శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 17 మే 2021 (22:27 IST)

కోవిడ్: విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న అత్యవసర సహాయం అవసరమైన వారికి చేరుతోందా?

భారతదేశంలో కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలు అత్యవసర వైద్య సహాయాన్ని అందిస్తున్నాయి. బ్రిటన్, అమెరికాల నుంచి గత వారం మొదట్లో వెంటిలేటర్లు, ఔషధాలు, ఆక్సిజన్ పరికరాలతో నిండిన విమానాలు భారతదేశానికి చేరుకున్నాయి. ఆదివారం నాటికి మొత్తం 25 విమానాల్లో సుమారు 300 టన్నుల వైద్య పరికరాలు, ఉత్పత్తులు దిల్లీ విమానాశ్రయానికి చేరాయి.

 
కానీ, దేశంలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతుండగా, అవసరమైన వారికి తగిన వైద్య సహాయం ఇంకా అందటం లేదనే ఆందోళన కూడా పెరుగుతోంది. ఒక వైపు ఆసుపత్రులు సహాయం కోసం అర్ధిస్తుండగా దేశానికి చేరిన వైద్య పరికరాలు చాలా రోజుల వరకు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయాయి. "అత్యవసర సహాయం దేశానికి చేరిన ఒక వారం రోజుల వరకు అంటే సోమవారం సాయంత్రం వరకు ఈ ఉత్పత్తుల సరఫరా మొదలు కాలేదు" అని రాష్ట్రాల అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు.

 
అయితే, భారత ప్రభుత్వం మాత్రం వీటి సరఫరాలో ఎటువంటి ఆలస్యం జరగలేదని చెబుతోంది. వీటిని క్రమబద్ధంగా, సక్రమంగా పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిని సత్వరమే అవసరమైన ప్రాంతాలకు తరలించడానికి అధికారులు 24 గంటలు పని చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. కానీ, కోవిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు మాత్రం తమకు ఎటువంటి సరఫరాలు అందలేదని చెబుతున్నాయి.

 
ఈ వారం మొదట్లో 37,190 కోవిడ్ కేసులు నమోదయిన కేరళలో బుధవారం సాయంత్రానికి ఎటువంటి సహాయమూ అందలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ రాజన్ ఖోబ్రాగాడే బీబీసీకి చెప్పారు. కేరళలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ బుధవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.

 
ఈ అత్యవసర సహాయం ఎక్కడకు వెళుతోంది?
రాష్ట్రాలకు సహాయం ఎప్పుడు అందుతుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం లేదని కొంత మంది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. "ఈ అత్యవసర సహాయాన్ని ఎక్కడకు పంపిస్తున్నారనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు" అని హెల్త్ కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ హర్ష్ మహాజన్ చెప్పారు. ప్రభుత్వ ధోరణితో విసుగెత్తిపోయామని కోవిడ్ సంక్షోభంలో సహాయక చర్యలు చేపడుతున్న కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు అంటున్నాయి.

 
"విదేశాల నుంచి వస్తున్న సహాయం ఎక్కడకు వెళుతుందనే విషయం పై ఎవరికీ స్పష్టత లేదు" అని ఆక్స్ ఫామ్ ఇండియా డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రాం అండ్ అడ్వోకసి పంకజ్ ఆనంద్ అన్నారు. దీనికి సమాధానం చెప్పడానికి ఒక ట్రాకర్ కానీ, వెబ్ సైటు కానీ ఏమి లేవని చెప్పారు. అత్యవసర వైద్య పరికరాలను సరఫరా చేయడం పట్ల సమాచారం లేకపోవడం వల్ల సహాయం అందిస్తున్న విదేశాల్లో కూడా తాము పంపించిన సహాయం ఎక్కడకు వెళుతుందనే లాంటి చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది.

 
"అమెరికాలోని పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో భారతదేశానికి పంపిస్తున్న సహాయానికి జవాబుదారీ ఏమన్నా ఉందా" అంటూ శుక్రవారం అమెరికా ప్రభుత్వం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఒక విలేకరి డిమాండు చేశారు. "భారత ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కొనేటట్లు చూసేందుకు అమెరికా నిబద్దతతో ఉంది" అని విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. భారతదేశానికి బ్రిటన్ పంపించిన 1000 వెంటిలేటర్లు ఎక్కడకు సరఫరా అయ్యాయని కామన్ వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌ను బీబీసీ అడిగింది.

 
వైద్య పరికరాలు, ఉత్పత్తులను సమర్థంగా సరఫరా చేసేందుకు భారతీయ రెడ్ క్రాస్, భారత ప్రభుత్వంతో కలిసి బ్రటిన్ పని చేస్తున్నట్లు ఎఫ్‌సీడీ సమాధానమిచ్చింది. "వైద్య సహాయాన్ని ఎలా అందివ్వాలనే విషయం పై నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకుంటుంది" అని చెప్పింది. ఈ సహాయక చర్యల గురించి సమాచారం కావాలని దేశంలో ప్రతిపక్ష నాయకులు కూడా అడుగుతున్నారు. ‘‘సహాయం ఎక్కడ నుంచి వస్తోంది, ఎక్కడకు వెళుతోంది" అనే సమాచారాన్ని ప్రతి భారతీయునితోనూ పంచుకోండి. మీకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది" అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు.

 
ప్రణాళికాబద్ధమైన సరఫరా
రాష్ట్రాలకు వైద్య పరికరాల సరఫరాను ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేసేందుకు భారత ప్రభుత్వానికి 7 రోజులు పట్టిందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ఏప్రిల్ 26న ఈ సహాయ ప్రణాళికలపై పని చేయడం మొదలుపెట్టి, వీటిని సరఫరా చేసేందుకు మే 2న నియమావళిని విడుదల చేసింది. అయితే, ఈ సరఫరా ఎప్పుడు మొదలైందో చెప్పలేదు.

