గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (14:18 IST)

ముంబయి ఎయిర్‌పోర్టులో ముందు చక్రం లేకుండా ల్యాండ్ అయిన నాగ్‌పూర్ విమానం - Newsreel

ఒక పేషెంట్‌తో నాగ్‌పుర్ నుంచి బయలుదేరిన అంబులెన్స్ విమానం ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. జెట్ సర్వ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన విటి-జెఐఎల్ అనే చార్టర్డ్ విమానం నిజానికి నాగ్‌పుర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అయితే, నాగ్‌పూర్‌లో గాల్లోకి పైకి లేస్తున్నప్పుడు దాని ముందు చక్రం ఒకటి ఊడిపోయింది. దాంతో, దాన్ని అత్యవసరంగా ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

 
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ ఆ విమానం ల్యాండ్ అయిన వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఆ విమానం ల్యాండింగ్ కోసం ముంబయి విమానాశ్రయంలో పూర్తి స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. చక్రం లేకుండా ముందు భాగంతో ల్యాండ్ అయితే మంటలు రాకుండా ఉండేందుకు రన్‌వే అంతా నురగతో నింపారు. అలా ఆ విమానం గురువారం రాత్రి 9.09 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది.

 
విమానం దిగిన తరువాత అగ్నిమాపక సిబ్బంది దాన్ని నీళ్లతో చల్లబరిచే ప్రయత్నం చేశారు. విమానంలో ఒక డాక్టర్, ఒక పారామెడిక్, ఒక రోగి, ఇద్దరు విమాన సిబ్బంది మొత్తం అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. రోగిని వెంటనే ముంబయిలోని హాస్పిటల్‌కు తరలించారు.