గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 7 మార్చి 2022 (16:21 IST)

రష్యా, అమెరికాలతో సంబంధాలు భారత్‌కు కత్తి మీద సాముగా మారాయా?

యుక్రెయిన్ మీద రష్యా దాడి తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల ఏదైనా ఒక దేశం అత్యంత సవాలు ఎదుర్కుంటోందంటే అది భారతదేశమే. ఇది విదేశీ, వ్యూహాత్మక అంశాల నిపుణులు చెబుతున్న మాట. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఒక విధంగా కత్తి మీద సాము చేస్తోందని, అంటే రష్యా, అమెరికాలతో ఉన్న సంబంధాలను సామరస్యంగా కొనసాగించే సవాలును భారత్ ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు.

 
ఇప్పటివరకూ భారత్ అలా రెండు దేశాలతో సామరస్యంగా ఉండండలో విజయవంతం అవుతూ వచ్చిందని, అయితే ఈ రెండు దేశాలతో సంబంధాలు కొనసాగించడానికి భారత్ ముందున్న సవాలు కూడా చాలా తీవ్రమైనదని మాజీ దౌత్య, విదేశీ వ్యవహారాల నిపుణులు నవతేజ్ సర్నా అన్నారు. యుక్రెయిన్ మీద రష్యా దాడి చేయడంపై భారత్ తమ వైఖరిని స్పష్టం చేయాలని అమెరికా పదేపదే ఒత్తిడి తెస్తోంది.

 
"రష్యా దాడిని ఖండించడంలో ఎలాంటి సాకులూ, వాయిదాలూ కుదరదు" అని గురువారం క్వాడ్ సమావేశం తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గట్టిగా చెప్పారు. బైడెన్ భారత్‌ను ఉద్దేశించే ఈ మాట అన్నారనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే క్వాడ్‌లో ఉన్న మిగతా దేశాల్లో జపాన్, ఆస్ట్రేలియా బహిరంగంగా రష్యాను విమర్శిస్తున్నాయి. ఈ విషయంలో అవి అమెరికా వెంట నిలిచినట్లు కనిపిస్తోంది.

 
బుధవారం రోజే అమెరికా సెనేట్ సమావేశం కూడా జరిగింది. అందులో భారత్ వైఖరి గురించి చర్చ జరిగింది. ఆ సమయంలో అమెరికా అధికారులు ఈ అంశంపై భారత్‌తో మాట్లాడారని, యుక్రెయిన్‌పై దాడిని విమర్శిస్తూ భారత్ చేసే ప్రకటన చాలా ముఖ్యమైనదని వారికి చెప్పడానికి ప్రయత్నించారని అమెరికా దక్షిణాసియా అంశాల మంత్రి డోనల్డ్ లూ అన్నారు.

 
భారత్ ఎప్పుడూ యుద్ధానికి అనుకూలం కాదు
భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓటింగ్‌లో పాల్గొనలేదన్నది వేరే విషయం, అయినా భారత్ యుద్ధానికి ఎప్పుడూ అనుకూలంగా లేదు అన్నారు నవజేత్ సర్నా. "ఓటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ భారత్ యుక్రెయిన్‌కు మానవతా సాయం చేర్చడానికి చొరవ కూడా చూపింది. రష్యా సంయమనం వహించాలని, యుద్ధం ముగించాలని ఐక్యరాజ్యసమితి అపీల్ చేసిన ఆ చార్టర్ నుంచి కూడా అది తనను దూరం చేసుకోలేదు. యుద్ధం ద్వారా కాకుండా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని భారత్ కోరుతోంది" అన్నారు.

 
అమెరికాతో గత కొన్నేళ్లుగా భారత్ ఆర్థిక, వ్యూహాత్మక సహకారం చాలా పెరగింది కాబట్టి, ఇది భారత్‌కు పరీక్షా కాలం అని నిపుణులు భావిస్తున్నారు. భారత్ అటు రక్షణ ఉత్పత్తుల సరఫరా కోసం రష్యాపై ఆధారపడుతూ వస్తోంది. 2018లో సుదూర లక్ష్యాలను ఛేదించే సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణుల సరఫరా కోసం భారత్ రష్యాతో 500 కోట్ల డాలర్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. భారత్, ఈ డీల్ కోసం మొదటి విడత చెల్లింపులు కూడా జరిపింది. భారత్‌కు అందించబోయే క్షిపణుల సరఫరాపై యుక్రెయిన్‌లో జరిగే సైనిక ఆపరేషన్ ప్రభావం ఏమాత్రం ఉండదని రష్యా కూడా స్పష్టం చేసింది. అనుకున్న సమయానికి అవి భారత్‌కు అందుతాయని కూడా చెప్పింది.