 
విదేశాల నుంచి సహాయం భారతదేశం చేరినప్పటికీ వీటి పంపిణీ వివిధ దశలతో, మంత్రిత్వ శాఖలతో, సంస్థలతో కూడుకుని చాలా సంక్లిష్టంగా ఉంటుంది. సహాయక విమానాలు భారతదేశానికి రాగానే వాటిని తీసుకుని కస్టమ్స్ క్లియరెన్స్ చూసుకునే బాధ్యతను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తీసుకుంటుంది అని ప్రభుత్వ ప్రకటన చెబుతోంది. తర్వాత ఈ ఉత్పత్తులను మరో సంస్థ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ అనే సంస్థకు అందజేస్తారు. దేశవ్యాప్తంగా వీటిని సరఫరా చేసే బాధ్యత ఈ సంస్థ చూసుకుంటుంది.

 
"ప్రస్తుతానికి విదేశాల నుంచి వస్తున్న వైద్య సహాయం అనేక రూపాల్లో అందుతుండటం వల్ల వాటిని సరఫరా చేయడానికి అధికారులు ముందుగా వాటి ప్యాకింగ్ తొలగించి తిరిగి ప్యాక్ చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో ఈ సరఫరా ప్రక్రియ మరింత నెమ్మదిగా జరుగుతోంది" అని ప్రభుత్వం అంగీకరించింది. "ప్రస్తుతానికి విదేశాల నుంచి వస్తున్న వైద్య సహాయం వివిధ సమయాల్లో, వివిధ పరిమాణాల్లో వస్తోంది. చాలా సార్లు జాబితాలో ఉన్నట్లుగా సరకులు అందటం లేదు. ఒక్కొక్కసారి వాటి సంఖ్యలో తేడా ఉంటే వాటిని తిరిగి ఎయిర్ పోర్టు దగ్గర సరి చూసుకోవాల్సి వస్తోంది" అని ప్రభుత్వం చెబుతోంది. వీటిని తిరిగి ప్యాక్ చేసిన తర్వాత రోగుల పరిస్థితి విషమంగా ఉన్న ప్రాంతాలకు, ఎక్కువగా అవసరమైన ప్రాంతాలకు ముందు పంపిస్తోంది.

 
24 గంటలూ పని
వైద్య పరికరాల సరఫరాలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ అవసరమైన ప్రాంతాలకు వైద్య ఉత్పత్తులు పంపడానికి అధికారులు 24 గంటలూ పని చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి ఈ సహాయం 31 రాష్ట్రాల్లో ఉన్న 38 సంస్థలకు పంపినట్లు చెప్పారు. పంజాబ్ రాష్ట్రానికి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 2500 డోసుల రెమ్‌డెసివిర్‌ ఔషధాలు పంపినట్లు ఆ రాష్ట్ర అధికారి బీబీసీకి చెప్పారు. బ్రిటన్ నుంచి చెన్నైకి రావల్సిన 450 ఆక్సిజన్ సిలిండర్లను మంగళవారం ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు చెన్నై కస్టమ్స్ అధికారి ట్వీట్ చేశారు.

 
హాంగ్ కాంగ్ నుంచి వచ్చిన 1088 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లలో 738 దిల్లీలోనే ఉన్నాయి. అందులో 350 ముంబయికి పంపినట్లు ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా దిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ పేరుతో రైళ్లను కూడా పంపిస్తున్నారు.

 
"ఆక్సిజన్ అత్యవసరం"
ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ దిల్లీ ఆసుపత్రుల్లో ఇంకా ఆక్సిజన్ లాంటి వైద్య సరఫరాల కొరత కొనసాగుతోంది. భారతదేశంలో గురువారం 4,12,262 కోవిడ్ కేసులు నమోదు కాగా 3,980 మరణాలు చోటు చేసుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా గత వారంలో నమోదైన కేసుల్లో సగం కేసులు, పావు వంతు మరణాలు ఒక్క భారతదేశం నుంచే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

 
అయితే, ప్రస్తుతం విదేశీ సహాయం కంటే కూడా ఆసుపత్రుల్లోనే ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల అవసరం ఉందని కొంత మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. "ప్రస్తుతానికి మనకు ఆక్సిజన్ ఒక్కటే ప్రధాన సమస్య" అని డాక్టర్ మహాజన్ చెప్పారు. ఈ విదేశీ సహాయం వచ్చినా రాకపోయినా కూడా జరిగే మార్పు పెద్దగా ఉండదు. ఆక్సిజన్ జనరేటర్ల వల్ల పరిస్థితిలో మార్పు ఉంటుంది. ఇప్పుడు ఇదే అత్యవసరం" అని ఆయన అన్నారు. "దిల్లీలో వందలాది కోవిడ్ రోగులకు బుధవారం సాయంత్రానికి నిమిషానికి 1000 లీటర్లు ఉత్పత్తి చేసే మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఆక్సిజన్ సరఫరా చేయడం ప్రారంభిస్తాయి" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

 
కానీ, వైద్య రంగ సిబ్బంది మాత్రం ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. "ఈ పరిస్థితి చాలా విసుగ్గా ఉంది. మేం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఈ సెకండ్ వేవ్ మమ్మల్ని దెబ్బకొట్టింది." అని డాక్టర్ మహాజన్ అన్నారు.
 
అదనపు రిపోర్టింగ్: సౌతిక్ బిస్వాస్, ఆండ్రూ క్లారెన్స్