 సంవత్సరాల తర్వాత.. ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తోన్న కొత్త కరోనావైరస్ మహమ్మారిని అర్థం చేసుకునే కృషిని వేగవంతం చేయటంలో ఆమె కృషికి తగిన గుర్తింపు లభిస్తోంది.