మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (15:30 IST)

మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా..

మనుషుల ప్రవర్తనపై చంద్రుడి ప్రభావం ఉంటుందనే భావన వేల ఏళ్లుగా ఉన్నప్పటికీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం దానిని కొట్టిపడేసింది. కానీ, ఈ ప్రాచీన భావనలో కొంత వాస్తవం ఉండొచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. డేవిడ్ యావరికి చెందిన సైకియాట్రిక్ క్లినిక్‌లో కూర్చుని ఉన్న ఆ 35 ఏళ్ళ వ్యక్తి ఒక ఇంజనీరు. "సమస్యలను పరిష్కరించడం ఆయనకు ఇష్టం" అని యావరి గుర్తు చేసుకున్నారు. 
 
యావరికి ఆ ఇంజినీరు 2005లో పరిచయం అయ్యారు. అప్పుడాయన అమెరికాలోని సియాటిల్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. రోగిగా ఉన్న ఆ ఇంజనీరేమో చిన్నపాటి ప్రవర్తన సమస్యలతో బాధపడుతూ ఆ ఆస్పత్రి సైకియాట్రీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. ఒక తీవ్రమైన భావం నుంచి మరో తీవ్రమైన భావానికి మారిపోతూ ఉండడం ఆయన సమస్య. కొన్నిసార్లు అక్కడ లేని వాటిని చూసినట్లు, వినిపించని వాటిని వింటున్నట్టు అనిపించడమే కాదు, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా ఆయన భ్రమ పడుతుండేవారు.
 
ఆయనకు నిద్ర సరిగా పట్టేది కాదు. కొన్ని రాత్రులు ఏకధాటిగా 12 గంటలు నిద్రపోతే, కొన్ని రాత్రులు క్షణం కూడా నిద్రపట్టేది కాదు. సమస్యలను పరిష్కరించడంలో స్వతహాగా ఆసక్తి ఉన్నవాడు కాబట్టి, తన మూడ్‌లో మార్పుల గురించి, ఆలోచనల గురించి, నిద్ర గురించి ఎప్పటికప్పుడు ఒక పుస్తకంలో రాసి పెట్టుకునేవారు. అన్నిటినే కలిపి చదివితే ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అనుకునేవారు. ఈ మూడ్‌ రికార్డును క్షుణ్ణంగా అధ్యయనం చేసినపుడు అందులో 'ఒక క్రమం' ఉన్నట్టు యావరి గుర్తించారు. ఆ ఇంజనీరు మూడ్స్, నిద్ర చంద్రుడి కృష్ణ, శుక్ల పక్షాలకు అనుగుణంగా సాగుతున్నట్టు అనిపించింది.
 
అయితే, ఆయన ఆలోచన ఆయనకే అసంబద్ధంగా ఉన్నట్టనిపించింది. ఒకవేళ అతని మానసిక స్థితీ, చంద్రుడి కళలూ సమాంతరంగా సాగడం నిజమే అయినా దాన్ని వివరించగల సిద్ధాంతం తన దగ్గర లేదని ఆయనకు తెలుసు. ఆ విషయమై మరేమైనా చేయగల ఆలోచనలు కూడా ఆయన దగ్గర లేవు. అందువల్ల ఆయన ఇంజనీరు మూడ్‌ను, నిద్రను క్రమబద్దీకరించడానికి అందరిలాగే మందులు రాసిచ్చి, డిశ్చార్జ్ చేసి పంపించేశారు. ఆ ఫైలును లోపలెక్కడో పడేశారు.
 
పన్నెండేళ్ళ తర్వాత థామస్ వెహర్ అనే ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త రాపిడ్ సైక్లింగ్ బైపోలార్ డిసార్డర్‌తో బాధపడుతున్న 17 మంది రోగుల మీద ఒక పరిశోధనా పత్రం వెలువరించారు. మామూలు కంటే చాలా త్వరితంగా కుంగుబాటు నుంచి ఉన్మాద చర్యలకు మారిపోయే జబ్బు అది. ఆ 17 మందిలో - యావరి చికిత్స చేసిన రోగిలో ఏ లక్షణాలైతే కనిపించాయో అచ్చంగా అవే కనిపించాయి.
 
