మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (13:50 IST)

యుక్రెయిన్‌ సంక్షోభం: అడుగడుగునా జాతి వివక్షతో ఇబ్బందులు పడుతున్నామంటున్న భారతీయ విద్యార్ధులు

యుక్రెయిన్‌లో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నట్లు తూర్పు యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు అర్ధమవుతోంది. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేయలేక పోతున్నారు. స్థానికంగా ఉండే షాపులకు వెళితే వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది.

 
తూర్పు నగరమైన సుమీలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, పగటిపూట తాము ఉండే బంకర్ల పైన తుపాకులు పట్టుకుని తిరుగుతున్న వ్యక్తులను చూశామని, రాత్రంతా భారీ ఎత్తున బాంబు దాడులు జరగడం గమనించామని చెప్పారు. తమ బంకర్ల మీదుగా ట్యాంకుల వెళ్తున్న చప్పుడు వినిపించేదని కూడా విద్యార్థులు వెల్లడించారు. ''మా దగ్గర డబ్బు అయిపోయింది. ఏటీఎంలలో కూడా నగదు లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. కానీ డబ్బులు లేకుండా ఎక్కడకు వెళ్లగలం'' అని సుమీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న మహ్మద్ మహతాబ్ రజా బీబీసీతో అన్నారు.

 
మహతాబ్‌ ఒక ఏటీఎం వద్దకు వెళ్లగా, బయట ఉన్న ఓ మహిళ ఒక నోటీసు చూపించి, ఇప్పుడు ఇక్కడ డబ్బును డిపాజిట్ మాత్రమే చేయవచ్చని, విత్‌డ్రా కుదరదని వివరించారు. ''పరిస్థితులు ఇలా ఉంటే ఇక యుక్రెయిన్ పశ్చిమ ప్రాంతానికి ఎలా వెళతాం'' అని మహతాబ్ సందేహం వ్యక్తం చేశారు. తన తోటి విద్యార్ధులతో బంకర్ లోపల మహతాబ్, వీడియో కాల్ ద్వారా బీబీసీతో మాట్లాడారు. ఇక్కడ తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు.

 
అడుగడుగునా జాతి వివక్ష
భారతీయ విద్యార్ధులు జాతి వివక్ష ఎదుర్కొంటున్నారని పంజాబ్‌కు చెందిన విద్యార్ధిని జస్లీన్ కౌర్ అన్నారు. ''రైలు ఎక్కేదగ్గర మా పట్ల వివక్ష చూపించడం గమనించాం. ఆహారం ఇవ్వడంలో కూడా స్థానికులకే ప్రాధాన్యమిస్తున్నారు. స్థానికులు ఎక్కువ ఆహారం తీసుకెళ్లగలుగుతున్నారు. మాకు కొన్నాళ్లు పోతే తినడానికి ఏమీ దొరకదు. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బైటపడాలి'' అని జస్లీన్ అన్నారు.

 
"కీయెవ్ చేరుకోవడానికి ఐదు నుండి ఆరు గంటల సమయం పడుతుంది. సమీపంలో రష్యా సరిహద్దు ఉంది. రష్యా యుక్రెయిన్‌ పై దాడి మొదలు పెట్టినప్పుడు మేము నిద్రపోతున్నాము. స్వదేశంలో మా ఇంటి నుంచి కాల్ వచ్చినప్పుడే మాకు విషయం తెలిసింది'' అని మరో విద్యార్ధిని జియా బలూని బీబీసీతో అన్నారు. ఇక్కడ దాడులు జరుగుతున్నాయని తెలిసి తమ కుటుంబ సభ్యులు చాలా కంగారు పడ్డారని, త్వరగా అవసరమైన సరుకులు కొనుక్కోవాలని సూచించారని బలూనీ చెప్పారు. అయితే, షాపుల దగ్గర అప్పటికే భారీ ఎత్తన క్యూలు ఉన్నాయని ఆమె వెల్లడించారు.

 
''సైరన్ మోగినప్పుడు బంకర్‌కు వెళ్లేవాళ్లం. సమస్య లేదనుకున్నప్పుడు తిరిగి మా గదులకు వెళతాం. రెండు రోజుల నుంచి దాడుల పెరుగుతున్నాయి. మాలో చాలామంది సైనికులు చేస్తున్న పోరాటాన్ని చూశారు. చాలాచోట్ల మంటలు కనిపించాయి. రెండు రోజులుగా బాంబుల శబ్ధాలు కూడా వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు సమయంలో మేం మా రూమ్‌లకు వస్తున్నాం'' అని బలూనీ అన్నారు. జియా బలూని ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు చెందినవారు. 2018లో సుమీ స్టేట్ యూనివర్శిటీలో జియా వైద్య విద్య కోసం చేరారు. ప్రస్తుతం ఆమె నాలుగో సంవత్సరం విద్యార్థిని.

 
సైరన్లకు వణికి పోతున్నాం
జియా ఉంటున్న బంకర్‌లో ఆమెతోపాటు మరో 500 మంది భారతీయ విద్యార్థులు నివసిస్తున్నారు. సైరన్ల మోత వినిపించినప్పుడల్లా ఇక్కడ భయాందోళనలు నెలకొంటాయని ఆమె అంటున్నారు. "మా తల్లిదండ్రులు భయపడుతున్నారు. వాళ్లు రాత్రి నిద్రపోవడం లేదు. పదే పదే ఫోన్ చేస్తున్నారు. పశ్చిమ సరిహద్దు వరకు వెళ్లడానికి ఇక్కడ రైల్వే స్టేషన్ పని చేయడం లేదు. సరిహద్దుకు చేరుకోవాలంటే రైలులో వెళ్లడమే మంచిది. ఇక్కడి నుంచి కనీసం ఇరవై గంటలు పడుతుంది. మధ్యలో ఎక్కడైనా దాడులు జరిగితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అక్కడికి వెళ్లే రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి "అని ఆమె వివరించారు.

 
''సీసీ కెమెరాలలో రష్యన్ ట్యాంకులను చూశాము. మేం ఉండే నగరంలోకి పది ట్యాంకులు వస్తున్నాయి'' అని జియా చెప్పారు. ''ప్రతి 45 నిమిషాలకు సైరన్ మోగడం ప్రారంభిస్తుంది. మేము బంకర్ లోపలికి పరుగెత్తాలి. రాత్రంతా బంకర్‌లోనే ఉండి, రోజంతా సైరన్‌ల శబ్ధానికి భయపడుతూ గడుపుతున్నాం'' ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అహ్మద్ షేక్ రజా అన్నారు.

 
నిత్యావసర వస్తువులు కొనేందుకు బయటకు వెళ్లేటప్పుడు కూడా భవనాలపై సైనికులు తుపాకులు పట్టుకుని కనిపిస్తున్నారని, వారిని చూస్తే భయమేస్తోందని అహ్మద్ చెప్పారు. మరో భారతీయ విద్యార్ధిని సోనమ్ సింగ్ ఆందోళన మరోలా ఉంది. ఆమె మెడిసిన్ కోర్సు మూడు నెలల్లో ముగియనుంది. ఆ కోర్సును పూర్తి చేసి పట్టా సాధించగలనా అన్నది ఆమె ఆందోళన. భారతీయ విద్యార్ధులు బంకర్‌లో ఉన్న ప్రాంతానికి రష్యా సుమారు 40-45 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అందువల్ల విద్యార్థులకు సేఫ్ పాసేజ్‌కు అవకాశం కల్పించాలని భారతీయ విద్యార్ధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.