శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: మంగళవారం, 25 జూన్ 2019 (17:18 IST)

మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్‌ నుంచి ఇలా తొలగించండి...

ఫేస్‌బుక్, గూగుల్ లాంటి సంస్థలు మీ డేటాను స్టోర్ చేసుకుంటాయని మీకూ తెలుసు. కానీ అవి ఎంత సమాచారాన్ని సేకరిస్తాయో, దాన్ని ఎలా తొలగించాలో తెలుసా? గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్న ఫేస్‌బుక్-కేంబ్రిడ్జ్ అనలిటికా మోసం.. ఇంటర్నెట్ వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతపైన అనేక చర్చలకు దారితీసింది.
 
బ్రిటన్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా.. అనుమతి లేకుండా 5 కోట్లమందికి పైగా ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అంతర్జాతీయంగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బెర్లిన్‌కు చెందిన ‘టాక్టికల్ టెక్’ అనే డిజిటిల్ సెక్యూరిటీ సంస్థతో బీబీసీ మాట్లాడింది. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత డేటాను సమీక్షించుకోవడం, అనవసరమైన సమాచారాన్ని తొలగించడం ఎలాగో తెలుసుకుంది. ఆ వివరాలు మీ కోసం..
 
1. ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను ఎలా శుద్ధి చేయాలి?
మీ ఫొటోలు, మీరు పంపిన, మీకు వచ్చిన సందేశాలు.. ఇలా మీ ప్రొఫైల్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ఫేస్‌బుక్ కల్పిస్తుంది.
 
ఆ సమాచారం కావాలంటే.. ‘జనరల్ ఎకౌంట్ సెట్టింగ్స్’‌కు వెళ్లి ‘డౌన్‌లోడ్ ఎ కాపీ ఆఫ్ యువర్ ఫేస్‌బుక్ డేటా’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దాంతో ఆ సమాచారమంతా మీ ఈమెయిల్‌కు అందుతుంది. దాని ఆధారంగా మీకు కావాల్సిన సమాచారాన్ని తొలగించుకోవచ్చు.
 
జనరల్ సెట్టింగ్స్‌లోనే ‘యాప్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ‘షో మోర్’ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఫేస్‌బుక్ ఖాతా తెరిచినప్పటి నుంచి ఉపయోగించిన యాప్స్ అన్నీ కనిపిస్తాయి. వాటన్నింట్లో మీకు సంబంధించిన బోలెడంత సమాచారం ఉంటుంది. అనవసరమైనయాప్స్‌ను ‘రిమూవ్’ చేయడం ద్వారా ఆ సమాచారాన్ని కూడా తొలగించొచ్చు. అవసరమైన యాప్స్‌లో కూడా సెట్టింగ్స్‌ను మార్చుకోవడం ద్వారా యాప్‌ని నియంత్రించొచ్చు.
 
మీ ప్రొఫైల్ పేజీలోకి వెళ్లి ‘వ్యూ యాక్టివిటీ లాగ్‌’ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మిమ్మల్ని ట్యాగ్ చేసిన వాళ్లందరి సమాచారం కనిపిస్తుంది. వాటిని డిలీట్ చేయడం ద్వారా మీ ఖాతా ఎక్కువమంది దృష్టిలో పడకుండా జాగ్రత్త పడొచ్చు.
 
2. గూగుల్‌కి మీ గురించి ఎంత తెలుసు?
ఆన్‌లైన్‌లో అందరికంటే గూగుల్‌కే మీ గురించి ఎక్కువగా తెలుసు. చాలామంది రోజుకి కనీసం ఒక్క గూగుల్ యాప్‌నైనా ఉపయోగించే అవకాశాలు ఎక్కువ.
 
అలా గూగుల్ దగ్గర మీకు తెలీకుండానే చాలా సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. గూగుల్ సేకరించిన మీ సమాచారాన్ని తొలగించాలంటే ముందు మీ గూగుల్ ఎకౌంట్‌లోకి ‘సైన్ ఇన్’ అవ్వాలి.
 
సైన్ ఇన్ అయ్యాక మీ లోగోపై క్లిక్ చేస్తే ‘ప్రైవసీ చెకప్’ పేజీ కనిపిస్తుంది. అందులోకి వెళ్లడం ద్వారా మీ సమాచారాన్ని నియంత్రించొచ్చు. అక్కడ ‘స్టెప్-3’లో ‘పర్సనలైజ్ యువర్ గూగుల్ ఎక్స్‌పీరియన్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే గూగుల్ దగ్గరున్న మీ ఫోన్ నంబర్లు, ఫొటోలు ఇతర సమాచారమంతా కనిపిస్తుంది.
 