"ఒక జీవ ప్రక్రియలో ఉంటుందని సాధారణంగా మనం ఊహించని కచ్చితత్వం ఒకటి వారి మానసిక స్థితి మార్పులలో నాకు కనిపించింది. వారి మనోభావాల మీద ఏదో ఒక రకమైన బాహ్య ప్రభావం ఉందేమోనని నాకు సందేహం కలిగింది. సహజంగానే చంద్రుడి ప్రభావం ఏమైనా ఉందేమోనని (చంద్రుడి వృద్దిక్షయాల ప్రభావం మనుషుల ప్రవర్తన మీద ఉంటుందన్న చారిత్రక విశ్వాసం కారణంగా) పరిశీలించాను" అని అమెరికాలోని బెతెస్డా జాతీయ మానసిక ఆరోగ్య సంస్థలో సైకియాట్రీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న థామస్ వెహర్ చెప్పారు.
 
మనిషి ప్రవర్తనపై చంద్రుడి ప్రభావం ఉందని శతాబ్దాలుగా ప్రజలు నమ్మారు. ఇంగ్లీష్‌లో 'లూనసీ' అనే పదం అలాగే పుట్టింది. గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్, రోమన్ ప్రకృతి శాస్త్రవేత్త ప్లినీ ద ఎల్డర్ ఇద్దరూ ఉన్మాదం, మూర్ఛ రోగం రెండూ చంద్రుడి కారణంగానే కలుగుతాయని నమ్మారు. ఒకప్పుడు గర్భిణీలు ఎక్కువగా పౌర్ణమి రోజున ప్రసవిస్తారనే వాదనలు కూడా ఉండేవి. కానీ, తర్వాత దానికి శాస్త్రీయ ఆధారాలేమీ లేవని చంద్ర గమనాన్ని జననాలతో పోల్చి తెలుసుకున్నారు. అలాగే మానసిక రోగులు, జైలు ఖైదీల విపరీత ప్రవర్తనకు, చంద్రుని వృద్దిక్షయాలకు సంబంధం ఉందని కూడా కొంతకాలం నమ్మారు. దానికీ ఆధారాలు ఏమీ లేవు. ఇటీవలి ఒక అధ్యయనం మాత్రం ఆరుబయట - అంటే వీధుల్లో, బీచ్‌ల వంటి బహిరంగ ప్రదేశాలలో జరిగే నేరాలు వెన్నెల కాసే రోజుల్లో ఎక్కువగా జరుగుతుండవచ్చని సూచించింది.
 
అయితే, చంద్ర చక్రానికి (వృద్ధిక్షయాలకు), నిద్రకు సంబంధం ఉందనడానికి కొంత ఆధారం ఉంది. పౌర్ణమి రోజుల్లో సగటున ఐదు నిమిషాలు ఆలస్యంగా నిద్రపట్టడంతో పాటు, మొత్తంగా చూస్తే 20 నిమిషాలు తక్కువ నిద్ర పోయారని 2013లో జరిగిన ఒక అధ్యయనం పేర్కొంది. చంద్రుడు కనిపించని ప్రదేశాలలోని ప్రజల్లోనూ ఈ మార్పు కనిపించిందని ఆ అధ్యయనం తెలిపింది. మెదడు కదలికలను కూడా లెక్కేసి వారిలో గాడ నిద్ర 30 శాతం తగ్గిందని తేల్చారు. అయితే, దీనికి కొనసాగింపుగా చేసిన అధ్యయనం మళ్ళీ అవే ఫలితాలను ఇవ్వలేదు. 
 
ఆరుబయట జరిగే నేరాలు వెన్నెల రోజుల్లో ఎక్కువ జరిగే అవకాశం ఉందని ఇటీవలి ఒక అధ్యయనం సూచించింది. ఈ రెండు అధ్యయనాలలోనూ ఒక లోపం ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో నిద్రపై పరిశోధనలు చేస్తున్న వ్లాదిస్లావ్ వ్యాజోవ్ స్కీ అన్నారు. ఈ అధ్యయనాలలో పాల్గొన్న వ్యక్తుల నిద్రను మొత్తం చాంద్రమాసం లేదా వరసగా కొన్ని చాంద్రమాసాల పాటు పరిశీలించలేదని ఆయన చెప్పారు. "సదరు వ్యక్తుల నిద్ర వివరాలను ఒక చాంద్రమాసమంతా రోజూ నమోదు చేసుంటే బాగుండేది" అని ఆయన అభిప్రాయపడ్డారు. థామస్ వెహర్ అలాగే చేశారు. బైపోలార్ రోగులపై చేసిన అధ్యయనంలో ఆయన కొందరు రోగుల మూడ్‌ను ఏళ్ళ తరబడి నమోదు చేస్తూ వెళ్ళారు.
 
"చంద్రుని వృద్ధిక్షయాల పట్ల వివిధ వ్యక్తుల స్పందన ఏ విధంగా ఉంటుందో చెప్పలేం. నేను సేకరించిన సమాచారం మొత్తం తీసుకుని సగటును లెక్క కట్టినా దాని నుంచి మనం తెలుసుకోగలిగింది ఏమీ లేకపోవచ్చు. దాని కంటే ప్రతి వ్యక్తినీ కొంత కాలం పాటు అధ్యయనం చేస్తూ పోతే, మార్పులు అర్థమయ్యే అవకాశం ఉంటుంది" అని వెహర్ అంటారు. ఆయన తన అధ్యయనంలో పాల్గొన్న రోగులు ప్రధానంగా రెండు కోవల కిందికి వస్తారని కనుగొన్నాడు. కొందరి మూడ్ 14.8 రోజుల చక్రం ప్రకారం నడిస్తే, కొందరివి 13.7 రోజుల చక్రం క్రమంలో నడిచాయని తెలుసుకున్నారు.
 
మనుషుల సంగతెలా ఉన్నా చంద్రుడు భూమిని మాత్రం రకరకాలుగా ప్రభావితం చేస్తాడనేది అందరూ ఒప్పుకునేదే. అన్నిటి కంటే మొదటిదీ, ముఖ్యమైనదీ చంద్ర కాంతి. ప్రతి 29.5 రోజులకు పౌర్ణమి, దాని తర్వాత 14.8 రోజులకు అమావాస్య రావడం మనకు తెలిసిందే. రెండోది చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి. చంద్రుని గురుత్వాకర్షణ వల్లే సముద్రాలకు ఆటుపోట్లు వస్తాయి. ఇవి ప్రతి 12.4 గంటలకు ఒకసారి వస్తాయనేది మనకు తెలిసిందే. అప్పుడొచ్చే అలల ఎత్తుకు కూడా సుమారు రెండు వారాల కాలచక్రం ఉంది. వాటిలో ఒకటి 14.8 రోజుల స్ప్రింగ్-నీప్ చక్రం, రెండోది 13.7 రోజుల క్షీణత చక్రం. మొదటిది సూర్యచంద్రుల ఉమ్మడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా వచ్చే ఆటుపోట్లయితే, రెండవది భూమధ్య రేఖకు, చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి సముద్రంలో కలిగే ఆటుపోట్లు.
 
