శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 17 మే 2021 (19:13 IST)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యవసర వాహనాలు, అంబులెన్సులకు రిలయన్స్ 50 లీటర్ల ఇంధనం ఫ్రీ

హైదరాబాద్: COVID-19 కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు సాయాన్ని అందించనుంది. ఇందులో భాగంగా కోవిడ్ సహాయక చర్యలకు ప్రభుత్వం ఉపయోగించే అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్స్‌లకు రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉచిత ఇంధనాన్ని అందించనున్నాయి.
 
సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి లేఖల ఆధారంగా అన్ని అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్సులకు రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 50 లీటర్ల ఇంధనాన్ని రిలయన్స్ బంకులు ఉచితంగా అందిస్తాయి. ఈ సదుపాయం జూన్ 30 వరకు వర్తిస్తుంది.
 
మరోవైపు ఆక్సిజన్ కొరత సమస్యను సమర్ధంగా ఎదుర్కొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు రిలయన్స్ తన వంతు సాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు తెలంగాణకు 80 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు మరో 80 టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను రిలయన్స్ సమకూర్చింది. ఆక్సిజన్ ఎక్సప్రెస్ ఈ కంటైనర్లను రిలయన్స్ జామ్‌నగర్ ప్లాంట్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్, గుంటూరు రైల్వే స్టేషన్లకు ఆదివారం నాటికి చేరవేసింది.
 
కోవిడ్- 19పై దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా రిలయన్స్ కుటుంబం చేతులు కలిపింది. కోవిడ్ -19తో చేస్తున్న పోరాటంలో దేశం విజయం సాధించేలా చేసేందుకు క్షేత్రస్థాయిలో బహుముఖ విధానాలతో కార్యక్రమాలను రిలయన్స్ చేపట్టింది. కరోనా సమయంలో భారతీయుల కష్టాలను తొలగించేందుకు నిర్విరామంగా ప్రయత్నించింది. వారు వేగంగా కోలుకునేందుకు సహాయపడింది. వైరస్ కలిగించిన ముప్పును అధిగమించేందుకు తన వనరులు, మానవశక్తి, ఉపకరణాలు... అన్నిటినీ రిలయన్స్ ఉపయోగిస్తోంది. 
 
రిలయన్స్ 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్‌ను దేశవ్యాప్తంగా సమకూరుస్తోంది. ఇది భారతదేశ ఆక్సీజన్ ఉత్పత్తిలో 11 శాతం లేదా ప్రతీ 10 మంది రోగుల్లో ఒకరికి అవసరమైన దాంతో సమానం. దీనికి రిలయన్స్ అండగా నిలిచింది. మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ రవాణాను సులభతరం చేసేందుకు గాను రిలయన్స్ 32 ఐఎస్ఒ కంటెయినర్లను దిగుమతి చేసుకుంది.
 
భారతదేశంలో కోవిడ్ పైన జరుగుతున్న పోరాటంలో తాను చేపట్టిన ఎన్నో కార్యక్రమాలతో రిలయన్స్ ఫౌండేషన్ ముందువరుసలో నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశ మొట్టమొదటి కోవిడ్- 19 కేర్ హాస్పిటల్‌ను కేవలం రెండు వారాల్లోనే ఏర్పాటు చేసింది. మిషన్ అన్న సేవను ప్రారంభించింది. ఇప్పటివరకూ 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పేదలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి 5.5 కోట్లకు పైగా భోజనాలను సమకూర్చింది.