అక్కడ ఆ సమాచారాన్ని నియంత్రించే, తొలగించే ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. మొత్తంగా గూగుల్ దగ్గర మీకు సంబంధించి ఎంత సమాచారం ఉందో తెలియాలంటే ఈ లింక్‌ని క్లిక్ చేయండి.
 
3. లొకేషన్ డేటాతో జాగ్రత్త!
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్లయితే మీరెవరో, ఎక్కడుంటారో, ఎక్కడెక్కడికి వెళ్తున్నారో.. అన్ని విషయాలూ థర్డ్ పార్టీ యాప్స్‌కు తెలిసే అవకాశాలెక్కువ. అందుకే లోకేషన్ హిస్టరీని తెలుసుకోవడం ద్వారా మీ సమాచారాన్ని నియంత్రించొచ్చు.
 
ఆండ్రాయిడ్ యూజర్లు: గూగుల్ మ్యాప్స్> మెనూ> టైం లైన్. అక్కడ ఒక్కో ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.
ఐఫోన్ యూజర్లు:సెట్టింగ్స్> ప్రైవసీ> లొకేషన్ సర్వీసులు> మేనేజ్ లోకేషన్ యాక్సెస్. అక్కడ ప్రతి యాప్‌కు సంబంధించిన లోకేషన్ సేవల్ని నియంత్రించొచ్చు.
 
4. ప్రైవేట్ బ్రౌజర్లు వాడండి
చాలామందికి ఏ వెబ్‌సైట్ తెరిచినా అందులో గతంలో వాళ్లు చూసిన షాపింగ్ వెబ్‌సైట్ల తాలూకు ప్రకటనలు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. థర్డ్ పార్టీ సంస్థల ట్రాకర్ల వల్లే ఇలా మీరు వెళ్లిన వెబ్‌సైట్ల సమాచారం ఇతరులకు తెలుస్తుంది.
 
నిజానికి ఏ వెబ్ బ్రౌజర్‌ కూడా నేరుగా ఇలా థర్డ్ పార్టీ ట్రాకింగ్‌ను నియంత్రించదు. కానీ గూగుల్, మోజిలా, సఫారీ లాంటి బ్రౌజర్లు.. ప్రైవేట్ లేదా ‘ఇన్‌కాగ్నిటో’ బ్రౌజింగ్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఆ మోడ్‌లో ఇంటర్నెట్‌ను వినియోగిస్తే బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్, టెంపరరీ ఫైల్స్ లాంటివన్నీ బ్రౌజర్‌ని మూసేయగానే డిలీట్ అయిపోతాయి. దాంతో థర్డ్ పార్టీలకు మీ సమాచారాన్ని సేకరించే అవకాశం ఉండదు.
 
బ్రౌజర్(గూగుల్, మోజిలా, సఫారీ) తెరిచి అందులో మెనూకి వెళ్లి న్యూ ప్రైవేట్/ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌ను తెరిస్తే థర్డ్ పార్టీల వలలో పడకుండా బ్రౌజ్ చేసుకోవచ్చు.
 
5. నిజంగా అన్ని యాప్స్ అవసరమా?
చాలామంది ఫోన్లలో అవసరమైన వాటికంటే ఎక్కువ యాప్స్ ఉంటాయి. వాటిని తొలగించడం ద్వారా ఫోన్ మెమరీని పెంచుకోవడంతో పాటు మన సమాచార వ్యాప్తినీ నియంత్రించొచ్చు.
 
ఏ యాప్‌ను డిలీట్ చేయాలో తెలియకపోతే ఈ ప్రశ్నలు వేసుకోండి.
నాకిది నిజంగా అవసరమా?
నేను చివరిగా ఈ యాప్‌ను ఎప్పుడు ఉపయోగించాను?
ఈ యాప్ ఎలాంటి డేటాను సేకరిస్తుంది?
ఈ యాప్‌ను ఎవరు తయారు చేశారు?
తయారీదార్లు పేరున్నవారేనా?
వాళ్ల ప్రైవసీ పాలసీ గురించి మీకు తెలుసా?
ఈ యాప్ వల్ల మీకు కలిగే లాభాలు, నష్టాలు ఏంటి?
ఈ పాటికి ఎలాంటి యాప్స్‌ను డిలీట్ చేయొచ్చో మీకు తెలిసిపోయి ఉంటుంది.