వెహర్ దగ్గర చికిత్స తీసుకుంటున్న రోగులు ఆటుపోట్ల కాలానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తోంది. దీని అర్ధం వాళ్ళు ప్రతి 13.7 రోజులకు లేదా 14.8 రోజులకు ఒకసారి కుంగుబాటుకు గురవుతారని, ఉన్మాదిగా మారతారని కాదు. "ఆ మార్పు ఎంత కాలం తర్వాత వచ్చినా అది చంద్రుడి ప్రభావంతో కలిగే ఆటుపోట్ల కాలంలోని ఏదో ఒక నిర్దిష్ట దశలోనే వస్తోంది" అని వెహర్ అన్నారు. వెహర్ పరిశోధనా ఫలితాలు చదివాక ఆయనతో థామస్ యావరి ఫోన్‌లో మాట్లాడారు. మొదట చెప్పిన ఇంజనీరు మెడికల్ రికార్డులను ఇద్దరూ కలిసి మరోసారి విశ్లేషించారు. అతని మూడ్‌ మార్పులోనూ 14.8 రోజుల క్రమం ఒకటి ఉన్నట్టు కనుగొన్నారు.
 
రోగుల మూడ్ మీద చంద్రుని ప్రభావం గురించి ఇతర ఆధారాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే మామూలుగా క్రమం తప్పకుండా వచ్చే ఈ ఆటుపోట్లకు ప్రతి 206 రోజులకు ఒకసారి ఒక కొత్త అవాంతరం ఏర్పడుతున్నట్టు కనిపిస్తోంది. అది సూపర్ మూన్‌ల సృష్టికి కారణమయ్యే మరో చంద్ర చక్రం కారణంగా ఏర్పడుతోంది. చంద్రుని దీర్ఘ వృత్తాకార కక్ష్య దాన్ని భూమికి అతి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఈ సూపర్ మూన్‌లు ఏర్పడతాయి. స్విట్జర్లాండ్‌లోని బాసెల్ విశ్వవిద్యాలయం మానసిక ఆరోగ్య కేంద్రంలో క్రోనో బయాలజిస్ట్‌గా పని చేస్తున్న యాన్ విర్జ్ జస్టిస్ చాంద్రమాసాలకు, మానసిక రుగ్మతలకు మధ్యనున్న సంబంధం 'నమ్మశక్యం'గానే అనిపిస్తోంది కానీ, కాస్త 'సంక్లిష్టం'గా ఉందని అన్నారు. ఎందుకంటే "ఆ ప్రక్రియలు ఏ విధంగా పని చేస్తున్నాయో మనకేమీ తెలియదు" అన్నారామె.
 
పౌర్ణమి వెన్నెల మనుషుల నిద్రను చెడగొట్టి, తద్వారా వారి మానసిక స్థితిలో మార్పుకు కారణం కావొచ్చనే భావనకు సూత్రప్రాయ ఆమోదం ఉంది. మరీ ముఖ్యంగా బైపోలార్ రోగులలో నిద్ర చెడినప్పుడు, దినచర్యలో తీవ్రమైన మార్పు వచ్చినప్పుడు, షిఫ్ట్‌లలో పని చేసినప్పుడు, సుదూర విమాన ప్రయాణాలు చేసినప్పుడు వారి మూడ్ బాగా దెబ్బతింటుంది. మరోవైపు నిద్రలేమిని ఉపయోగించి బైపోలార్ రోగులను కుంగుబాటు నుంచి బయటకు తీసుకురావొచ్చనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయి. రోగి నిద్రను చంద్రుడు ఏదో విధంగా ప్రభావితం చేస్తున్నాడనే అభిప్రాయాన్ని బలపరుస్తూనే.. "రోజులు గడిచేకొద్దీ వాళ్లు నిద్ర పోయే సమయం పెరుగుతూ పోయి, ఒక దశలో హటాత్తుగా తగ్గిపోతుంది" అని వెహర్ చెప్పారు. 'ఫేజ్ జంప్'గా పిలిచే ఈ దశ తరచూ ఉన్మాద ప్రవర్తనకు దారితీస్తోందని అన్నారు. అయినా సరే, దానికి కారణం చంద్ర కాంతి కాకపోవచ్చని అంటారు వెహర్.
 
