సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (14:31 IST)

భారతీయ టీపై అంతర్జాతీయ కుట్ర: అసోంలో ప్రధాని మోదీ ఆగ్రహం - ప్రెస్ రివ్యూ

భారతీయ ‘టీ’ని అపఖ్యాతిపాలు చేసేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతున్నదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారని, కుట్రదారులపై పోరులో తేయాకు కార్మికులు తప్పక విజయం సాధిస్తారని చెప్పారని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

 
ఆ కథనం ప్రకారం.. త్వరలో ఎన్నికలు జరుగనున్న అసోంలో మోదీ ఆదివారం పర్యటించారు. పక్షం రోజుల వ్యవధిలో ఆయన అసోం రావడం ఇది రెండోసారి. రాష్ట్ర హైవేల అభివృద్ధి పథకం ‘అసోం మాల’ను ప్రారంభించడంతో పాటు రెండు వైద్య కళాశాలలకు మోదీ శంకుస్థాపన చేశారు.

 
తేయాకు తోటల సాగులో అసోంది ప్రముఖ స్థానం. ఈ నేపథ్యంలో భారతీయ టీపై కుట్ర విషయాన్ని మోదీ ప్రస్తావించారు. దేశం వెలుపల ఈ కుట్ర జరుగుతున్నదంటూ పరోక్షంగా ఎన్జీవో ‘గ్రీన్‌పీస్‌' నివేదికను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 
భారత్‌లోని తేయాకు తోటల్లో ఎరువులను అధికంగా వినియోగిస్తున్నారని ఆ సంస్థ తన నివేదికలో ఆరోపించింది. ఇటువంటి దాడిని భారత తేయాకు తోటల కార్మికులు సహించరని మోదీ మండిపడ్డారు.

 
ప్రతి రాష్ట్రంలో మాతృభాషలో బోధించే కనీసం ఒక వైద్య కళాశాల, రెండు సాంకేతిక కళాశాలలు ఉండాలని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు.