చిత్తూరు జిల్లా మదనపల్లెలో కన్నబిడ్డలను హతమార్చిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఈనాడు ఓ కథనంలో తెలిపింది. తనను తాను కాళికగా భావించుకున్న నా భార్య పద్మజ.. పెద్ద కుమార్తె అలేఖ్య (27)ను చంపిన తర్వాత ఆమె నాలుకను కోసి తినేసింది అని పురుషోత్తంనాయుడు వైద్యులకు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక.. దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని పురుషోత్తం వైద్యులకు తెలిపారు. కళాశాలలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదు.. పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాటస్ఫూర్తిని కొనసాగించాలి అని అలేఖ్య తనకు చెప్పినట్టు ఆయన తెలిపారు.
కలియుగం అంతమై.. సత్యయుగం వస్తుందని అలేఖ్య అనేది. కరోనా కూడా ఇందుకు ఒక సూచిక అని చెప్పేది. ఈ మాటలన్నీ నిజమే. నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఈ విషయాలే ఉన్నాయి అని వైద్యులకు ఆయన చెప్పారు.
పురుషోత్తం, పద్మజ ఇద్దరికీ మానసిక వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జైలు లాంటి వాతావరణంలో చికిత్స అందించాలి. అందుకే విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి సిఫార్సు చేశాం అని తిరుపతిలోని రుయా మానసిక వైద్యనిపుణులు పేర్కొన్నారు.
పద్మజ మంత్రాలు పఠిస్తూ.. నా బిడ్డలు తిరిగి వస్తున్నారు. ఇంటికి వెళ్లాలి. జైలులో తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య ఇక్కడ కనిపించడం లేదు.. అంటూనే వైద్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పక్కగదిలో ఉన్న పురుషోత్తంనాయుడు ఏడుస్తూ వైద్యులతో మాట్లాడారు.