మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2019 (14:17 IST)

సముద్రంలోని ఇంట్లో కాపురం చేస్తున్న ప్రేమజంటకు మరణ శిక్ష పడనుందా?

థాయ్‌లాండ్ తీరానికి 19 కిలోమీటర్ల దూరంలో సముద్ర జలాల్లోని నిర్మాణం, థాయ్‌లాండ్ సముద్ర జలాల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారని, థాయ్‌లాండ్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని ఒక ప్రేమజంటపై ఆరోపణలు వచ్చాయి.


ఇవి రుజువైతే వీరికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశముంది. థాయ్‌లాండ్ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించారని ఆ దేశ నౌకాదళం ఆరోపణలు చేసిన అనంతరం అమెరికాకు చెందిన చాద్ ఎల్వర్‌టౌస్కీ, ఆయన ప్రియురాలు సుప్రనీ తెప్డెట్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
 
ఫుకెట్ తీరానికి దాదాపు దాదాపు 19 కిలోమీటర్ల(12 మైళ్ల) దూరంలో 20 మీటర్ల (65 అడుగుల) ఎత్తైన నిర్మాణంపై ఈ సముద్ర నివాసం ఉంది. ఇదో కాంక్రీట్ ట్యాంక్. ఈ నివాసమున్న ప్రాంతం థాయ్‌లాండ్ పరిధిలోకి రాదని, ఇది తీరానికి 20.9 కిలోమీటర్ల(13 మైళ్ల ) దూరంలో ఉందని చాద్ ఎల్వర్‌టౌస్కీ చెబుతున్నారు.
 
"సముద్రంలో కాంక్రీట్ ట్యాంక్ ఒకటి నౌకాదళ బృందానికి కనిపించింది. అప్పుడు అందులో ఎవరూ లేరు" అని పోలీసు కల్నల్ నికోర్న్ సోమ్‌సుక్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు. ఈ ఇంటిని అక్కడ నిర్మించుకోవడానికి ముందు ఎల్వర్‌టౌస్కీ జంట థాయ్‌లాండ్ అధికార యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోలేదని ఆయన వెల్లడించారు. ఈ నిర్మాణం ఏర్పాటుకు థాయ్‌లాండ్ అధికార యంత్రాంగ నుంచి అనుమతి తీసుకోలేదని థాయ్ నౌకాదళం చెబుతోంది.
 
'సీస్టెడింగ్' ఉద్యమం మద్దతుదారులు
ఎల్వర్‌టౌస్కీ గతంలో అమెరికా సైన్యంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. తర్వాత వర్చువల్ కరెన్సీ బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ జంట 'సీస్టెడింగ్' ఉద్యమం మద్దతుదారులు. ఏ దేశ చట్టాల పరిధిలోకీ రాకుండా ఉండేందుకు, అంతర్జాతీయ జలాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ఈ ఉద్యమం ప్రోత్సహిస్తుంది. ఇలాంటి ఇళ్ల నిర్మాణాలకు నిధులను సమకూర్చే వ్యాపారవేత్తల గ్రూపు 'ఓసియన్ బిల్డర్స్'లోనూ ఎల్వర్‌టౌస్కీ, సుప్రనీ సభ్యులుగా ఉన్నారు.
 
స్వేచ్ఛను ప్రేమించేవాళ్లందరూ ఒక చోటకు చేరేందుకు, స్వేచ్ఛగా ఉండేందుకు సీస్టెడింగ్ ఉద్యమం వేదిక కల్పిస్తుందని ఫిబ్రవరిలో ఒక వీడియోలో ఎల్వర్‌టౌస్కీ చెప్పారు. ఇప్పుడు వివాదాస్పదమైన నిర్మాణాన్ని ఫిబ్రవరిలోనే నిర్మించారు. ఇది ఈ వారంలోనే థాయ్‌లాండ్ నౌకాదళం దృష్టికి వచ్చింది. ఈ ఇంటిని ఎల్వర్‌టౌస్కీ, సుప్రనీ నిర్మించుకోలేదని, అందులో వీళ్లు అద్దెకు ఉంటున్నారని ఓసియన్ బిల్డర్స్ వెబ్‌సైట్లో పెట్టిన ఒక ప్రకటన పేర్కొంది. "ఈ జంట కొన్ని వారాలపాటు ఈ నివాసంలో గడిపారు. వారి సాహసాన్ని అక్షరీకరించారు" అని చెప్పింది.
 
ఈ నిర్మాణం డిజైన్‌లో వీరికి ఏ పాత్రా లేదని ప్రకటన స్పష్టం చేసింది. తాము ప్రస్తుతం సురక్షితమైన ప్రదేశంలోనే తలదాచుకొంటున్నామని ఎల్వర్‌టౌస్కీ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు. సీస్టెడింగ్ ఉద్యమం కింద ఎన్ని ఇళ్లు అంతర్జాతీయ జలాల్లో నిర్మితమయ్యాయనేది స్పష్టంగా తెలియదు. ఇలాంటి ఉదాహరణలు మాత్రం ఉన్నాయి.
 
ఉత్తర సముద్రంలోని సీలాండ్
ఇలాంటి ఇళ్ల సముదాయాలను సూక్ష్మ దేశాలు(మైక్రోనేషన్స్) అని కూడా వ్యవహరిస్తారు. స్వీయ ప్రకటిత రాజ్యాలైన వీటిని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. ఇలాంటి 'రాజ్యాల్లో' సీలాండ్ ఒకటి. ఉత్తర సముద్రంలోని ఈ 'రాజ్యం' బాగా ప్రాచుర్యం పొందింది. దీనికి సొంత జెండా, సొంత కరెన్సీ, ఫుట్‌బాల్ జట్టు కూడా ఉన్నాయి.
 
సీలాండ్ కరెన్సీ. ఇది సీలాండ్‌లో తప్ప ఎక్కడా చెల్లదు. ఆస్ట్రేలియాలోనూ పలు అనధికార, గుర్తింపులేని సూక్ష్మదేశాలు వెలిశాయి. వీటిలో- హుట్ రివర్ ప్రావిన్స్ ఒకటి. ఇది ఆస్ట్రేలియా పశ్చిమ భాగంలోని పెర్త్ నగరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదో ప్రైవేటు ఎస్టేట్. గోధుమ కేటాయింపులపై వివాదం నేపథ్యంలో తాము వేరుపడుతున్నట్లు 1970లో ఇది ప్రకటించుకుంది. హుట్ రివర్ ప్రావిన్స్‌కు సొంత జెండా, కరెన్సీ ఉన్నాయి. కరెన్సీ పేరు- హుట్ రివర్ డాలర్.
 
అఖ్‌జివ్‌లాండ్‌ వ్యవస్థాపకుడు ఎలీ అవీవ్ నిరుడు చనిపోయారు. ఇజ్రాయెల్ ఉత్తర భాగంలోని అనధికార సూక్ష్మదేశం అఖ్‌జివ్‌లాండ్‌లో దాదాపు అర్ధ శతాబ్ద కాలం ఇద్దరే ఇద్దరు ఉన్నారు. వీరిలో దీని వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన ఎలీ అవీవి నిరుడు చనిపోయారు. ఆయన వయసు 88 ఏళ్లు.