"ఆధునిక ప్రపంచంలో కాంతి కాలుష్యం తీవ్రమవ్వడంతో పాటు, మనం నాలుగు గోడల మధ్య కృత్రిమ కాంతిలో గడిపే సమయం పెరిగిపోయింది. అందువల్ల వెన్నెల వెలుగులో వచ్చే తేడాలను గుర్తించడం కష్టం" అని ఆయన తన అభిప్రాయానికి కారణం వివరించారు. ఆయన అనుమానం చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మీద ఉంది. అదే ఈ రోగుల నిద్రను చెడగొట్టి, వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తోందని ఆయన అనుమానిస్తున్నారు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి అయస్కాంత క్షేత్రంలో స్వల్ప కంపనాలను కలగజేస్తోందని, బహుశా కొందరు మనుషులు వాటికి తట్టుకోలేకపోతూ ఉండొచ్చన్న వాదన ఒకటి ఉంది.
 
అయితే, మనుషులలో జీవసంబంధమైన మార్పులు తెచ్చేంతగా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేయగలదా? అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. సౌర శక్తిలో వచ్చే మార్పులకూ, గుండె జబ్బులు, గుండె పోట్లు, మూర్ఛ, సిజోఫ్రేనియా, ఆత్మహత్యల వంటి వాటికీ సంబంధం ఉందని కొన్ని అధ్యయనాలు ఇప్పటికే చెప్పాయి. సౌర మంటలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకినపుడు అదృశ్య విద్యుత్ ప్రవాహాలు విడుదలై విద్యుచ్ఛక్తి ప్రసార వలయాల (గ్రిడ్స్)ను విచ్చిన్నం చేస్తుంటాయని విన్నాం. అలాగే మనిషి గుండెలో, మెదడులో ఉండే విద్యుత్ స్పందన కణాలను కూడా అవి ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.
 
"ఇవి జరిగే అవకాశం ఉందా లేదా అన్నది సమస్య కాదు, ఈ విషయంపై జరిగిన పరిశోధనలు తక్కువ. అందువల్ల ఒక కచ్చితమైన అభిప్రాయం చెప్పడం కష్టం" అన్నారు లండన్ యూనివర్సిటీ కాలేజీలో అంతరిక్ష వాతావరణ నిపుణుడిగా పని చేస్తున్న రాబర్ట్ విక్స్. మరో విషయం ఏమిటంటే - కొన్ని పక్షులకు, చేపలకు, కీటకాలకు ఉన్నట్టుగా మనుషులకు అయస్కాంత గ్రహణం లేదని ఇన్నాళ్ళూ భావిస్తూ వచ్చారు. కానీ, ఈ ఏడాది మొదట్లో ఒక వెల్లడైన అధ్యయనం ఈ అభిప్రాయాన్ని సవాలు చేసింది. మనుషులు అయస్కాంత క్షేత్ర మార్పులకు గురైనపుడు వారి మెదడులోని ఆల్ఫా తరంగాల కదలికలు బాగా తగ్గిపోవడం గమనించారు. మామూలుగా అయితే మనం మెలకువగా ఉండి ఏ పనీ చేయని సమయంలో ఈ తరంగాలు ఉత్పత్తి అవుతాయి. మరి, ఈ తగ్గుదల అర్థం ఏమిటి? అన్నది స్పష్టంగా తెలియడం లేదు. అది మానవ పరిణామ క్రమంలో ఏర్పడి నిరుపయోగంగా మిగిలిపోయిన ఒక స్పందనో, లేక మనకు తెలియని పద్ధతుల్లో అది మన మెదడు రసాయనాలపై ప్రభావం చూపుతున్నదో తెలియడం లేదు.
 