 
భారత్, రష్యా మధ్య పురాతన సంబంధాలు
70వ దశకం నుంచే భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని, ఆయుధాల సరఫరా కోసం భారత్ రష్యాపై ఆధారపడుతూ వస్తోందని నవతేజ్ సర్నా చెప్పారు. దీనితోపాటూ అంతరిక్ష కార్యక్రమాలు, ఇంధన రంగంలో కూడా భారత్, రష్యా నుంచి సహకారం పొందుతోంది. అయితే, అమెరికా కాంగ్రెస్ సమావేశంలో భారత్ తీరుపై విమర్శలు వచ్చినప్పటికీ, భారత్ రక్షణ పరికరాలు, ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడడం 53 శాతం తగ్గిందని కూడా చెప్పారు.

 
క్వాడ్ అనేది కేవలం ఒక సహకార వేదిక అని, అది కూటమి కాదనే విషయం అమెరికాకు కూడా తెలుసని లండన్ కింగ్స్ కాలేజీ ఇంటర్నేషనల్ స్టడీస్ విభాగం చీఫ్ ప్రొఫెసర్ హర్ష్ వీ పంత్ బీబీసీతో అన్నారు. అందుకే భారత్ తీసుకున్న స్టాండ్ మీద క్వాడ్ ఒత్తిడి ఏమాత్రం ఉండదని, భారత్, అమెరికా మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, అలాంటి బంధాలే భారత్ రష్యాతో కూడా కొనసాగిస్తోందని ఆయన చెప్పారు. "అమెరికా భారత్ మీద ఎప్పుడూ, ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు. అయితే 1998లో అణు ఒప్పందంపై సంతకాలు పెట్టనపుడు భారత్‌కు ఒకసారి అలాంటి పరిస్థితి ఎదురైంది. కానీ, ఆ ఆంక్షలు కూడా ఏడాదిలోపే ఎత్తివేశారు" అంటారు పంత్.

రష్యా, అమెరికా రెండూ భారత్‌కు ముఖ్యం
"అమెరికా, రష్యా రెండూ తమకు ముఖ్యం అనే విషయం భారత్‌కు తెలుసు. అయితే భారత్ అంతర్గత రాజకీయాలు అమెరికా వ్యతిరేకంగానే ఉంటూ వచ్చాయి. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్‌కు కూడా అమెరికాతో అణు ఒప్పందం గురించి అంతర్గతంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది" అని పంత్ చెప్పారు. ఆసియాలో చైనా ఆధిపత్యానికి సంబంధించిన ప్రశ్న కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే అమెరికాకు భారత్ చాలా ముఖ్యం. భారత్‌తో సంబంధాలు తెంచుకునే స్థితిలో అది లేదు అంటారు హర్ష్ పంత్.

 
"అమెరికా చైనాను ఎదుర్కోవాలంటే, అది భారత్‌తో కూడా మెరుగైన వ్యూహాత్మక సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుంది. భారత్‌కు కూడా అమెరికా అంతే ముఖ్యం" అని ఆయన తెలిపారు. ఇరాన్‌తో అమెరికా సంబంధాలు చెడడం మొదలైనప్పుడు కూడా అది భారత్‌తో ఇరాన్‌తో సంబంధాలు తెంచుకోవాలని చెబుతూ వచ్చింది. కానీ, భారత్ అలా చేయలేదు. ఎందుకంటే దేశాలకు తమదైన దౌత్యం, అవసరాలు ఉంటాయి. అందుకే, అమెరికా కూడా భారత్ మీద అంత ఒత్తిడి తీసుకురాలేదు" అన్నారు పంత్.

 
భారత్ రష్యాను బహిరంగంగా నిందించలేదు. కానీ, అది యుద్ధం ముగించి, శాంతి పునరుద్ధరించాలని అది నిరంతరం అపీల్ చేస్తూనే ఉందని సీనియర్ జర్నలిస్ట్ అభిజిత్ అయ్యర్ మిత్రా చెప్పారు. భారత్ కూడా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనుసరించిన వైఖరినే అవలంభించింది. ఎందుకంటే ప్రతి దేశానికీ తమ సొంత ప్రాధాన్యాలు, వ్యూహాత్మక అవసరాలు కూడా ఉంటాయన్నారు.

 
ఇరాక్ మీద దాడి జరిగినప్పుడు కూడా, ఇరాక్‌లో భారత్ చేపట్టిన ప్రాజెక్టులు నడుస్తున్నప్పటికీ, భారత్ తటస్థంగా ఉండిపోయింది. అదే విధంగా లిబియా, సిరియాపై దాడులు జరిగినప్పుడు కూడా భారత్ తటస్థంగానే ఉంది. దౌత్యంలో మౌనంగా ఉండడం అనేది చాలా విషయాలు చెబుతుంది. తటస్థంగా ఉండడానికి కూడా ఒక తనదైన సంకేతం ఉంటుంది అంటారు అభిజిత్.