శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (18:20 IST)

ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా?

ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షా ఐదు వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక లోటును పూడ్చడంతో పాటు, సంక్షేమ పథకాలకు ఈ నిధులను వినియోగించనుంది.
 
అయితే, ప్రభుత్వ కంపెనీలలో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేకించి సంస్థలను ప్రైవేటీకరిస్తే తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని పలు ప్రభుత్వ సంస్థల ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.
 
"ప్రైవేటీకరణను, పెట్టుబడుల ఉపసంహరణను మేము వ్యతిరేకించడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, కంపెనీలు ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్తే ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. రెండోది, ప్రైవేటు సంస్థలు లాభాలు ఆర్జించడం మీదే ఎక్కువ దృష్టిపెడతాయి. ఉద్యోగుల సంక్షేమం, ప్రయోజనాల గురించి పెద్దగా పెట్టించుకోవు. ఇది అనుభవపూర్వకంగా తెలిసిన విషయం" అని బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ బ్రజేష్ ఉపాధ్యాయ్ అన్నారు. అయితే, చట్ట ప్రకారంగానే పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ప్రక్రియ జరుగుతుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అంటున్నారు.
 
"నేను కార్మిక సంఘాలతో మాట్లాడాను. నష్టాలతో నడుస్తున్న కంపెనీలలో పనిచేసేందుకు వాళ్లు ఇష్టపడట్లేదు. లాభాల్లో ఉన్న సంస్థల్లో పనిచేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు" అని రాజీవ్ కుమార్ చెప్పారు. పెట్టుబడులను ఉపసంహరణ అంటే ఒక సంస్థలో ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని అమ్ముతుంది. కానీ, యాజమాన్యం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. దాంతో, ఉద్యోగుల తొలగింపు, బలవంతపు రిటైర్‌మెంట్ల సమస్య ఉండకపోవచ్చు. కానీ, ఒక సంస్థలో ప్రభుత్వం మెజార్టీ వాటాను అమ్మేస్తే (ప్రైవేటీకరణ చేస్తే), అప్పుడు ఆ సంస్థ ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్తుంది.
 
ప్రైవేటు యాజమాన్యాలు ఉద్యోగాలకు కోత విధించడం, రిరైట్మెంట్ తీసుకోవాలని ఉద్యోగులను బలవంతంగా ఒప్పించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో పని సామర్థ్యం, ప్రొఫెషనలిజం తక్కువగా ఉన్నాయన్న కారణాలను చెబుతూ... ప్రైవేటు కంపెనీలు వారిని తొలగిస్తుంటాయి. అయితే, ప్రైవేటు సంస్థలు చెప్పే కారణాలతో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ పి.అభిమన్యు గట్టిగా విభేదిస్తున్నారు.
 
"మా మీద అలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. ప్రైవేటు కంపెనీల ఉద్యోగుల్లాగే, మేము కూడా ప్రొఫెషనల్‌గా పనిచేస్తాం. వినియోగదారులతో ఎలా వ్యవహరించాలి, మంచి ప్రవర్తనను ఎలా అలవర్చుకోవాలి అన్న విషయాలపై మా ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించాం. చాలా స్మార్ట్‌గా పనిచేస్తాం. లక్ష్యాలను చేరుకోగలం. సంస్థ ప్రయోజనాల గురించి ఆలోచిస్తాం" అని ఆయన చెప్పారు. ప్రైవేటీకరణ అంటే అర్థం ఉద్యోగులను రోడ్డున పడేయడం కాదని ఆర్థిక నిపుణుడు వివేక్ కౌల్ అంటున్నారు. ఉద్యోగులను తొలగించేటప్పుడు కంపెనీలు వారికి కొన్ని ప్రయోజనాలను కల్పిస్తాయి. వీఆర్‌ఎస్ తీసుకునే సిబ్బందికి పీఎఫ్, గ్రాట్యుటీ ఇస్తారు" అని చెప్పారు.
 
దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1.75 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ ఇప్పుడు అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతోంది. నిధుల సమీకరణ, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం తోడ్పాటు లేకపోవడం వల్ల బీఎస్ఎన్‌ఎల్ పరిస్థితి దిగజారిపోతోందని అభిమన్యు వ్యాఖ్యానించారు.
 
"బీఎస్‌ఎన్‌ఎల్ మూతపడ్డా పర్లేదు అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. నిధులు నవీకరించరు, పెట్టుబడి పెట్టరు. రియలయన్స్ జియోకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ను నిర్లక్ష్యం చేస్తోంది" అని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించేందుకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ నిరాకరించారు. అవసరానికి మించి ఉద్యోగులు ఉండటం వల్ల బీఎస్ఎన్ఎల్‌కు ఆర్థిక భారం పెరిగిందని ప్రభుత్వం అంటోంది. జీతాల భారాన్ని తగ్గించుకునేందుకు 50 ఏళ్లకు పైబడిన ఉద్యోగులు వీఆర్‌ఎస్ తీసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రభుత్వం రూపొందించిన కంపెనీల జాబితాలో బీఎస్ఎన్‌ఎల్ కూడా ఉందా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎయిర్ ఇండియా ఒకటి. దీని అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సంస్థ ఉద్యోగులు కూడా తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.
 
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం గతేడాదే తలుపులు తెరిచింది. అయితే, సంస్థను కొనుగోలు చేసినవారు ఐదేళ్ల వరకూ ఉద్యోగులను తొలగించకూడదని షరతులు పెట్టింది. కొనుగోలుదారులెవరూ ముందుకు రాలేదు. ఈసారి ప్రభుత్వం ఆ షరతులను సవరించింది. ఐదేళ్ల పరిమితిని, రెండేళ్లకు తగ్గించినట్లు తెలుస్తోంది. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణలకు వెళ్తోంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, 2017- 2018 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 1.82 కోట్ల మంది పురుషులు, 2.72 కోట్ల మంది మహిళలు నిరుద్యోగులుగా ఉన్నారు.
 
2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో 33.3 కోట్ల మంది యువతీయువకులు ఉన్నారు. 2021 నాటికి ఆ సంఖ్య 36.7 కోట్లకు చేరుతుందని అంచనా. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉపాధిపై పీఎల్‌ఎఫ్‌ఎస్ త్రైమాసిక, వార్షిక నివేదికలను విడుదల చేస్తుంటుంది. 2018 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసిక నివేదిక ప్రకారం, దేశంలో అర్హతగల యువతలో ప్రతి ముగ్గురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. 2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం గణాంకాల ప్రకారం, నిరుద్యోగిత రేటు బిహార్‌లో అత్యధికంగా 40.9 శాతం ఉంది. ఆ తర్వాత కేరళలో 37 శాతం, ఒడిశాలో 35.7 ఉండగా, గుజరాత్‌లో అత్యల్ప నిరుద్యోగిత రేటు (9.6 శాతం) ఉంది. నిరుద్యోగితకు సంబంధించి అధికారిక వివరాలు, ఎన్నికలకు ముందు లీకవ్వడంతో అది తుది నివేదిక కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
 
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోవడంతో, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగుపడ్డాయని ప్రభుత్వం అంటోంది. "నరేంద్ర మోదీ హయాంలో దేశంలో సామాన్య ప్రజల జీవనం ప్రమాణాలు చాలా మెరుగుపడ్డాయి. ఇప్పుడు దేశం చాలా సంతోషంగా ఉంది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. దారిద్ర్య రేఖకు దిగువన బతికేవారి సంఖ్య తగ్గింది. ప్రజలకు వంట గ్యాస్, విద్యుత్ అందాయి. రైతులకు ఆర్థిక సాయం అందింది. పేదలకు ప్రభుత్వం భారీ సంఖ్యలో టాయిలెట్లు నిర్మించింది" అని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ వివరించారు.