ఈ అయస్కాంత సిద్ధాంతం వెహర్‌కు సమంజసంగానే అనిపించింది. ఎందుకంటే గత దశాబ్దంలో జరిగిన కొన్ని పరిశోధనలు ఒక విషయాన్ని సూచించాయి. ఈగలు లాంటి కీటకాలలో ఉండే క్రిప్టోక్రోమ్ అనే ప్రోటీన్ అయస్కాంత సెన్సర్‌గా కూడా పని చేస్తుండవచ్చనే ఆధారాలు కనిపించాయి. మన 24 గంటల దినచర్యను నియంత్రించే జీవ గడియారంలో క్రిప్టోక్రోమ్ ఒక కీలక భాగం. క్రిప్టోక్రోమ్ ప్రోటీన్ కాంతిని గ్రహించే ఫ్లావిన్ అనే అణువుకు అతుక్కున్నపుడు అది మెదడుకు పగటి సమయం గురించి సంకేతాలు పంపడమే కాకుండా, మొత్తం అణువుల సముదాయాన్ని అయస్కాంత కంపనాలకు స్పందించేలా చేస్తుంది. తక్కువ పౌనః పున్యం గల విద్యుతయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి ఈగలు లాంటి కీటకాల జీవ గడియారాలను మార్పు చేయవచ్చని, తద్వారా వాటి నిద్ర వేళలలో కూడా మార్పు తీసుకురావచ్చని లీసెస్టర్ యూనివర్సిటీలో బిహేవియరల్ జెనెటిసిస్ట్‌గా పని చేస్తున్న బంబోస్ కిరియాకో, ఆయన సహచరులు నిరూపించారు.
 
ఇది మనుషుల విషయంలోనూ అలాగే జరుగుతూ ఉంటే వెహర్, యావరి దగ్గరకు చికిత్స కోసం వచ్చిన బైపోలార్ రోగుల మూడ్‌లో అకస్మాత్తుగా కనిపించే మార్పులకు కారణం తెలిసినట్టే. "మూడ్ మారే సమయంలో వారి జీవ గడియారాలలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. వారి నిద్ర వేళలు, నిద్ర నిడివి కూడా మారిపోతున్నాయి" అని వెహర్ చెప్పారు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి మహాసముద్రాలు ఎలాగైతే ఆటుపోట్లతో స్పందిస్తున్నాయో ఈ రోగులు కూడా అలాగే స్పందిస్తున్నారని అనుకోవచ్చు. మానవ జీవ గడియారంలో కూడా క్రిప్టోక్రోమ్ ఒక అతి ముఖ్యమైన భాగమే అయినప్పటికీ ఈగలలో పని చేసిన దానికి కాస్త భిన్నంగా ఇక్కడ పని చేస్తుంది.
 
"మనుషుల్లో, ఇతర క్షీరదాలలో ఉండే క్రిప్టోక్రోమ్ ఫ్లావిన్ అణువుకు అతుక్కోదు. ఫ్లావిన్ లేకుండా అయస్కాంత కంపనాలకు అదెలా స్పందిస్తుందో మనకు తెలియదు" అంటారు టెడ్డింగ్‌టన్‌లోని జాతీయ భౌతికశాస్త్ర ప్రయోగశాలలో ఫిజిసిస్ట్‌గా పని చేస్తున్న అలెక్స్ జోన్స్. "ఆ విధంగా చూస్తే మానవ క్రిప్టోక్రోమ్‌లలో అయస్కాంత క్షేత్రాలకు స్పందించే గుణం లేకపోవచ్చని అనుకోవాల్సి ఉంటుంది. అయితే, వేరే అణువులకు ఆ లక్షణం ఉంటే ఉండవచ్చు" అని ఆయన వివరించారు. మరో వివరణ ఏమి ఉండవచ్చంటే, చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి మహాసముద్రాలు ఎలాగైతే ఆటుపోట్లతో స్పందిస్తున్నాయో ఈ రోగులు కూడా అలాగే స్పందిస్తున్నారని అనుకోవడం. కానీ, దీనికి వ్యతిరేకమైన వాదన ఒకటి ఇప్పటికే ఉంది. మనుషుల్లో 75 శాతం నీరే ఉన్నా మహాసముద్రాలతో పోలిస్తే అది చాలా చాలా తక్కువనేది ఆ వాదన.
 
"మనుషుల శరీరం నిండా నీరు ఉన్న మాట నిజమే. కానీ, దానిపై గురుత్వాకర్షణ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి భౌతికంగా అదెలా పని చేస్తుందో చెప్పడం కష్టం" అని కిరియాకో అన్నారు. అయితే, ఆయన అరాబాడోప్సిస్ థాలియానా ( పూల మొక్కలపై పరిశోధనలు చేసే జీవశాస్త్రవేత్తలు పరిశోధనకు బాగా పనికొస్తుందని భావించే చిన్న పూల మొక్క) వేర్ల పెరుగుదల కరెక్టుగా 24.8 రోజుల కాలమానం, అంటే ఒక చాంద్రమాసాన్ని అనుసరించి జరుగుతుందని వెల్లడించిన అధ్యయనాలను ఆమోదించారు. "చాలా సున్నితమైన పరికరాలను ఉపయోగించి మాత్రమే వీటిని కనిపెట్టగలం. అయినా ఇప్పటికే 200 పైగా అధ్యయన పత్రాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి" అని జర్మన్ ఫిజిసిస్ట్ జోచిం ఫిసాన్ అన్నారు.
 
"కణంలోని నీటి అణువులు తగ్గడానికి, పెరగడానికి చంద్రుని కక్ష్య కారణంగా గురుత్వాకర్షణ శక్తిలో ఏ రోజుకారోజు వచ్చే మార్పులు చాలు" అని ఫిసాన్ కొన్ని ప్రయోగాల తర్వాత చెప్పారు. "నీటి అణువుల ఘన పరిమాణం ఎంత తక్కువగా ఉన్నా సరే, కొద్దిపాటి గురుత్వాకర్షణ మార్పులకు కూడా స్పందిస్తాయి. దాని పర్యవసానంగా కణంలోని నీటి అణువులు బయటి వైపునకు లేదా లోపలి వైపునకు గురుత్వాకర్షణ దిశను బట్టి కదులుతాయి. దీని ప్రభావం మొత్తం మొక్క మీద ఉంటుంది" అని ఆయన వివరించారు. వేర్ల పెరుగుదలపై ఆయన ఇదే పరీక్ష చేసి చూడాలనుకుంటున్నారు. మొక్కలలోని కణాలపైన అటువంటి ప్రభావం ఉన్నపుడు మానవ కణాలపై మాత్రం ఎందుకు ఉండదు? అని ఆయన అభిప్రాయం.
 
జీవం పుట్టుక మహాసముద్రాలలో మొదలైందని భావిస్తారు. కాబట్టి, అక్కడ్నించి భూమీ మీదకు వచ్చి బతుకుతున్న కొన్ని జీవులలో, అవసరం తీరిపోయినప్పటికీ సముద్రపు ఆటుపోట్లను పసిగట్టే యంత్రాంగం ఇప్పటికీ మిగిలి ఉండొచ్చు. ఆ యంత్రాంగం ఏమిటో మనకు ఇప్పుడు తెలియకపోయినా ఈ వ్యాసం కోసం సంప్రదించిన శాస్త్రవేత్తలెవరూ వెహర్ మౌలిక సూత్రీకరణను వ్యతిరేకించలేదు. తన వద్ద చికిత్స తీసుకుంటున్న బైపోలార్ రోగుల మూడ్‌లో మార్పులు ఒక క్రమం ప్రకారమే ఏర్పడుతున్నాయని, ఈ క్రమం చంద్రుడి గురుత్వాకర్షణ చక్రాలకు అనుగుణంగా సాగుతున్నట్టు కనిపిస్తున్నాయని ఆయన సూత్రీకరణ. ఈ అంతః సంబంధం కచ్చితంగా ఎలా పని చేస్తోందనే దానిపై వెహర్ ఇతరుల అభిప్రాయాలను వినేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయమై మరింత లోతైన పరిశోధనకు వారు దీన్ని ఆహ్వానంగా భావించాలని అయన ఆశిస్తున్నారు. "ఈ ప్రభావం ఎలా కలుగుతోందో నేను చెప్పలేకపోయాను. కానీ, నేను కనుగొన్న విషయాలు అందుకు సంబంధించిన ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి" అని ఆయన అన్నారు.